విద్యుత్ రంగంలో యూపీ కొత్త అధ్యాయం : యోగి సర్కారా మజాకా!
ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్ ఉత్పత్తిని పెంచడానికి యోగి ప్రభుత్వం హైడ్రో ఆధారిత ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించింది. మీర్జాపూర్, చందౌలీ, సోన్‌భద్రలో ఏర్పాటు చేయనున్న 6 ప్లాంట్ల ద్వారా 4730 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది.
లక్నో : ఉత్తరప్రదేశ్‌ను విద్యుత్ రంగంలో కూడా అగ్రగామిగా నిలపడానికి యోగి ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలో పెరుగుతున్న పారిశ్రామిక కార్యకలాపాలకు రికార్డు స్థాయిలో విద్యుత్ అవసరం అవుతుంది... కాబట్టి ఎలాంటి లోటు లేకుండా విద్యుత్ ను ఉత్పత్తిచేసే పనిని ప్రారంభించింది ప్రభుత్వం. ముఖ్యంగా క్లీన్ ఎనర్జీ రంగాలపై యోగి సర్కార్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో సౌర విద్యుత్‌ను ప్రోత్సహించడంతో పాటు జల ఆధారిత ప్రాజెక్టుల దిశగా కూడా కృషి చేస్తోంది
. ఉత్తరప్రదేశ్ ను జల విద్యుత్ కేంద్రాలకు నిలయంగా మార్చాలనేది సీఎం యోగి ప్లాన్. ఈ దిశగా మీర్జాపూర్, చందౌలీ,సోన్‌భద్రలు కీలక పాత్ర పోషించనున్నాయి. ముఖ్యంగా విద్యుత్ ప్లాంట్లకు రాష్ట్రంలోనే అతిపెద్ద కేంద్రంగా మీర్జాపూర్ ను తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ వివిధ సామర్థ్యాలతో 4 ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. అదే సమయంలో సోన్‌భద్రలో ఏర్పాటు కానున్న ప్లాంట్ అత్యధిక విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. చందౌలీలో కూడా భారీ ప్లాంట్ ఏర్పాటు కానుంది.
6 ప్లాంట్ల ద్వారా 4730 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటుచేయనున్న 6 ప్లాంట్ల ద్వారా 4,730 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా యోగి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ ప్లాంట్లన్నింటికీ ఆగస్టు నెలలో క్లియరెన్స్ లభించింది, వీటి స్థాపన, నిర్మాణం, అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ 6 ప్లాంట్లతో పాటు సోన్‌భద్ర, చందౌలీ, మీర్జాపూర్‌లలో మరిన్ని పంప్ స్టోరేజ్ ప్లాంట్ల కోసం అక్మే, అవాడా, ఈస్ట్ ఇండియా పెట్రోలియంలు అనుమతులు పొందాయి మరియు ఈ ప్రాజెక్టులన్నింటిపైనా త్వరితగతిన పనులు చేపట్టాలని యోగి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
సోన్‌భద్రలో అతిపెద్ద ప్లాంట్, 1250 మెగావాట్ల సామర్థ్యం
ఈ ఏడాది మే 30న సోన్‌భద్రలోని గర్వాలో 1250 మెగావాట్ల సామర్థ్యం గల హైడ్రో పంప్ స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతి లభించింది. అక్వాగ్రీన్ ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ దీనిని అభివృద్ధి చేస్తోంది, ఇది ఆఫ్ స్ట్రీమ్ లూప్ పంప్ ప్రాజెక్ట్. ఇక్కడ రెండు రిజర్వాయర్లలో సోన్ నది నీటిని పంప్ చేయడం ద్వారా నిల్వ సామర్థ్యాన్ని పెంచుతారు. తర్వాత రిజర్వాయర్ నుండి 4.6 కిలోమీటర్ల దూరంలో పంప్ ఇన్‌టేక్ వెల్ ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం, అభివృద్ధి పనులన్నింటినీ రూ.6100.62 కోట్ల వ్యయంతో పూర్తి చేస్తారు.
అదేవిధంగా చందౌలీలోని ముబారక్‌పూర్‌లో ఈ ఏడాది ఆగస్టు 8న 600 మెగావాట్ల సామర్థ్యం గల హైడ్రో పంప్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణానికి అనుమతి లభించింది. దీనిని అక్మే ఎనర్జీ టూ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తోంది. ఇది క్లోజ్డ్ లూప్ స్టోరేజ్ హైడ్రో ప్రాజెక్ట్. ఇక్కడ కూడా ఎగువ రిజర్వాయర్, దిగువ రిజర్వాయర్ విధానం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా వివిధ రకాల నిర్మాణ, అభివృద్ధి పనులను రూ.3544.81 కోట్ల వ్యయంతో పూర్తి చేస్తారు.
మీర్జాపూర్‌లో 4 ప్లాంట్ల ద్వారా 3480 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
మీర్జాపూర్‌లో పంప్ స్టోరేజ్ ప్లాంట్ల ప్రాజెక్టు ద్వారా యోగి ప్రభుత్వం 3480 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా జూన్ 26 నుండి ఆగస్టు 29 మధ్య మొత్తం నాలుగు పంప్ స్టోరేజ్ ప్రాజెక్టుల స్థాపనకు ఆమోదం లభించింది. వీటిలో భాగంగా అవాడా గ్రూప్ కట్రాలో రూ.4410 కోట్ల వ్యయంతో 630 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యం గల పంప్ స్టోరేజ్ ప్లాంట్ నిర్మాణం, అభివృద్ధి పనులు చేపడుతుంది.
రెన్యూ గ్రామం కాళుపట్టీలో రూ.3350 కోట్ల వ్యయంతో 600 మెగావాట్లు, బబురాలో రూ.4100 కోట్ల వ్యయంతో 800 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లను నిర్మించి, అభివృద్ధి చేయనున్నారు. అదేవిధంగా మీర్జాపూర్‌లోని బబురా రఘునాథ్ సింగ్ గ్రామంలో ఈస్ట్ ఇండియా పెట్రోలియం రూ.3946.12 కోట్ల వ్యయంతో 850 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యం గల పంప్ స్టోరేజ్ ప్లాంట్ స్థాపన, నిర్మాణం,అభివృద్ధి పనులను చేపడుతోంది. ఈ పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులన్నింటినీ పర్యవేక్షించడానికి ఏజెన్సీని నియమించే ప్రక్రియ కూడా త్వరలో పూర్తి కానుంది, దీని తర్వాత ఈ ప్రాజెక్టుకు మరింత వేగం లభిస్తుంది.