- Home
- Telangana
- Telangana Rains : తెలుగు రాష్ట్రాల్లో జోరందుకుంటున్న వానలు... ఈ జిల్లాల్లో నేడు వర్షాలే వర్షాలు
Telangana Rains : తెలుగు రాష్ట్రాల్లో జోరందుకుంటున్న వానలు... ఈ జిల్లాల్లో నేడు వర్షాలే వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం ప్రారంభమైన వర్షాలు బుధవారం కూడా కొనసాగుతాయని వాతావరణ విభాగం సూచించింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో ఏఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయో తెలుసా?

ఈ నెలాఖరుపైనే అన్నదాతల ఆశలు
Telugu States Weather Updates : తెలుగు రాష్ట్రాల రైతులకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లని కబురు అందించింది. జూన్ ఆరంభంనుండి వర్షాల కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలను నెలాఖరున కరుణిస్తున్నాడు వరుణుడు. ప్రస్తుతం వాతావరణం మారి వర్షాలు జోరందుకుంటుండటం రైతుల ముఖాల్లో బాధను తొలగించి చిరునవ్వు చిందిస్తోంది. ఈ నెలలో మిగిలిన వారం రోజులైనా వర్షాలు పూర్తిస్థాయిలో కురుస్తాయని ఆశతో ఉన్నారు తెలుగు అన్నదాతలు.
తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు
నైరుతి రుతుపవనాలకు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలు తోడవుతున్నాయి... ఇప్పటికే ఓ ఆవర్తనం కొనసాగుతుండగా దక్షిణ జార్ఖండ్ పరిసరాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని IMD ప్రకటించింది. దీంతో ఈ వారం (జూన్ 25 నుండి 30 వరకు) తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
జూన్ 25 తెలంగాణ వాతావరణం సమాచారం
నేడు (జూన్ 25 బుధవారం) తెలంగాణలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న మంగళవారం కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసాయని... నేడు అవి మరికొన్ని జిల్లాలకు వ్యాపిస్తాయని తెలిపారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని సూచించారు.
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో వర్షసూచనలు ఉన్నాయని తెలిపారు. ఇక హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశాలున్నాయని ప్రకటించారు. అక్కడక్కడ భారీ వర్షాలకు కూడా అవకాశం ఉందని తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
రైతులు, కూలీలు జాగ్రత్త
తెలంగాణలో వర్షాలతో పాటు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. అలాగే అక్కడక్కడ ఉరుములు, మెరుపులు కూడిన వర్షాలుంటాయని… పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరించారు. కాబట్టి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే రైతులు, వ్యవసాయ కూలీలు వర్షం కురిసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చెట్లకింద, తాత్కాలిక నిర్మాణాల్లో ఉండటం ప్రమాదకరమని హెచ్చరించారు.
జూన్ 25 ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు, నైరుతి రుతుపవనాలు యాక్టివ్ గా మారడంతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇక వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ తెలిపింది. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, కాకినాడ, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు.

