ఈ ఏడాది రోహిణి కార్తె ముందు కురిసిన వర్షాలతో అంతా ఖుషీ అయ్యారు. ఈసారి కాలం ముందుగా వచ్చిందని, వర్షాలు బాగా కురుస్తాయని ఆశించారు. అయితే పరిస్థితి దానికి భిన్నంగా మారింది. 

విచిత్ర వాతావరణం

ఈసారి తెలంగాణలో వాతావరణం పూర్తిగా అసాధారణంగా మారిపోయింది. ఎండాకాలంలో వానలు, వానాకాలంలో ఎండలతో ప్రజలు, రైతులు కలవరం చెందుతున్నారు. జనవరి చివరి నుంచి ఎండలు పెరగగా, ఏప్రిల్–మే నెలల్లో మోస్తరు వర్షాలు కురవడం విస్తృత ప్రభావం చూపించింది. మే 27న నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకినప్పటికీ, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు.

రైతుల ఆశలకు వరుణుడు దెబ్బ

మొదటి వానలు కురిసిన వెంటనే రైతులు ఖుషీగా విత్తనాలు వేసినప్పటికీ.. జూన్ తొలి వారానికే వర్షాలు పూర్తిగా ఆగిపోవడంతో భూములు వేరినట్టు అయ్యాయి. వరి, మిర్చి, కంద వంటి పంటలు వేయటానికి సిద్ధమయ్యారు కానీ, మేఘాలు కనుమరుగవడంతో వ్యవసాయం ఆలస్యమవుతోంది. అనేక మండలాల్లో ఎండలు పెరిగిపోవడం, నేలలో తేమ లేకపోవడం వల్ల రైతులు నీటి కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే నాటిన విత్తనాలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది.

నైరుతి వర్షపాతం లోటు

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు వచ్చాక 21 రోజులు గడిచినా.. రాష్ట్రంలో వర్షపాతం గణనీయంగా తగ్గింది. సాధారణంగా ఈ సమయంలో రాష్ట్రంలో 88.9 మి.మీ వర్షం ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం కేవలం 50.7 మి.మీ మాత్రమే నమోదైంది. అంటే 43 శాతం వర్షపాతం లోటుగా ఉంది. రాష్ట్రంలోని 621 మండలాల్లో కేవలం 17 మండలాల్లో మాత్రమే సగటుకు మించి వర్షాలు నమోదయ్యాయి. ఇది ఖచ్చితంగా వ్యవసాయంపై ప్రభావం చూపే అంశం.

ఇలాంటి తరుణంలో గుడ్ న్యూస్

అయితే వర్షాలు కురవడం లేదని దిగాలు చెందుతోన్న ఈ తరుణంలో వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా వివరాల ప్రకారం రాబోయే 48 గంటల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో సాయంత్రం సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశముంది.

ఆంధ్రప్రదేశ్‌కు వర్ష సూచన

అమరావతి వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం, రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడొచ్చని తెలిపింది. గాలుల వేగం గంటకు 40-50 కిమీ ఉండే అవకాశముంది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో తక్కువ మోతాదులో వర్షాలు కురిసే అవకాశముంది.

గడిచిన 24 గంటల్లో కురిసిన వర్షాలు

గత 24 గంటల్లో శ్రీశైలం ప్రాంతంలో అత్యధికంగా 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజమహేంద్రవరం 30 మి.మీ, చిత్తూరు 19 మి.మీ, అమలాపురం 18 మి.మీ, కంభం, కాకినాడలో 13 మి.మీ వర్షం నమోదైంది. యానాం, నెల్లూరు, తణుకు, బాపట్ల, కావలిలో 4-6 మి.మీ మధ్య వర్షాలు పడ్డాయి. తెలంగాణలోనూ వనపర్తి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లాల్లో తక్కువ స్థాయిలో వర్షాలు నమోదయ్యాయి.

మంగళవారం వరకు తెలంగాణలో ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం

నేటి నుంచి మంగళవారం వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, సూర్యాపేట, నల్లగొండ, రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నాగర్‌కర్నూల్‌, హైదరాబాద్ లో సాయంత్రం నుంచి రాత్రి సమయంలో వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు ఉదయం ఎండలు దంచికొట్టే అవకాశం ఉందని తెలిపారు.