సారాంశం

భారత పర్యటనలో ఉన్న అమెరికా వైస్ ప్రెసిడెంట్ జె.డి. వాన్స్ పహల్గాం ఉగ్రదాడిపై స్పదించారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు. ఈ ఇద్దరు నేతల ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన టూరిస్ట్ లకు సంతాపం తెలిపారు.

Pahalgam terror attack : అమెరికా వైస్ ప్రెసిడెంట్ జె.డి. వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నవిషయం తెలిసిందే. కుటుంబంతో కలిసి ఇండియాలో పర్యటిస్తున్న వీరు కాశ్మీర్  లో జరిగిన ఉగ్రదాడిపై స్పందించారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారత్ లో జరిగిన ఉగ్రవాదుల దాడికి ఖండించారు. 

మంగళవారం మధ్యాహ్నం అనంత్ నాగ్ జిల్లా పహల్గాం ప్రాంతంలో టూరిస్టులపై ఒక్కసారిగా ఉగ్రవాదాలు కాల్పులకు తెగబడ్డారు. కేవలం హిందూ టూరిస్టులే టార్గెట్ గా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు... దీంతో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్ర గాయాలపాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

ఈ పహల్గాం ఉగ్రదాడిపై జె.డి. వాన్స్ ఎక్స్ వేదికన రియాక్ట్ అయ్యారు. ''ఉషా, నేను పహల్గాంలో జరిగిన ఈ దారుణ ఉగ్రదాడి బాధితులకు సంతాపం తెలియజేస్తున్నాం" అని వాన్స్ పోస్ట్ చేశారు. "గత కొన్ని రోజులుగా మేము ఈ దేశం అందాలకు, ప్రజలకు ముగ్ధులమయ్యాం. ఈ దారుణ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం" అని ఆయన అన్నారు.

 

అమెరికా వైస్ ప్రెసిడెంట్ జె.డి. వాన్స్ ప్రస్తుతం తన కుటుంబంతో భారత్ పర్యటనలో ఉన్నారు. ఆయన సోమవారం భార్య ఉషా, ముగ్గురు పిల్లలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. నిన్ననే ప్రధాని నరేంద్ర మోదీతో భేటి అయిన ఆయన ఇవాళ(మంగళవారం) రాజస్థాన్ లో పర్యటిస్తున్నారు. ఇలా అమెరికా ఉపాధ్యక్షుడు ఇండియాలో ఉండగానే పహల్గాంలో ఉగ్రదాడి జరగడంతో ఆయన స్పందించారు.  

డొనాల్డ్ ట్రంప్ సంతాపం :

కశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోని బైసరన్‌లో జరిగిన విషాదకర ఉగ్రదాడిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఈ దాడిని ఖండించి, భారత్‌కు తమ మద్దతును పునరుద్ఘాటించారు. "కశ్మీర్ నుంచి వస్తున్న వార్తలు చాలా బాధాకరం. ఉగ్రవాదంపై పోరాటంలో అమెరికా భారత్‌కు తోడుగా నిలుస్తుంది. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం" అని ట్రంప్ రాశారు. ప్రధాని మోదీకి, భారత ప్రజలకు సానుభూతి తెలియజేశారు. "ప్రధాని మోదీ, భారత ప్రజలకు మా పూర్తి మద్దతు ఉంది. మా హృదయాలు మీతోనే ఉన్నాయి" అని ట్రంప్ అన్నారు.