KTR : "ఎగ్జిట్ పోల్స్ ఓ రబ్బిష్.. మళ్లీ అధికారం మాదే"
Telangana Election: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పరిశీలిస్తే.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కీలక వ్యాఖ్యలు చేశారు.
Telangana Election: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన పోలింగ్ పర్వం ముగిసింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. ఇక ఫలితాలు వెలువడటమే తరువాయి. ఏ పార్టీ అధికార పగ్గాలు చేపడుతుందో ? ఏ పార్టీ పరాజయం పాలవుతుందో ? డిసెంబరు 3న డిసైడ్ కానుంది. అయితే.. ఎన్నికలు పూర్తి కాగానే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చర్చనీయంగా మారాయి. అందులో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ కనిపిస్తోంది. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈ తరుణంలో పోలింగ్ ముగిశాక వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ చూసి నేతలు, కార్యకర్తలు ఆధైర్యపడవద్దనీ, ఇలాంటి ఎగ్జిట్ పోల్స్‌ను గతంలోనూ చూశామని అన్నారు. ఎగ్జిట్‌పోల్స్ పేరిట ఆందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.ఇంకా పోలింగ్ కొనసాగుతునే ఉందనీ, క్యూ లైన్‌లో చాలామంది ఓటర్లు వేచి ఉన్నారనీ, ఓటింగ్ కచ్చితంగా ప్రభావితం అవుతుందని అన్నారు. అసలైన ఫలితం డిసెంబర్ 3వ తేదీన రాబోతోంది. 70కిపైగా స్థానాలు దక్కించుకుంటాం. బీఆర్‌ఎస్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. హ్యాట్రిక్ కొట్టి.. కేసీఆర్ సీఎంగా ప్రమాణం చేస్తారు అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అప్పడే బీఆర్ఎస్ కు 10 శాతం పోలింగ్ తగ్గిందని ఎలా చెప్పుతారని మండిపడ్డారు. తమ పార్టీకి 70కి పైగా సీట్లు రానున్నాయి. డిసెంబర్ 3న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని మంత్రి కేటీఆర్ దీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది తమ పార్టీనేనీ, బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని, కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని అన్నారు. గతంలో (2018లో) వచ్చిన ఎగ్జిట్ పోల్స్ తప్పని తేలాయనీ, ఎగ్జిట్ పోల్స్ ఓ రబ్బిష్ అనీ అసహనం వ్యక్తం చేశారు. ఎగ్జిగ్ పోల్స్ తప్పయితే క్షమాపణలు చెప్తారా? ప్రశ్నించారు. 100కు వందశాతం రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ఆశ భావం వ్యక్తం చేశారు.