Omicron: అలెర్ట్.. ఆల్రెడీ మూడోవేవ్ వచ్చేసింది: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
కరోనా కేసులు దేశంలో భారీగా రిపోర్ట్ అవుతున్నాయి. ఢిల్లీలో కరోనా కేసులు కమ్యూనిటీ స్థాయిలో వ్యాపిస్తున్నాయని ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. రాష్ట్రంలో థర్డ్ వేవ్ వచ్చిందని అన్నారు. కాబట్టి, ప్రజలు మరింత జాగ్రత్తగా మెలగాలని తెలిపారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
భోపాల్: దేశవ్యాప్తంగా కరోనా కేసులు(Corona Cases) పెరుగుతున్నాయి. అందులో కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron Variant) కేసులూ గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా అలజడి మొదలైంది. రాష్ట్రాలు కట్టడి చర్యలకు ఉపక్రమించాలని కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు చేస్తున్నది. వీటికి తోడు కేసులు తీవ్రతను బట్టి ఆయా రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు విధిస్తున్నాయి. ఢిల్లీలో ఇప్పటికే కేసులు కమ్యూనిటీలో వ్యాపిస్తున్నాయని ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఆందోళకర విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా, మధ్యప్రదేశ్(Madhya Pradesh) ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏకంగా థర్డ్ వేవ్(Third Wave) ఆల్రెడీ వచ్చేసిందని వెల్లడించారు.
ప్రజలు మరింత జాగరూకతగా వ్యవహరించాలని, మరింత అప్రమత్తంగా ఉండాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రజలను కోరారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే థర్డ్ వేవ్ వచ్చేసిందని వివరించారు. ఈ కేసులను ఎదుర్కోవడానికి ప్రజల సంసిద్ధం కావాలని పిలుపు ఇచ్చారు. కరోనాపై పోరులో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకం అని అన్నారు. వారి భాగస్వామ్యం లేనిదే.. ఈ పోరాటాన్ని జయించలేమని వివరించారు. కాబట్టి, ప్రజలు మరింత జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
Also Read: Omicron:27వేలకు పైగా కరోనా కొత్త కేసులు.. పెరుగుతున్న ఒమిక్రాన్ వ్యాప్తి.. కొత్తగా ఎన్నంటే?
మధ్యప్రదేశ్‌లో గత 24 గంటల్లో 124 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని అధిక జనాభా గల నగరాలు ఇండోర్‌లో 62 కేసులు, భోపాల్‌లో 27 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఢిల్లీ, హర్యానా వంటి రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు 23 రాష్ట్రాలు ఒమిక్రాన్ వేరియంట్ కేసులను రిపోర్ట్ చేశాయి. ఇందులో మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో 460 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, ఢిల్లీలో 351 కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, అత్యధిక జనసమ్మర్ధం గల మెట్రో నగరాల్లో ఈ కేసులు వేగంగా పెరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాలో ఈ కేసులు భారీగా పెరుగుతున్నాయి.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం వెల్లడించిన కరోనా వైరస్ వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 27,553 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో వైరస్ తో పోరాడుతూ 284 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు సైతం పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 1,22,801 క్రియాశీల కేసులు ఉన్నాయి. కొత్తగా 9,249 మంది కరోనా వైరస్ నుంచి బటయపడ్డారు. ఒమిక్రన్ కేసులు సైతం పెరిగాయి. ఇప్పటివరకు దేశంలో 1525 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కరోనా కొత్త కేసుల్లో అధికంగా దేశరాజధాని ఢిల్లీలో 2,716 కేసులు నమోదయ్యాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కోవిడ్ తీవ్ర స్థాయిలో పంజా విసురుతోంది. కొత్తగా అక్కడ 6,180 కేసులు నమోదుకావడం కరోనా వ్యాప్తికి అద్దం పడుతోంది.
ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్(Rajesh Bhushan) రాష్ట్రాలకు లేఖ రాశారు. ఐసొలేషన్ కోసం బెడ్లు, తాత్కాలిక హాస్పిటళ్లు, ఐసీయూ బెడ్లు, పిల్లల చికిత్స కేంద్రాలు, ఆక్సిజన్, అంబులెన్స్, ఔషధాలు, చికిత్స పరికరాలు, సిబ్బంది, కాల్ సెంటర్ సౌకర్యాలు అన్నింటినీ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన రాష్ట్రాలకు తెలిపారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాత్కాలిక హాస్పిటళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు.