Uttarakhand Flash Floods: ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు భయానక పరిస్థితులు సృష్టించాయి. 60 మంది గల్లంతయ్యారు. పలు ఇళ్లు, హోటళ్లు నీట మునిగాయి. ధరాలీ గ్రామం మునిగింది.

Uttarakhand Flash Floods: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో మంగళవారం ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. తీవ్ర బీభత్సాన్ని సృష్టించాయి. ముఖ్యంగా ధరాలీ గ్రామం ఈ ప్రకృతి విపత్తుతో భయంకరంగా దెబ్బతిన్నది. ఖీర్‌గఢ్ ప్రాంతంలో జరిగిన క్లౌడ్ బరస్ట్‌ (cloudburst) కారణంగా ఊహించని వరదలు వచ్చి గ్రామాన్ని ముంచెత్తాయి. ఈ సంఘటనలో ఇప్పటివరకు కనీసం 60 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. 20-25 హోటళ్లు, నివాసాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కొన‌సాగుతున్న రెస్క్యూ బృందాల చ‌ర్య‌లు

ఈ క్ర‌మంలోనే వెంటనే ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఐటీబీపీ సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం భారత సైన్యాన్ని అప్రమత్తం చేసి రంగంలోకి దించింది. శిథిలాల కింద చిక్కుకున్నవారిని బయటికి తీసేందుకు ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతున్నాయి. రహదారులు కొట్టుకుపోవడం వల్ల గంగోత్రి మార్గంలో రవాణా పూర్తిగా నిలిచిపోయింది.

Scroll to load tweet…

ముఖ్యమంత్రి ధామి, అమిత్ షా స్పందన

ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సహాయ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. 

ధరాలీలో జరిగిన విపత్తు మనసు కలిచివేసింది. ప్రజల సురక్షతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం" అని పేర్కొన్నారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ప్రజల క్షేమం కోసం దేవుడిని ప్రార్థిస్తున్నాము : పుష్కర్ సింగ్ ధామి

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సీఎం ధామికి ఫోన్ చేసి వివ‌రాలు తెలుసుకున్నారు. కేంద్రం తరపున అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

భారీ వ‌ర్షాల‌తో కెమెరాల్లో చిక్కిన భయానక దృశ్యాలు

వర్షాల తాకిడికి ఇళ్లు, భవనాలు నిమిషాల్లో కూలిపోయిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. "గ్రామం మొత్తం కొట్టుకుపోయింది" అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పలు వీడియోల్లో ప్రజలు కేకలు వేస్తూ ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. బలమైన నీటి ప్రవాహం భారీ వృక్షాలను సైతం కూల్చేసింది.

Scroll to load tweet…

వాతావరణ శాఖ హెచ్చరికలు

భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. కొండ ప్రాంతాల్లో ‘రెడ్ అలర్ట్’తో పాటు ఈ వారం మొత్తానికి ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని సూచించారు. ఉత్తరాఖండ్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్‌లో సైతం భారీ వర్షాలు కురుస్తుండటంతో 310 రహదారులు మూసివేశారు.

Scroll to load tweet…

ఇప్పటికే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. రుద్రప్రయాగ్, ఉద్ధమమ్ సింగ్ నగర్ జిల్లాల్లో వరదలు, కొండచరియల విరిగిపడటం వల్ల ప్రాణ నష్టాలు సంభవించాయి. ఇప్పటికే హరిద్వార్‌లో గంగా నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. మరోవైపు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు.

Scroll to load tweet…