Telangana Elections 2023 : తెలంగాణలో క్యాంప్ రాజకీయాలు తప్పవా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవగానే అక్కడికేనట..
తెలంగాణ కాంగ్రెస్ క్యాంప్ ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ హంగ్ పరిస్థితే వస్తే గెలిచినవారు జారిపోకుండా కాంగ్రెస్ ముందుగానే అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి... నోటిఫికేషన్ వెలువడిన నుండి నిన్నటి పోలింగ్ వరకు ప్రధాన రాజకీయ పార్టీలు చాలా పకడ్బందీగా వ్యవహరించాయి. వ్యూహప్రతివ్యూహాలు, ఎత్తులు పైఎత్తులతో తమ పార్టీని గెలిపించుకోవడమే లక్ష్యంగా నాయకులు పనిచేసారు. ముమ్మర ప్రచారంతో హోరెత్తించి, ఫర్ఫెక్ట్ పోల్ మేనేజ్ మెంట్ చేసి తమ పార్టీ గెలుపుకు బాటలు వేసినట్లు ఆయా పార్టీల నాయకులు ధీమాతో వున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఈసారి కాంగ్రెస్ దే పైచేయిగా నిలుస్తుందని చెబుతున్నాయి... కానీ భారీ మెజారిటీ వుండకపోవచ్చని అంచనా వేస్తున్నాయి. కొన్ని సర్వేలు హంగ్ వచ్చినా రావచ్చని అంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముందుగానే అప్రమత్తమై గెలిచిన ఎమ్మెల్యేలను గెలిచినట్లు క్యాంప్ కు తరలించే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భారీగా సీట్లు పెరిగే అవకాశాలున్నాయని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసాయి. 60-70 సీట్లతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించవచ్చని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. కానీ కొన్ని ఎగ్జిట్ పోల్స్, ఓపినియన్ పోల్స్ మాత్రం తెలంగాణలో హంగ్ రానుందని అంటున్నాయి. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే మెజారిటీ రాదని... బిజెపి, ఎంఐఎం కింగ్ మేకర్లుగా మారతాయని ప్రకటించాయి. దీంతో డిసెంబర్ 3న అంటే ఎల్లుండి ఇలాంటి పలితమే వస్తే గెలిచిన ఎమ్మెల్యేలందరిని క్యాంప్ కు తరలించాలని కాంగ్రెస్ చూస్తోందట. ఎమ్మెల్యేల కోసం ఇప్పటికే కర్ణాటక రాజధాని బెంగళూరులో రిసార్టులు, హోటల్లు సిద్దం చేస్తున్నట్లు సమాచారం.
ఎన్నికల పలితాలను బట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించాలో వద్దో కాంగ్రెస్ అదిష్టానం నిర్ణయించనుంది. హంగ్ దిశగానే పలితాలు వుంటే గెలియిన ఎమ్మెల్యేలను వెంటనే హైదరాబాద్ నుండి బెంగళూరుకు తరలిస్తారట. ఇందుకోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటుచేసుకునే యోచనలో కాంగ్రెస్ వున్నట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా బెంగళూరుకు వెళ్ళేందుకు సిద్దంగా వుండాలని ఇప్పటికే కాంగ్రెస్ అదిష్టానం పోటీచేసిన అభ్యర్థులకు సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
Read More Telangana Exit Polls 2023: ఎగ్జిట్ పోల్స్ పై మిశ్రమ స్పందన.. ఇంతకీ పోల్స్ ఫలితాలను విశ్వసించవచ్చా..?
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో వుండటంతో తెలంగాణ ఎమ్మెల్యేలను అక్కడికి తరలించే ఆలోచనలో అదిష్టానం వుందట. ఈ క్యాంపును నడిపే బాధ్యతను కర్ణాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్ కు అప్పగించారట. ఇప్పటికే డికె తెలంగాణ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారు... కాబట్టి పలితాలు వెలువడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవరకు ఆయనే వ్యవహరాలన్నీ చూసుకుంటారని తెలుస్తోంది.
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ లో చేరారు. హంగ్ వచ్చినా, మెజారిటీ సీట్లు రాకపోయినా మళ్ళీ ఇదే రిపీట్ అవుతుందని కాంగ్రెస్ అదిష్టానం భావిస్తోందట. అందుకే ఎన్నికల పలితాలను బట్టి క్యాంప్ రాజకీయాల ప్లాన్ వేస్తోందట.