దేశ రాజధాని డిల్లీ నుండి రైళ్లో బయలుదేరిన కేంద్ర మంత్రి కనిపించకుండా పోయారు. కొద్దిసేపటి తర్వాత ఆయన తీవ్ర గాయలతో దొరికారు. ఇంతకు సదరు కేంద్ర మంత్రికి ఏమయ్యింది?
Jual Oram : కేంద్ర మంత్రి జుయల్ ఒరాం కొద్దిసేపు కనిపించకుండా పోయారు. ఆయన ఓ రైలులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా మిస్సయ్యారు. కొద్దిసేపు గందరగోళం తర్వాత ఆయన దొరికారు. అయితే కేంద్ర మంత్రి గాయాలతో కనిపించడంతో సెక్యూరిటీ సిబ్బంది, రైల్వే అధికారులు ఆందోళనకు గురయ్యారు. మంత్రిగారు అసలు విషయం చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు.
జుయల్ ఓరం మిస్సింగ్ స్టోరీ :
కేంద్ర మంత్రి జుయల్ ఓరం గత శనివారం డిల్లీ నుండి జబల్పూర్ కు రైలులో బయలుదేరారు.శనివారం రాత్రి ఆయన హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ లో గోండ్వానా ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. అయితే రాత్రి తన బెర్తులో పడుకున్న ఆయన ఉదయానికి కనిపించకుండాపోయారు. దీంతో కంగారుపడిన సెక్యూరిటీ సిబ్బంది రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దాదాపు మూడు గంటల తర్వాత ఆయన 162 కి.మీ. దూరంలోని సిహోరా స్టేషన్‌లో మరో రైలులో గాయాలతో కనిపించారు.
కేంద్ర మంత్రి కనిపించకుండా పోవడంతో రైల్వే, పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. ఆ మార్గంలోని అన్ని రైళ్లను అప్రమత్తం చేసి ప్రతి స్టేషన్‌లో తనిఖీలు చేశారు. మూడు గంటల తర్వాత సిహోరా స్టేషన్‌లో సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఆయన కనిపించారు. ఈ రైలులోని B3 కోచ్‌లో 57వ నెంబర్ బెర్త్‌లో గాయాలతో ఉన్న మంత్రి జుయల్ ఓరంను గుర్తించారు.
రాత్రి ఏదో స్టేషన్‌లో దిగి తిరిగి రైలు ఎక్కుతుండగా మంత్రి జుయల్ ఓరం కాలుజారి పడి గాయపడ్డట్లు సమాచారం. ఆయనకు షుగర్ లెవెల్స్ తగ్గిపోవడంతో అస్వస్థతకు గురయ్యారని... అదే సమయంలో వచ్చిన మరో రైలు (సంపర్క్ క్రాంతి) ఎక్కి కూర్చున్నారని తెలిసింది.
మంత్రి సిహోరా స్టేషన్‌లో కనిపించగానే ఆయనకు ప్రాథమిక చికిత్స అందించి వెంటనే జబల్పూర్ తరలించారు. అక్కడ ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన చేతికి, కాలికి స్వల్ప గాయాలయ్యాయి.
ఈ ఘటనపై కేంద్ర మంత్రి జుయల్ ఓరం నుంచి ఇంకా అధికారిక ప్రకటనేమీ రాలేదు. ఆయన ఏ పరిస్థితుల్లో గోండ్వానా ఎక్స్‌ప్రెస్ దిగారు, సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ లోకి ఎలా చేరుకున్నారనేది ఇంకా మిస్టరీగానే ఉంది.


