సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక అంశం ట్రెండ్ అవుతుంది. ప్రపంచంలో ఎక్కడో మొదలైన ట్రెండ్ మొత్తం వ్యాపిస్తుంది. తాజాగా ఇలాంటి ఓ ట్రెండ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదే 'జీబ్లీ స్టైల్'. యానిమేషన్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంతకీ ఏంటీ జీబ్లీ స్టైల్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోన్న కొన్ని ఫొటోలు చూద్దాం..
ప్రముఖ టెక్ దిగ్గజం ఓపెన్ ఏఐ ఇటీవల చాట్‌జీపీటీలో జీబ్లీ స్టూడియోను రూపొందించింది. జీబ్లీ ఆర్ట్ అనేది జపాన్‌కు చెందిన ప్రముఖ యానిమేషన్ స్టూడియో Studio Ghibli రూపొందించిన యానినిమేషన్ శైలి. స్టూడియో జీబ్లీ 1985లో హయావో మియాజాకి (Hayao Miyazaki), ఇసావో తకహత (Isao Takahata) స్థాపించారు. జీబ్లీ ఆర్ట్ ద్వారా రూపొందించిన ఫొటోల్లో ప్రతీ అంశం హస్తకళతో తయారైన వాటిలా కనిపిస్తుంది. ఇప్పుడు చాట్ జీపీటీలో ఇలాంటి ఫొటోలను క్రియేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు.
దీంతో ఇప్పుడీ స్టైల్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. సినీ, రాజకీయ నాయకులు మొదలు క్రీడాకారుల వరకు అందరికీ సంబంధించిన ఫొటోలను జీబ్లీ స్టైల్‌లో రూపొందిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రెండ్‌లోకి ప్రధాని మోదీ కూడా వచ్చేశారు. ప్రధానికి చెందిన పలు చిత్రాలను ఈ ‘జీబ్లీ ఫీచర్’తో క్రియేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. వాటిని MyGovIndia ఖాతాలో షేర్ చేయగా.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
మోదీతో పాటు టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సైతం ఈ ఫొటోలను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అదే విధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్‌తో పాటు ప్రముఖలకు సంబంధించిన జీబ్లీ స్టైల్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మరి నెట్టింట ట్రెండ్ అవుతోన్న కొన్ని ఫొటోలపై మీరు ఓ లుక్కేయండి.
