బీజేపీతోనే తేల్చుకోండి.. మేము ప్రతిపక్షంగానే ఉంటాం: శివసేనకు పవార్ సూచన
శివసేనతో తమ పార్టీ కలిసే ప్రసక్తే లేదని.. కాంగ్రెస్‌తో కలిసి ప్రతిపక్షంలోనే కూర్చుంటామని పవార్ స్పష్టం చేశారు. బీజేపీతో చర్చలు జరుపుకుని శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు
మహారాష్ట్రలో రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు వారాలకు పైగా గడిచిపోతుండటంతో పాటు ప్రభుత్వ ఏర్పాటుకు గడువు దగ్గర పడుతుండటంతో ఉత్కంఠ నెలకొంది.
అధికారాన్ని ఫిఫ్టీ-ఫిఫ్టీ పంచుకోవాలనే దానిపై బీజేపీ-శివసేన మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం ఇంకా ఓ కొలిక్కిరాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
శివసేనతో తమ పార్టీ కలిసే ప్రసక్తే లేదని.. కాంగ్రెస్‌తో కలిసి ప్రతిపక్షంలోనే కూర్చుంటామని పవార్ స్పష్టం చేశారు. బీజేపీతో చర్చలు జరుపుకుని శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
అదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం శివసేనకు ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. మరోవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా శివసేనను ఒప్పించేందుకు బీజేపీ అధినాయకత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
Also Read:మహా మలుపుల మహా రాజకీయం:శివసేన సంచలన ప్రకటన
ముఖ్యమంత్రి పదవిపై శివసేన పట్టువీడకపోవడంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌తో భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన వీరి భేటీలో శివసేన డిమాండ్లు, బీజేపీ ఆలోచనలను ఆయన ముందుంచారు.
కాగా.. శివసేనను దారిలోకి తెచ్చేందుకు బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రంగంలోకి దిగారు. బుధవారం రాత్రికి ఆయన ముంబై చేరుకుంటారు. సమస్య పరిష్కారానికి గడ్కరీని రంగంలోకి దించాల్సిందిగా శివసేన నేత కిశోర్ తివారీ.. ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
బీజేపీ-శివసేన ఎన్నికలకు ముందే ఒప్పందం కుదుర్చుకున్నాయని.. సీఎం పదవి చెరిసగం పంచుకుందామంటేనే తాము కమలనాథులతో పొత్తు పెట్టుకున్నామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తేల్చి చెప్పారు.
Also Read:"మహా" మలుపులు: ఫడ్నవీస్ భార్య స్పందన ఇదీ, పవార్ కు శివసేన ఫీలర్లు
తాము కొత్త ప్రతిపాదనలు ఏమీ బీజేపీ ముందు ఉంచలేదని.. శివసేనకు చెందిన నేతే సీఎం పదవిని అలంకరించాలని రాష్ట్రంలోని రైతులు, ఉద్యోగులు కోరుకుంటున్నారని సంజయ్ వెల్లడించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌తో భేటీకావడం సంచలనం కలిగించింది. అయితే దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైనే తాను గడ్కరీని కలిశానని.. రాజకీయ అంశాలేవి తమ మధ్య చర్చకు రాలేదని అహ్మద్ పటేల్ పేర్కొన్నారు.