Asianet News TeluguAsianet News Telugu

హిందూత్వ అతివాదుల్లో మితవాది వాజ్ పేయి

దేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికి 23 ఏళ్ల నవ యువకుడైన వాజ్‌పేయి.. భారత తొలి ప్రధాని పండిట్ నెహ్రూ మొదలు ఎల్బీ శాస్త్రి, ఇందిర, రాజీవ్ హయాంలో పాలన తీరు తెన్నులపై నిశిత విమర్శలు సాగించేవారు.

Vajpayee philosophy on Hindutva
Author
New Delhi, First Published Aug 16, 2018, 5:44 PM IST

న్యూఢిల్లీ: హిందూ జాతీయత ప్రాతిపదికన అతివాద రాజకీయాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో మితవాద పార్టీ నేతగా మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ఉంటారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికి 23 ఏళ్ల నవ యువకుడైన వాజ్‌పేయి.. భారత తొలి ప్రధాని పండిట్ నెహ్రూ మొదలు ఎల్బీ శాస్త్రి, ఇందిర, రాజీవ్ హయాంలో పాలన తీరు తెన్నులపై నిశిత విమర్శలు సాగించేవారు. మరోవైపు బీజేపీని బలోపేతం చేయడానికి కలిసొచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేయడంలోనూ.. 1990వ దశకం ప్రారంభంలో లెఫ్ట్ పార్టీలతో పోటీగా ఆందోళనలతో దేశంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీని తీర్చి దిద్దడంలో దిగ్విజయం అయ్యారు వాజ్‌పేయి. 

క్విట్ ఇండియా ఉద్యమ హయాంలో ఇలా

తొలిసారి 1942లో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో సోదరుడు ప్రేమ్‌తో కలిసి పాల్గొని అరెస్టయ్యారు. 23 రోజులు జైలు పాలైన పిమ్మట.. బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో తానిక భాగస్వామిని కాబోనని రాతపూర్వక హామీ ఇచ్చిన తర్వాతే నాటి ప్రభుత్వం ఆయనను వదిలి పెట్టింది. నాటి నుంచి దేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు జాతీయోద్యమ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు వాజ్‌పేయి. 

ఐదేళ్లు ప్రధానిగా పూర్తికాలం పనిచేసిన ఘనత వాజ్ పేయిదే. అంతేకాదు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఐదేళ్లపాటు పూర్తికాలం ప్రధానిగా పని చేసిన కాంగ్రెసేతర పార్టీ నేతగా కూడా వాజ్‌పేయి రికార్డు నెలకొల్పారు. 1996లో తొలిసారి 13 రోజులు, 1998లో 13 నెలలు, 1999 నుంచి 2004 వరకు ఐదేళ్లు ప్రధానిగా పని చేశారు. 2009లో అనారోగ్య కారణాలతో క్రియాశీల రాజకీయాల నుంచి వాజ్‌పేయి తప్పుకున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా పార్లమెంటేరియన్‌గా సేవలందించారు. నాలుగు రాష్ట్రాల నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన ఏకైక నేతగా ఆయన మరో రికార్డు నెలకొల్పారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు. కవిత్వం అంటే ఆయనకు పంచ ప్రాణాలు. జీవిత కాలం బ్రహ్మచారిగా ఉన్న వాజ్‌పేయి.. తర్వాత నమిత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆయన కవి.. సాహిత్యాభిమాని, సాహిత్యకారుడు.. ప్రకృతి ప్రేమికుడు కూడా. దేశంలోకెల్లా ఉత్తమ కవిగా పేరొందిన నేత. సంగీతం, నృత్యం అంటే ఎంతో ఇష్టం. ‘నా కవిత్వం వైఫల్యానికి ముందుమాట కాదు. యుద్ధ ప్రకటన’ అని వ్యాఖ్యానించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో గడిపేందుకు ఇష్ట పడేవారు వాజ్‌పేయి.

వాజ్ పేయికి మాత్రమే ‘ఆరెస్సెస్ ఖాకీ నిక్కర్’ నుంచి మినహాయింపు

పిన్న వయస్సులోనే ఆర్య సమాజ్ యువజన విభాగం ‘ఆర్య కుమార్ సభ’ కార్యక్రమాల్లో పాల్గొన్న వాజ్‌పేయి 1944లో ఆర్య సమాజ్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)కు చెందిన బాబా ఆప్టే ప్రభావంతో ఆయన 1939లో ఆరెస్సెస్‌లో స్వయం సేవక్‌గా చేరారు. కానీ తర్వాత పదేళ్లకు అంటే 1949లో సంఘ్ పూర్తి కాల కార్యకర్తగా నియమితులయ్యారు. ఆరెస్సెస్ యూనిఫాంలో ఖాకీ నిక్కర్ ధరించే విషయంలో వాజ్‌పేయికి మాత్రమే మినహాయింపు ఉంది. 

గ్వాలియర్‌లో వాజ్ పేయి జననం

ప్రస్తుత మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 1924 డిసెంబర్ 25వ తేదీన కృష్ణాదేవి, కృష్ణ బిహారి వాజపేయి దంపతులకు వాజపేయి జన్మించారు. సరస్వతి శిశు మందిర్‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. గ్వాలియర్‌లోని ప్రస్తుత లక్ష్మీభాయి కాలేజీ (విక్టోరియా కాలేజీ)లో హిందీ, ఇంగ్లిష్, సంస్కృత భాషల్లో డిగ్రీ పట్టా అందుకున్నారు. అటుపై కాన్పూర్‌లోని డీఏవీ కళాశాలలో రాజనీతి శాస్త్రంలో ఎంఎ పట్టా పుచ్చుకున్నారు.

పండిట్ నెహ్రూను ఆకర్షించిన వాజ్‌పేయి

వాజ్‌పేయిలో నాయకత్వ లక్షణాలు తొలి భారత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూను ఆకర్షించాయి. ఏదో ఒకరోజు వాజపేయి భారతదేశానికి ప్రధాని అవుతారని పండిట్ నెహ్రూ వ్యాఖ్యానించారట. భారతదేశంలో ఆరెస్సెస్, భారతీయ జన సంఘ్ అటుపై బీజేపీ విస్తరణలో కీలక పాత్ర పోషించిన సంఘ్ నేతల్లో వాజ్‌పేయి ఒకరు. 1948లో జాతిపిత మహాత్మాగాంధీపై నాథూరాం గాడ్సే కాల్పులు జరిపి హత్య చేసిన సంగతి తెలిసిందే. బాపూజీ హత్యోదంతంలో ఆరెస్సెస్ పోషించిన పాత్రపై ఆగ్రహించిన నాటి పండిట్ నెహ్రూ ప్రభుత్వం సదరు సంస్థను నిషేధించింది. దీంతో సంఘ్ కార్యక్రమాల నిర్వహణకు ఆవిర్భవించిందే భారతీయ జన్ సంఘ్. 

1951లో భారతీయ జన్ సంఘ్ ఇలా ఆవిర్భావం

ఆరెస్సెస్‌పై నిషేధం విధించడంతో 1951లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ తదితరుల సహకారంతో భారతీయ జన్‌సంఘ్‌ను స్థాపించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉత్తర భారతంలో దాని విస్తరణకు పని చేశారు. దీన్ దయాళ్ మరణం తర్వాత అనూహ్య రీతిలో 1968లో యువకుడిగా ఉన్న వాజ్‌పేయి భారతీయ జన్‌సంఘ్ అధ్యక్ష బాధ్యతలు అందుకోక తప్పలేదు. నానాజీ దేశ్‌ముఖ్, ఎల్ కే అద్వానీ తదితరులతో కలిసి భారతీయ జన్ సంఘ్‌కు జాతీయ ప్రాముఖ్యం తేవడంలో వాజ్ పేయి కీలక భూమిక పోషించారు. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేసినా 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాకిస్థాన్‌పై యుద్ధం చేసి విజయం సాధించినందుకు ప్రధాని ఇందిరాగాంధీని ‘దుర్గామాత’ అని కొనియాడారు. 

ఇలా చైనా దురాక్రమణపై నిరసన

1962 అక్టోబర్ 20వ తేదీన చైనా దురాక్రమణకు పాల్పడితే అదే నెల 26వ తేదీన నెహ్రూ ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించింది. అదే రోజు తన నలుగురు సహచర ఎంపీలతో కలిసి ప్రధాని నెహ్రూను కలుసుకున్న వాజ్‌పేయి తక్షణం పార్లమెంట్‌ను సమావేశం పర్చాలని డిమాండ్ చేశారు. సరిహద్దుల్లో దురాక్రమణకు పాల్పడిన చైనాకు ఎలా బుద్ది చెప్పాలన్న వ్యూహంపై పార్లమెంట్‌లో చర్చించాలని ప్రతిపాదించారు. నాటి వాజ్‌పేయి వయస్సు కేవలం 36 ఏళ్లు. అటు పండిట్ నెహ్రూ 72వ పడిలో పడ్డారు. అంటే వాజ్‌పేయి కంటే పండిట్ నెహ్రూ వయస్సు రెండింతలు ఎక్కువ. అయినా ఎంతో అనుభవశాలిగా పేరు గడించిన పండిట్ నెహ్రూ.. యువ నేత వాజ్‌పేయి ప్రతిపాదనను మన్నించి 1962 నవంబర్ ఎనిమిదో తేదీన పార్లమెంట్‌ను సమావేశ పర్చారు. 

ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో వాజ్‌పేయి ఇలా

1975 జూన్ 25వ తేదీన నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. దీనికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఇతర విపక్షాలతోపాటు వాజ్ పేయి, ఎల్కే అద్వానీ తదితరులు పాల్గొన్నారు. విపక్ష నేతలతోపాటు ఆయన కూడా జైలు పాలయ్యారు. ఇందిరాగాంధీ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య సమర యోధుడు జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) సంపూర్ణ విప్లవానికి పిలుపునిచ్చారు. విపక్ష పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకువచ్చారు. జేపీ స్థాపించిన జనతా పార్టీలో భారతీయ జన్ సంఘ్‌ను వాజ్‌పేయి విలీనం చేశారు. 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని జనతా పార్టీ ఓడించింది. ఆ తర్వాత కొలువు దీరిన మొరార్జీ దేశాయి ప్రభుత్వంలో వాజ్‌పేయి విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పుడే ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ సమావేశంలో హిందీలో ప్రసంగించిన తొలి విదేశాంగశాఖ మంత్రిగా వాజ్‌పేయి రికార్డు నెలకొల్పారు. 1979లో అంతర్గత కుమ్ములాటల వల్ల మొరార్జీ దేశాయి సర్కార్ కుప్పకూలింది. తర్వాత చరణ్ సింగ్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్కార్ కొలువు దీరినా మూణ్ణాళ్ల ముచ్చటే అయింది. ఇటు భారతీయ జన్ సంఘ్, అటు జనతా పార్టీలో ద్వంద్వ సభ్యత్వం వివాదాస్పదమైంది. ఈ క్రమంలో భారతీయ జన్ సంఘ్ సభ్యులంతా జనతా పార్టీ నుంచి బయటకు రాక తప్పలేదు. 

1980లో బీజేపీ స్థాపన ఇలా

వాజ్‌పేయి తనతోపాటు ఆరెస్సెస్, భారతీయ జన్‌సంఘ్ కలిసి పనిచేసిన ఎల్ కే అద్వానీ, భైరాన్ సింగ్ షెకావత్ తదితరులతో కలిసి బీజేపీని స్థాపించారు. ఆ పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా వాజ్‌పేయి పని చేశారు. జనతా పార్టీ సర్కార్ తర్వాత కేంద్రంలో 1980లో కొలువు దీరిన కాంగ్రెస్ పార్టీ నేత ఇందిరాగాంధీ సర్కార్ పనితీరుపై నిశిత విమర్శలు చేసేవారు. 1980 తర్వాత పంజాబ్‌లో పెరుగుతున్న ఖలిస్థాన్ ఉద్యమం పట్ల వాజ్ పేయి ఆందోళన వ్యక్తం చేశారు. వ్యతిరేకించారు. విభజన, అవినీతి మయ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని నాటి ప్రధాని ఇందిరపై విమర్శలు చేశారు. ఇది దేశ ఐక్యతకు, జాతి సమగ్రతకు ముప్పుగా పరిణమిస్తుందని హెచ్చరించారు. వేర్పాటువాదులను ఏరివేసేందుకు ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ అమలు చేసినందుకు ప్రధాని ఇందిరాగాంధీపై అదే ఖలిస్థాన్ ఉద్యమం పగ పెంచుకున్నది. చివరకు 1984 అక్టోబర్ 31వ తేదీన ఖలిస్థాన్ ఉద్యమం ఇందిరాగాంధీని పొట్టనబెట్టుకున్నది. అది వేరే సంగతి. ఇందిరగాంధీ దారుణ హత్యతో కాంగ్రెస్ పార్టీ పట్ల వెల్లువెత్తిన సానుభూతితో 1984లో రాజీవ్ గాంధీ సారథ్యంలో ఘన విజయాలు సాధించింది. బీజేపీ మాత్రం రెండు స్థానాలకు పరిమితమైంది. 

రామజన్మభూమి వివాదం బీజేపీ రాజకీయ అస్త్రం

1984లో రెండు స్థానాలకు పరిమితమైన బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ‘అయోధ్యలో రామ జన్మభూమి’ అంశంపై ఆరెస్సెస్, విశ్వహిందూపరిషత్ (వీహెచ్‌పీ) ప్రచారోద్యమానికి తెర తీశాయి. అయోధ్యకు ‘శిలాన్యాస్’ ఉద్యమం చేపట్టాయి. ప్రధాని రాజీవ్ కూడా రాజకీయ అవసరాల కోసం అవకాశ వాదంగా వ్యవహరించారన్న విమర్శ ఉంది. ‘అయోధ్యలో రామ జన్మభూమి’ ప్రచారోద్యమాన్ని బీజేపీని రాజకీయ అస్త్రంగా మార్చుకున్నది. ఇటు కాంగ్రెస్ పార్టీలో ‘బోఫోర్స్ కుంభకోణం’ విశ్వనాథ ప్రతాప్ సింగ్ బయటకు వచ్చేలా చేసింది. రాజీవ్ గాంధీపై ఆరోపణలకు నేపథ్యమైన బోఫోర్స్ కుంభకోణంతో 1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ రాజీవ్ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాలేదు. ఇటు బీజేపీ, అటు లెఫ్ట్ పార్టీల మద్దతుతో వీపీ సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

1990లో మండల్ వర్సెస్ కమండల్ రాజకీయం

1990లో ఓబీసీలకు రిజర్వేషన్ల కోసం ‘మండల్’ కమిషన్ సిఫారసులను అమలు చేసేందుకు వీపీ సింగ్ సమయాత్తం అయ్యారు. దీంతో కమలనాథులూ అప్రమత్తం అయ్యారు. ప్రస్తుత బీజేపీ అగ్రనేత అద్వానీ సారథ్యంలో అయోధ్యకు రథయాత్ర చేపట్టారు. అయితే బీహార్ లో నాటి జనతాదళ్ ప్రభుత్వానికి సారథ్యం వహించిన లాలూ ప్రసాద్ యాదవ్.. అద్వానీని నిలువరించి అరెస్ట్ చేయించారు. దరిమిలా వీపీ సింగ్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకున్నది. తర్వాత పరిణామాల్లో వీపీసింగ్ స్థానే చంద్రశేఖర్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినా కొద్దికాలమే సాగింది. 1991 మధ్యంతర ఎన్నికల సమయంలో ఎల్టీటీఈ ఉగ్రవాదుల చేతిలో రాజీవ్ గాంధీ హతమయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించగా, బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది.

1992లో ఇలా అయోధ్యలో కరసేవ.. బాబ్రీ మసీదు కూల్చివేత

పీవీ నర్సింహారావు హయాంలో 1992 డిసెంబర్ ఆరో తేదీన అయోధ్యలో బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చేశారు. ఇందులో ప్రస్తుత బీజేపీ అగ్రనేత అద్వానీ తదితరులు పాల్గొన్నారు. 1991 - 96 మధ్య ప్రధాన విపక్షంగా ఉన్న బీజేపీ 1995లో మహారాష్ట్ర, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడం ఊత్సాహాన్నిచ్చింది. అంతకుముందు 1994లో కర్ణాటకలోనూ మంచి ఫలితాలు రావడంతో బీజేపీకి రాజకీయ ప్రాముఖ్యం ఏర్పడింది. 1995 నవంబర్‌లో ముంబైలో జరిగిన బీజేపీ సదస్సులో 1996 ఎన్నికల్లో తమ ప్రధాని అభ్యర్థిగా వాజ్‌పేయిని ఆయన సహచరుడు అద్వానీ ప్రకటించారు.

1996లో అతిపెద్ద పార్టీగా బీజేపీ

1996 ఎన్నికల్లో జాతీయ వాద నినాదంతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఆ పార్టీ నేత వాజ్‌పేయితో అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ప్రధానిగా ప్రమాణం చేయించారు. కానీ లోక్‌సభలో విశ్వాస పరీక్షలో నెగ్గడానికి అవసరమైన సంఖ్యాబలం సమకూర్చుకోలేక 13 రోజులకు ప్రధాని పదవికి వాజ్‌పేయి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో 1996 - 98 మధ్య రెండు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు కొలువు దీరినా మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది.

1998లో ఇలా రెండోసారి ప్రధానిగా వాజ్‌పేయి

ఆ ప్రభుత్వాలు పతనం కావడంతో 1998 మధ్యంతర ఎన్నికల్లోనూ బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కొన్ని మధ్యేవాద పార్టీల మద్దతుతో వాజ్‌పేయి రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. మలిదఫా ప్రధానిగా వాజ్‌పేయి.. రాజస్థాన్ పోఖ్రాన్‌లో అణ్వస్త్ర పరీక్షలు చేసినందుకు అమెరికాతోపాటు అంతర్జాతీయ సమాజం ఆంక్షలు విధించింది. ఆరు నెలల తర్వాత ఆ ఆంక్షలు ఎత్తేశాయి. 

1999 ఏప్రిల్ 19న వాజ్‌పేయి ప్రభుత్వం పతనం
వాజ్‌పేయి 

సర్కార్‌కు 1999 ఏప్రిల్‌లో నాటి అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి జయలలిత మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో 1999 ఏప్రిల్ 19వ తేదీన ఆయన ప్రవేశ పెట్టిన విశ్వాస తీర్మానం ఒక్కఓటు తేడాతో వీగిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు ఫలించలేదు. దరిమిలా 1999లో మధ్యంతర ఎన్నికలు జరిగే వరకు వాజ్‌పేయి ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు 1998 చివరిలోనూ, 1999 ప్రారంభంలోనూ పాకిస్థాన్‌తో పూర్తిస్థాయి శాంతి చర్చల కోసం వాజ్‌పేయి తీవ్రంగా ప్రయత్నించారు. ఆయన హయాంలోనే 1999 ఫిబ్రవరిలో ఢిల్లీ - లాహోర్ బస్సు సర్వీస్ ప్రారంభం కావడంతో కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశ కలిగింది. 

1999లో కార్గిల్ యుద్ధం.. ఆపరేషన్ విజయ్ విజయవంతం

కానీ కశ్మీర్ సరిహద్దుల్లోకి పాకిస్థాన్ సైన్యం, ఉగ్రవాదులు చొచ్చుకువచ్చారు. కార్గిల్ ప్రాంతంలోకి చొచ్చుకుని వచ్చారు. దీనికి ప్రతిగా ‘ఆపరేషన్ విజయ్’ చేపట్టింది. మూడు నెలల పాటు సాగిన యుద్ధంలో 500 మందికి పైగా భారత జవాన్లు అమరులయ్యారు. మరోవైపు పాకిస్థాన్ వైపు 600 మంది నుంచి 4000 మంది మిలిటెంట్లు, సైన్యం హతమయ్యారు. ఈ వెలుగులో జరిగిన 1999 మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. 1999 అక్టోబర్ 13వ తేదీన ప్రధానిగా వాజ్‌పేయి ముచ్చటగా మూడోసారి ప్రమాణం చేశారు. నాటి నుంచి 2004 ఎన్నికల్లో ఎన్డీయే ఓటమి పాలయ్యే వరకు ప్రధానిగా కొనసాగారు. 

2009లో అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరం

2004 ఎన్నికల్లో లక్నో నుంచి లోక్‌సభకు ఎన్నికైనా 2009 ఎన్నికల ముందు అనారోగ్య కారణాలతో క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. నాటి నుంచి ఇంటికే పరిమితం అయ్యారు. తర్వాత 2014లో కేంద్రంలో నరేంద్రమోదీ సారథ్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాజ్ పేయి జన్మదినోత్సవం ‘డిసెంబర్ 25’ను సుపరిపాలనా దినోత్సవంగా గడుపుతున్నది. 2015 మార్చిలో ఆయనకు భారత్ రత్న అవార్డును కేంద్రం ప్రదానం చేసింది. ప్రస్తుత బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ, 2004లో సోదరుడి చేతిలో హత్యకు గురైన ప్రమోద్ మహాజన్ తన సోదరులని వాజ్‌పేయి ప్రకటించుకున్నారు.

కాందహార్‌లో ఉగ్రవాదుల అప్పగింత

1999 డిసెంబర్‌లో ఖాట్మండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని ఐదుగురు ఉగ్రవాదులు హైజాక్ చేశారు. మసూద్ అజర్ వంటి ఉగ్రవాదులను అప్పగించాలని షరతు విధించారు. దేశవ్యాప్త ఒత్తిడి పెరుగడంతో వాజ్‌పేయి సర్కార్ దిగి వచ్చింది. అప్పటి విదేశాంగశాఖ మంత్రి జశ్వంత్‌సింగ్ సారథ్యంలో మసూద్ అజర్ తదితరులను ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహర్‌లోని ఉగ్రవాదులకు అప్పగించి, ప్రయాణికులను విడిపించారు.

2000లో భారత్‌లో క్లింటన్ పర్యటన.. ముషారఫ్‍తో చర్చలు విఫలం


2000లో వాజ్‌పేయి హయాంలో భారతదేశంలో పర్యటించిన తొలి విదేశీ నేత అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్. కార్గిల్ యుద్ధానికి సారథ్యం వహించిన పాక్ సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్‌ను ఢిల్లీకి ఆహ్వానించి శాంతి చర్చలు జరిపారు. కానీ ముషారఫ్‌తో ఆగ్రాలో జరిగిన చర్చలు అర్ధంతరంగా ముగిశాయి. 

2001 డిసెంబర్‌లో పార్లమెంట్‌పై ‘ఉగ్రవాద’ దాడి


వాజ్‌పేయి హయాంలోనే 2001 డిసెంబర్ 13వ తేదీన ఉగ్రవాద ముష్కరులు పార్లమెంట్‌పై సైనికుల మాదిరిగా నకిలీ ఐడీ కార్డులతో దాడిచేశారు. భద్రతా సంస్థలు అప్రమత్తం కావడంతో ప్రధాని, లోక్‌సభ స్పీకర్, ఉపరాష్ట్రపతి తదితర ప్రముఖులకు గానీ, ఎంపీలకు గానీ హానీ జరుగకపోయినా పలువురు భద్రతా జవాన్లు హతమయ్యారు. భద్రతా సంస్థల దాడిలో ఉగ్రవాద ముష్కరులు మరణించారు. ఆ తర్వాతే పంజాబ్, రాజస్థాన్, జమ్ముకశ్మీర్, గుజరాత్ రాష్ట్రాల పరిధిలోని దేశ సరిహద్దుల్లో ఐదు లక్షల మంది సైనికులను నియోగించాలని ప్రధానిగా వాజ్‌పేయి ఆదేశించారు.

పార్లమెంట్ ఉమ్మడి సమావేశంలో చట్టంగా ‘పోటా’ ఇలా


విపక్షాల మధ్య గట్టి వ్యతిరేకత మధ్యే ఉగ్రవాదులను అణచివేసేందుకు వాజ్‌పేయి పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ‘పోటా’ చట్టాన్ని ఆమోదించారు. 2002లో గోధ్రా ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ దహనం తర్వాత గుజరాత్‌లో చోటు చేసుకున్న అల్లర్లు వాజ్‌పేయి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చి పెట్టాయి. ప్రస్తుత ప్రధాని, నాటి గుజరాత్ సీఎం నరేంద్రమోదీ ‘రాజధర్మం’ పాటించలేదని బహిరంగంగానే వాజ్‌పేయి అభిశంసించారు. 2004 ఎన్నికల్లో ఓటమి పాలైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ లోక్‌సభలో విపక్ష బాధ్యతలు స్వీకరించడానికి నిరాకరించారు. 

వాజ్‌పేయి వారసుడిగా అద్వానీ


1999 - 2004 మధ్య కాలంలో వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పడు హిందుత్వ వాదాన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకోవడం లేదన్న అభిప్రాయంతో వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ తదితర సంస్థలు మళ్లీ అయోధ్య వివాదాన్ని రగిల్చాయి. బీజేపీ నాయకత్వం కూడా వికాశ్ పురుష్‌గా వాజ్పేయిని, లోహ్ పరుష్‌గా అద్వానీని ప్రజల ముందు నిలిపేందుకు ప్రయత్నించింది. క్రమంగా వాజ్‌పేయికి రాజకీయ వారసుడిగా అద్వానీని ముందుకు తెచ్చేందుకు కమలనాథులు, సంఘ్ పరివార్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 

ఈ వార్తలు చదవండి

కూలిన శిఖరం: వాజ్‌పేయ్ ఇకలేరు

వాజ్ పేయి మంచి హిందీ కవి కూడా..

వాజ్ పేయి మంచి హిందీ కవి కూడా....

వాజ్‌పేయ్: బీజేపీ ఏర్పాటులో కీలక పాత్ర, మూడు దఫాలు ప్రధానిగా

వాజ్‌పేయ్: 24 ఏళ్ల తర్వాత ఫోఖ్రాన్ అణు పరీక్షలతో సత్తా

పార్లమెంట్‌పై ఉగ్రదాడి: తృటిలో తప్పించుకొన్న వాజ్‌పేయ్, అద్వానీ

వాజ్ పేయి జీవితంలో అత్యంత చేదు ఘటన ఇదే

అటల్ జీ పెళ్లెందుకు చేసుకోలేదు...?

వాజ్ పేయి అభిమాన నేత ఎవరంటే...

ఒక్క ఓటుతో కుప్పకూలిన వాజ్‌పేయ్ సర్కార్

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios