Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అసలీ గందరగోళం ఏంటి.?
Indigo Crisis: ఇండిగో ఎయిర్‌లైన్స్ వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దేశంలోని పలు విమానాశ్రయాల్లో ఇండిగో విమానాలు వరుసగా రద్దు అవుతుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలీ గందరగోళం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో గందరగోళం
దేశంలోని పలు విమానాశ్రయాల్లో ఇండిగో విమానాలు వరుసగా రద్దు అవుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజుల్లోనే 1,000కిపైగా ఫ్లైట్లు రద్దు అయ్యాయి. దీంతో ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన హబ్‌లలో భారీ క్యాన్సిలేషన్‌లు నమోదయ్యాయి. ఎయిర్‌పోర్ట్ కౌంటర్ల వద్ద లైన్లు, ఉద్రిక్తతలు, ప్రయాణికుల నిరాశ స్పష్టంగా కనిపించే స్థాయికి పరిస్థితి దిగజారిపోయింది. ఇండిగో సంస్థ మాత్రం దీనికి “అనివార్య సాంకేతిక సమస్యలు, వాతావరణం, షెడ్యూల్ మార్పులు, ట్రాఫిక్” వంటి కారణాలను చూపుతోంది. కానీ అసలు సమస్య మాత్రం వేరే.
అసలు కారణం ఏంటి.?
విమాన సిబ్బంది అలసట నివారించేందుకు ప్రభుత్వం Flight Duty Time Limitations (FDTL) అనే కొత్త విశ్రాంతి-పని గంటల నియమాలను ప్రవేశపెట్టింది. ఇవి జనవరి 2024లో ప్రకటించినప్పటికీ, ఇటీవలే కఠినంగా అమల్లోకి వచ్చాయి. కొత్త నియమాల ప్రకారం.. వారానికి 48 గంటల విశ్రాంతి తప్పనిసరి (ముందు 36 గంటలు). రాత్రి డ్యూటీ సమయం 12 గంటలు నుంచి 00:00–06:00 వరకు పొడిగించారు. ప్రతి పైలట్‌కు వారంలో కేవలం రెండు రాత్రి ల్యాండింగ్స్ మాత్రమే ఉంటాయి. రాత్రి సమయంలో గరిష్టంగా 8 గంటల ఫ్లైయింగ్ మాత్రమే ఉండాలి. ఈ నియమాలు అమల్లోకి వచ్చాక చాలా మంది పైలట్లు తప్పనిసరి విశ్రాంతిలోకి వెళ్లిపోయారు. అదే సమయంలో ఇండిగో వింటర్ షెడ్యూల్ పెంచడంతో సిబ్బంది కొరత మరింత పెరిగింది. ఒక చిన్న సర్దుబాటు కారణంగా కొన్ని ఫ్లైట్లు అర్ధరాత్రి దాటడంతో, కొత్త రూల్స్ ప్రకారం అవి వెంటనే రద్దు చేయాల్సి వచ్చింది. ఈ ఆలస్యాలు వరుసగా మరిన్ని క్యాన్సిలేషన్‌లకు దారి తీశాయి.
అదే పెద్ద సమస్యగా మారింది
ఇండియా మొత్తం మీద రోజుకు 2,200 ఫ్లైట్లు నడిపేది ఇండిగో. ఏ చిన్న గందరగోళం జరిగినా దాని ప్రభావం భారీగా ఉంటుంది. 10% డిస్టర్బెన్స్ అంటేనే 200–400 ఫ్లైట్లపై ప్రభావం పడుతుంది. వేలాది ప్రయాణికుల ఇబ్బంది పడుతారు. కేవలం ఒక్కరోజులోనే ఢిల్లీలో 135 డిపార్చర్లు, 90 అరైవల్స్, బెంగళూరులో 50 డిపార్చర్లు, 52 అరైవల్స్ రద్దయ్యాయి. కాగా హైదరాబాద్‌లో 92 క్యాన్సిలేషన్‌లు అయ్యాయి. ఇలా దేశవ్యాప్తంగా 48 గంటల్లోనే 600కిపైగా ఫ్లైట్లు రద్దయ్యాయి. ఇది ఇండిగో 20 ఏళ్ల చరిత్రలోనే పెద్ద అంతరాయం
DGCA జోక్యం – పైలట్ విశ్రాంతి రూల్‌లో మార్పు
సమస్య తీవ్రమైన నేపథ్యంలో DGCA వెంటనే జోక్యం చేసుకుని ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రూల్స్‌లోని “వారానికి ఇచ్చే విశ్రాంతి స్థానంలో లీవ్స్ వాడరాదు” అనే నిబంధనను తిరస్కరించింది. దీంతో ఎయిర్‌లైన్స్ పైలట్లను మళ్లీ రోస్టర్‌లో చేర్చుకునే వెసులుబాటు వచ్చింది. ఇండిగోకు ఇది కొంత ఊరటనిచ్చే నిర్ణయం. ఇది కొత్త FDTL నియమాల్లో వచ్చిన మొదటి సడలింపు. అంటే ప్రభుత్వం కూడా ఈ మార్పుకు ఎయిర్‌లైన్స్ సిద్దంగా లేవన్న విషయాన్ని అంగీకరించినట్లే.
ఇండిగోపై పైలట్ల ఆరోపణలు
కాగా పైలట్ సంఘాలు మాత్రం తప్పు పూర్తిగా ఇండిగో నిర్వహణదేనని అంటున్నాయి. కొత్త రూల్స్ వస్తాయని తెలిసినా పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టలేదని, తక్కువ సిబ్బందితో ఎక్కువ షెడ్యూల్ నడపడం, ఖర్చులు తగ్గించేందుకు మానవ వనరులు తగ్గించడం, రూల్స్ ప్రకారం పైలట్ లభ్యతను పరిగణలోకి తీసుకోకుండా వింటర్ షెడ్యూల్ పెంచడం వంటి వాటివాల్లే ఈ సమస్య వచ్చిందని అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇండిగో కావాలనే గందరగోళాన్ని పెంచి DGCAని సడలింపులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చిందా? అని కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇండిగో ఫిబ్రవరి 10, 2026 వరకు సమయం కావాలని DGCAకి తెలిపింది. మరికొన్ని రోజుల్లో ఫ్లైట్లను తగ్గించి కార్యకలాపాలను స్థిరపరిచే ప్రయత్నం చేస్తోంది.

