లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాపూర్ జిల్లాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన పరారైన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. బాలికను కిడ్నాప్ చేసి, ఆమెపై అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 

బాధితురాలి తల్లిదండ్రులు, ఇరుగుపొరుగువారు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు నిందితుడు దళపతి స్కెచ్ లు గీయించి విడుదల చేశారు. నిందితుడి సమాచారం ఇచ్చినవారికి రూ. 50 వేల రూపాయలు ఇస్తామని కూడా పోలీసులు ప్రకటించారు. 

గురువారంనాడు కొన్ని దుస్తులను, సూసైడ్ నోట్ ను నది పక్కన పడేసి అతను పోలీసులను తప్పుదోవ పట్టించడానికి చూశాడు. పోలీసుల ఎన్ కౌంటర్ లో చావడం ఇష్టం లేక ప్రాణాలు తీసుకుంటున్నట్లు అతను ఆ సూసైడ్ నోట్ లో రాశాడు. 

దళపతి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు బాధిత బాలిక మీరట్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తన ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను దళపతి కిడ్నాప్ చేసి మోటార్ సైకిల్ పై తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేసాడు. 

తన కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రక్తం మడుగులో పడి ఉన్న బాలికను పొదల్లో పోలీసులు గుర్తించారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలింది