వరకట్నానికి సంబంధించి కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వరుడి తరఫున ఎలాంటి డిమాండ్లు లేకున్నా.. వధువు కుటుంబం ఆమెకు ఇచ్చే విలువైన వస్తువులు వరకట్నం కిందకు రావని, అవి కేవలం ఆమె సంక్షేమం కోసం ఇచ్చే కానుకలు మాత్రమేనని పేర్కొంది. కొల్లాంకు చెందిన దంపతుల మధ్య ఆభరణాల గురించిన గొడవ కేరళ హైకోర్టు ముందు విచారణకు వచ్చింది. దీనిపై జస్టిస్ ఎంఆర్ అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు.
తిరువనంతపురం: పెళ్లి(Wedding) జరిగిన తర్వాత దంపతుల(Couple) మధ్య, అత్తవారింట్లో వరకట్నం(Dowry) చర్చ జరగడం ఇంకా సాధారణంగానే ఉన్నది. చాలా కుటుంబాల్లో దంపతుల మధ్య ఘర్షణలకూ ఇది కారణంగా ఉంటున్నది. ముందు వరుడి కుటుంబం డిమాండ్ చేసిన మేరకు వరకట్నం సమర్పించుకున్నా.. ఈ గొడవలు జరుగుతుండటం గమనార్హం. అదనపు కట్నం కోసం వేధింపులు.. దంపతుల మధ్య ఘర్షణలు, విడిపోవడం, ఆత్మహత్యలు, హత్య లు.. ఇలా ఎన్నో రకాల దారుణాలు వరకట్నం చుట్టూ అల్లుకుని ఉన్నాయి. అంతేకాదు, ఇదే వరకట్నం.. వేధింపులకూ ఒక ఆయుధంగా మారుతుండటం మరో కోణం. కానీ, కేరళలో వరకట్నం గురించి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. తాజాగా, కేరళ హైకోర్టు కూడా వరకట్నం పై కీలక ఆదేశాలు వెలువరించింది.
పెళ్లి సమయంలో వరుడి కుటుంబం డిమాండ్ చేయకున్నా.. వధువు తల్లిదండ్రులు ఆమెకు పెట్టుకునే బంగారు ఆభరణాలు, కానుకలు(Gifts) వరకట్నం కాదని కేరళ హైకోర్టు (Kerala High Court) పేర్కొంది. అలాంటి కానుకలు వరకట్నం కిందకు రావని, వాటిని వరకట్న నిషేధ చట్టం కింద పరిగణించలేమని స్పష్టం చేసింది. ఎలాంటి డిమాండ్ లేకుండానే.. తల్లిదండ్రులు తమ వధువుకు ఇచ్చే కానుకలు వరకట్నం కాదని, అవి కేవలం ఆమె సంక్షేమం కోసం ఇచ్చే కానుకలు అని వివరించింది. ఇలాంటి వాటితోపాటు సెక్షన్ 3(1) కింద పొందుపరిచిన జాబితాలోని వస్తువులూ వరకట్నంగా పరిగణించలేమని జస్టిస్ ఎంఆర్ అనిత పేర్కొన్నారు.
Also Read: వరకట్నంపై చట్టాలే కాదు.. సామాజికంగానూ మార్పు రావాలి: సుప్రీంకోర్టు
కొల్లాంకు చెందిన దంపతులు మధ్య గొడవ హైకోర్టుకు చేరింది. కొల్లాం వరకట్న నిషేధ అధికారి ఆదేశాలన సవాల్ చేస్తూ వరుడు (పిటిషనర్) హైకోర్టును ఆశ్రయించాడు. పెళ్లి సమయంలో వధువుకు ఆమె తల్లిదండ్రులు పెట్టిన ఆభరణాలు తిరిగి ఇచ్చేయాలని వరకట్న నిషేధ అధికారి ఆదేశించారు. ఆ ఆభరణాలను దంపతుల పేరు మీద బ్యాంక్ లాకర్‌లో ఉంచారు. అయితే, ఆ దంపతుల మధ్య బంధం బలహీన పడిన తర్వాత ఆమె ఆ ఆభరణాలు తిరిగి ఇచ్చేయాల్సిందిగా కోరింది. అందుకు ఆయన అంగీకరించకపోవడంతో ఆమె వరకట్న నిషేధ అధికారిని ఆశ్రయించారు. ఆ ఆభరణాలు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించాల్సిందిగతా కోరింది. అయితే, ఆ ఆభరణాలు వరకట్నంగా భావించాల్సి వస్తేనే వరకట్న నిషేధ అధికారికి ఆ ఆదేశాలు వెలువరించే అధికారం ఉంటుందని కేరళ హైకోర్టు తెలిపింది. ఈ కేసులో ఆ ఆభరణాలు వరకట్నం కాదు అని పేర్కొంది.
అయితే, వారిద్దరి మధ్య రాజీ కుదిరింది. ఆ ఆభరణాలు తిరిగి ఇచ్చేయడానికి పిటిషనర్ అంగీకరించాడు.
Also Read: వేములవాడ: అత్తింటివారి వరకట్న వేధింపులు తాళలేక... పోలీస్ వాహనం ఎక్కి మహిళ ఆందోళన (Video)
వరకట్నాన్ని నిషేధించడానికి కేరళ ప్రభుత్వం తనదైన శైలిలో కట్టడి చేస్తున్నది. వరకట్న నిషేధ చట్టాన్ని సవరించి ప్రతి జిల్లాకు ఒక వరకట్న నిషేధ అధికారిని నియమించింది. వరకట్న సంబంధ నేరాలు, వేధింపులను నివారించడం ఆయన విధి. పెళ్లి సమయంలో బహూకరించిన విలువైన వస్తువులను మూడు నెలల్లోగా ఆ వధువుకు ట్రాన్స్‌ఫర్ చేయాలని ఆ చట్టం ఆదేశిస్తున్నది.
వరకట్నం సామాజిక సమస్య అనీ, సంఘంలో మార్పు వస్తేనే ఇది పరిష్కారమవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి విషయాల్లో కోర్టులకు పరిమితులు ఉంటాయని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎ.ఎస్.బోపన్నలతో కూడిన ధర్మాసనం తెలిపింది.
