మహారాష్ట్రలో నెలకొన్ని రాజకీయ పరిస్ధితుల నేపథ్యంలో పరిస్ధితిని చక్కదిద్దేందుకు బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రంగంలోకి దిగారు. ప్రభుత్వ ఏర్పాటు ఆర్ఎస్సెస్ కనునన్నల్లోనే జరుగుతుందన్న వాదనలపై గడ్కరీ స్పందించారు.

మోహన్‌ భగవత్‌కు ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే తాను మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు వస్తున్న వార్తలకు ఆయన చెక్ పెట్టారు. శివసేన మద్ధతుతో దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ఆయన వెల్లడించారు.

తాను ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్నానని.. రాష్ట్ర రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ఆలోచన లేదన్నారు. తాజా ఎన్నికల్లో తమకు 105 సీట్లు వచ్చాయని.. మిత్రపక్షం శివసేన మద్ధతుతో త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గడ్కరీ వెల్లడించారు. 

Also Read:బీజేపీతోనే తేల్చుకోండి.. మేము ప్రతిపక్షంగానే ఉంటాం: శివసేనకు పవార్ సూచన

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో ఏర్పడిన ప్రతిష్టంభనకు అంతం పలకడానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రంగంలోకి దిగారు. బిజెపి, శివసేన మధ్య అధికార పంపకాలపై ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ రంగంలోకి దిగారు. 

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన కార్యక్రమాలను అన్నింటినీ రద్దు చేసుకుని హుటాహుటిన నాగ్ పూర్ బయలుదేరారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఒక్క రోజు మాత్రమే గడువు ఉన్న స్థితిలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. 

మరోవైపు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీని కనలుసుతన్నారు. ముఖ్యమంత్రిగా నితిన్ గడ్కరీ పేరును ప్రతిపాదించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. బిజెపి, శివసేన మధ్య రాజీ ఫార్ములాగా ఆయన పేరును ప్రతిపాదించే అవకాశాలున్నాయి. 

Also Read:"మహా" ప్రతిష్టంభన: రంగంలోకి భగవత్, హుటాహుటిన నాగ్ పూర్ కు గడ్కరీ

ముఖ్యమంత్రి పదవిని రొటేషన్ పద్ధతిలో పంచుకుందామనే తమ ప్రతిపాదనకు ఫడ్నవీస్ అంగీకరించకపోవడంపై శివసేన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మోహన్ భగవత్ ను ఫడ్నవీస్ మంగళవారం రాత్రి కలిశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించిన పరిణామాలు వేగవంతమైనట్లు తెలుస్తోంది.

అధికారాన్ని ఫిఫ్టీ-ఫిఫ్టీ పంచుకోవాలనే దానిపై బీజేపీ-శివసేన మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం ఇంకా ఓ కొలిక్కిరాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

శివసేనతో తమ పార్టీ కలిసే ప్రసక్తే లేదని.. కాంగ్రెస్‌తో కలిసి ప్రతిపక్షంలోనే కూర్చుంటామని పవార్ స్పష్టం చేశారు. బీజేపీతో చర్చలు జరుపుకుని శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

అదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం శివసేనకు ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. మరోవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా శివసేనను ఒప్పించేందుకు బీజేపీ అధినాయకత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.