Asianet News TeluguAsianet News Telugu

భారత విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొవాగ్జిన్‌కు యూకే గ్రీన్ సిగ్నల్

యూకే ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. భారత్‌లో అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకానూ గుర్తిస్తున్నట్టు తెలిపింది. ఈ టీకా రెండు డోసులు వేసుకున్న వారికీ దేశంలోకి అనుమతి ఇస్తున్నట్టు వివరించింది. కొవాగ్జిన్‌తోపాటు చైనాకు చెందిన సినోవాక్, సినోఫామ్ టీకాలనూ యూకే ఆమోదించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదే నెలలో కొవాగ్జిన్ టీకాకు అత్యవసర వినియోగ టీకాల జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే.
 

UK given green signal to covaxin
Author
New Delhi, First Published Nov 22, 2021, 4:08 PM IST

న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్(Bharat Biotech) అభివృద్ధి చేసిన కరోనా టీకా కొవాగ్జిన్‌(Covaxin)కు యునైటెడ్ కింగ్‌డం(UK) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక నుంచి ఈ టీకా వేసుకున్న వారికీ తమ దేశంలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. భారత్‌కు చెందిన కొవాగ్జిన్‌తోపాటు China అభివృద్ధి చేసిన సినోవాక్, సినోఫామ్ Vaccineలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విదేశీయులు వారి దేశంలోకి రావడానికి ఆమోదించిన టీకాల జాబితాలో యూకే ప్రభుత్వం.. భారత కొవాగ్జిన్‌తోపాటు ఈ చైనా టీకాలనూ చేర్చింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ సోషల్ కేర్ అధికారులు సోమవారం వెల్లడించారు.

కొవాగ్జిన్ టీకా వేసుకున్న కొందరు భారతీయులు కొన్ని నెలలుగా విదేశీ పర్యటనలపై తీవ్ర ఆంక్షలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులపై దీని ప్రభావం ఎక్కువగా పడింది. కొవాగ్జిన్ టీకాను తాము గుర్తించడం లేదని, ఆ టీకా వేసుకున్న వారిని తమ దేశంలోకి అనుమతించబోమని యూకే సహా పలు దేశాలు నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతుల కోసం ఒత్తిడి పెరిగింది. కానీ, ఆ సంస్థ అనుమతులు రావడం అంతకంతకూ ఆలస్యం అవుతూ వచ్చాయి. చివరికి ఈ నెల తొలినాళ్లలో కొవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య  సంస్థ అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపింది. తాజాగా యూకే ప్రభుత్వం కూడా కొవాగ్జిన్‌ టీకాను గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై విద్యార్థి లోకం ఆనందంగా ఉన్నది. ఇప్పుడు వారు కొవాగ్జిన్ టీకా తీసుకున్నా యూకే వెళ్లి చదువుకోవడానికి మార్గం సుగమమైంది. కాగా, టీకా రెండు డోసులు తీసుకోని వారు కరోనా టెస్టులు చేయించుకోవడమే కాక, పది రోజులు అక్కడ క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది.

Also Read: భారత్ బయోటెక్‌కు ఊరట.. కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం

చైనా విద్యార్థుల్లోనూ ఇదే సంతోషం వ్యక్తమవుతున్నది. కరోనా మహమ్మారి సద్దుమణుగుతున్న తరుణంలో చైనా నుంచి యూకే పెద్ద ఎత్తున వెళ్లాలని యోచిస్తున్నారు. కానీ, వారు ఆ దేశంలో అభివృద్ధి చేసిన టీకాలనే వేసుకున్నారు. ఆ టీకాలను ఇతర దేశాలు గుర్తించడం లేదు. దీంతో చాలా మంది విద్యార్థులు నిరాశలో కూరుకుపోయారు. కరోనా ముందు కంటే ఈ సారి చైనా నుంచి 4,500 మందికిపైగా విద్యార్థులు యూకే వెళ్లి చదువుకోవడానికి ఈ ఏడాది దరఖాస్తు చేసుకున్నారు. గతంతో పోలిస్తే ఈ సంఖ్య మూడింట ఒక వంతు పెరిగింది.

Also Read: కొవాగ్జిన్ మూడో దశ ఫలితాలు ప్రచురించిన లాన్సెట్.. డెల్టా వేరియంట్‌పై సామర్థ్యం ఎంతంటే?

కొవాగ్జిన్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నెలలోనే అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, యునైటెండ్ కింగ్‌డం కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం ఉన్న ఏడు టీకాలకూ పచ్చ జెండా ఊపింది. గత నెలలో ఆస్ట్రేలియా కూడా అదనంగా టీకాలకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కాగా, అమెరికా కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం పొందిన టీకాలన్నింటినీ అనుమతిస్తామని వివరించింది. అయితే, ఈ నెలలో విదేశీయులు తమ దేశంలోకి పర్యటించడంపై విధించిన ఆంక్షలు ఎత్తేయనుంది. ఆ తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం ఉన్న టీకాలు వేసుకున్న విదేశీయులను అమెరికాలోకి అనుమతించనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios