పాకిస్థాన్ లోని తమ పౌరులకు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. ఆపరేషన్ సిందూర్ తో పాటు ఆ తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది... వీలయితే లాహోర్ ను వీడి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు.
Operation Sindoor: పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ''ఆపరేషన్ సిందూర్'' నిర్వహించింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. భారత వాయుసేన యుద్దవిమానాలు పాక్ తో పాటు పివోకే లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులుచేసి 100 మంది ఉగ్రవాదులను అంతమొందించింది. అయితే తమ భూభాగంలోకి వచ్చి దాడులు చేయడంపై పాక్ సీరియస్ గా ఉంది.. దీంతో భారత్ పై క్షిపణి దాడులు చేపడుతోంది.
బుధవారం రాత్రి పంజాబ్ నుండి జమ్మూ కశ్మీర్ వరకు పలు ఆర్మీ క్యాంప్స్ ను టార్గెట్ గా చేసుకుని పాకిస్థాన్ అనేక క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించింది. భారత వైమానిక రక్షణ వ్యవస్థ వాటిని గాల్లోనే ధ్వంసం చేసింది. ఆ తర్వాత బుధవారం ఉదయం భారత్ పాక్ వైమానిక రక్షణ వ్యవస్థపై దాడులు చేసింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో పాకిస్థాన్ లోని ఎంబసీ అధికారులకే కాదు తమ దేశ పౌరులకు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. .
పాక్‌లోని తన పౌరులకు అమెరికా హెచ్చరిక
పాకిస్తాన్ పర్యటనపై అమెరికా తన పౌరులకు హెచ్చరిక జారీ చేసింది. అమెరికా విదేశాంగ శాఖ గురువారం పాకిస్తాన్‌కు కొత్త ప్రయాణ హెచ్చరిక జారీ చేసింది. ఉద్రిక్త ప్రాంతాలను విడిచి వెళ్లాలని అమెరికా పౌరులను హెచ్చరించింది.
లాహోర్, పరిసర ప్రాంతాల్లో డ్రోన్ పేలుళ్లు, కూలిపోయిన డ్రోన్‌లు, వైమానిక రంగంలో చొరబాట్లు జరిగాయని అమెరికా ప్రభుత్వం తెలిపింది. కాన్సులేట్ జనరల్ అధికారులందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆదేశించింది. ఉద్రిక్త ప్రాంతాల్లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే అక్కడి నుండి వెళ్లిపోవాలని సూచించింది.
సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచన
లాహోర్ ప్రధాన విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న కొన్ని ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం అందిందని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఉద్రిక్త ప్రాంతాల్లో ఉన్న అమెరికా పౌరులు సురక్షితంగా వెళ్లగలిగితే వెంటనే అక్కడి నుండి వెళ్లిపోవాలి. వెళ్లలేకపోతే సురక్షిత ప్రాంతంలో ఉండాలని సూచించింది.