విషాదం.. ఆయుర్వేద సిరప్ తాగి 5 గురు మృతి.. మరో ఇద్దరికి అస్వస్థత..
గుజరాత్ లోని ఖేడా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఆయుర్వేద సిరప్ తాగడం వల్ల ఐదుగురు మరణించారు. మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. పోస్టుమార్టం నివేదికలో వారి శరీరంలో మిథనాల్ అనే విషపూరిత పదార్థం ఉన్నట్టు తేలింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆయుర్వేద సిరప్ తాగి 5 గురు మరణించిన ఘటన గుజరాత్ లోని ఖేడా జిల్లాలో చోటు చేసుకుంది. మరో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. ఇది స్థానికంగా విషాదాన్ని నింపింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Exit Polls 2023: ఎగ్జిట్ పోల్స్ పై మిశ్రమ స్పందన.. ఇంతకీ పోల్స్ ఫలితాలను విశ్వసించవచ్చా..?
ఖేడా జిల్లాలోని నడియాడ్ సమీపంలోని బిలోదర గ్రామంలో కిరాణా దుకాణం ఉంది. అందులో ఆయుర్వేద మందులు కూడా అమ్ముతుంటారు. అందులో రోగులు పలు వ్యాధులకు మందులను కొనుగోలు చేస్తుంటారు. ఇలా ఆ దుకాణం ఉన్న పరిసర గ్రామాలైన బిలోదర, బాగ్దు నుంచి పలువురు వ్యక్తులు 'కల్మేగాసవ్ - ఆసవ అరిష్ట' అనే సిరప్ ను కొనుగోలు చేశారు. ఈ సిరప్ తాగిన ఆ రెండు గ్రామాలకు చెందిన ఐదుగురికి ఒక్క సారిగా ఛాతిలో నొప్పి వచ్చింది.
దీంతో వారిని కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమించడంతో వారు నవంబర్ 28, 29 తేదీల్లో చనిపోయారు. మరో ఇద్దరు కూడా అస్వస్థతకు గురయ్యారు. అయితే గత బుధవారం ఈ మరణాలపై పోలీసులకు సమాచారం వచ్చింది. కానీ అప్పటికే నలుగురి అంత్యక్రియలు పూర్తయ్యాయని ఖేడా ఎస్పీ రాజేష్ గాధియా ‘ఇండియా టుడే’తో తెలిపారు.
ఐదో మృతదేహానికి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి, ఒప్పించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అందులో మృతుడి శరీరంలో మిథనాల్ ఆనవాళ్లు కనిపించాయి. కుటుంబ సభ్యులను పోలీసులు ఆరా తీయడంతో ఆయుర్వేద సిరప్ తాగినట్టు నిర్ధారించారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మిథైల్ ఆల్కహాల్ (మిథనాల్) ఒక విషపూరిత పదార్థం. అది సిరప్ లోకి ఎలా వచ్చిందో అని పోలీసులు ఆరా తీస్తున్నారు. నడియాడ్ సమీపంలోని బిలోదర గ్రామంలోని కిరాణా దుకాణంలో కొనుగోలు చేసిన 'కల్మేగాసవ్ - ఆసవ అరిష్ట' అనే సిరప్ తాగడం వల్లే ఈ ఐదుగురు మృతి చెందారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే గత వారంలో సుమారు 60 మందికి సిరప్ బాటిళ్లను విక్రయించినట్లు దుకాణం యజమాని కిషన్ సోధా అంగీకరించాడు.
KTR : "ఎగ్జిట్ పోల్స్ ఓ రబ్బిష్.. మళ్లీ అధికారం మాదే"
ఈ సిరప్ తాగి అస్వస్థతకు గురై, చికిత్స పొందుతున్న ఇద్దరి రక్త నమూనాల్లోనూ మిథనాల్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అహ్మదాబాద్ లోని జుహాపురాలో ఈ సిరప్ ను తయారు చేసి దళారుల ద్వారా గ్రామాలకు తరలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు ‘ఇండియా టుడే’కు తెలిపాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.