Asianet News TeluguAsianet News Telugu

కేసులు పెరుగుతున్నాయ్.. తాత్కాలిక హాస్పిటళ్లు ఏర్పాటు చేయండి.. పిల్లల కేసులపై ఫోకస్ పెట్టండి: కేంద్రం సూచనలు

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. అగ్రరాజ్యాల్లోనూ కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతున్నది. మన దేశంలోనూ ఒక వేళ భారీగా కేసులు రిపోర్ట్ అయితే.. వాటిని ఎదుర్కోవడానికి అవసరమైన ఏర్పాట్లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేసుకోవాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలకు లేఖ రాశారు. తాత్కాలిక హాస్పిటళ్లు ఏర్పాటు చేయాలని, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి కేసులను పర్యవేక్షించాలని, పిల్లల కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
 

centre writes letter to states over covid measures
Author
New Delhi, First Published Jan 1, 2022, 8:39 PM IST

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు(Corona Cases) పెరుగుతున్నాయి. డిసెంబర్ 31వ తేదీన 70 రోజుల్లోనే గరిష్టంగా కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్క రోజే 16,764 కరోనా కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాల(States)కు కీలక సూచనలు చేసింది. ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్(Rajesh Bhushan) రాష్ట్రాలకు లేఖ రాశారు. అభివృద్ధి చెందిన యూరప్, అమెరికా దేశాల్లోనూ కేసులు భారీగా పెరుగుతున్నాయని తెలిపారు. అంటే.. వైరస్ వేగంగా వ్యాపిస్తున్నదని అర్థం అవుతున్నదని పేర్కొన్నారు. కాబట్టి, సకాలంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ఒకవేళ మన దేశంలోనూ కరోనా కేసులు ఉన్నపళంగా విస్ఫోటనంలా పెరిగితే.. ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర భారం పడే ప్రమాదం ఉన్నదని తెలిపారు. కాబట్టి, ఇప్పుడే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని వివరించారు.

ఐసొలేషన్ కోసం బెడ్లు, తాత్కాలిక హాస్పిటళ్లు, ఐసీయూ బెడ్లు, పిల్లల చికిత్స కేంద్రాలు, ఆక్సిజన్, అంబులెన్స్, ఔషధాలు, చికిత్స పరికరాలు, సిబ్బంది, కాల్ సెంటర్ సౌకర్యాలు అన్నింటినీ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన రాష్ట్రాలకు తెలిపారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాత్కాలిక హాస్పిటళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, కేసులను పర్యవేక్షించడానికి కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, ఇది వరకే కొవిడ్ కోసం ప్రత్యేకంగా డెడికేట్ చేసిన కేంద్రాలను మరోసారి పరిశీలించాలని పేర్కొన్నారు. ఆరోగ్య వసతులను అందుబాటులో ఉంచడానికి తాత్కాలిక హాస్పిటళ్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇందుకు డీఆర్‌డీవ్, సీఎస్ఐఆర్, ప్రైవేటు రంగం, కార్పొరేషన్లు, ఎన్‌జీవోలు, ఇతరత్రాలతో అనుసంధానం చేసుకోవాలని సూచించారు. హోటల్ రూమ్‌లు, ఇతర వసతులను డెడికేటెడ్ కొవిడ్ హాస్పిటళ్లతో అనుసంధానించడానికి ప్రయత్నాలు చేయాలని పేర్కొన్నారు. 

Also Read: Omicron in India: భారత్‌లో 1,431కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. లక్ష దాటిన కరోనా యాక్టివ్ కేసులు

కేసులు భారీగా రిపోర్ట్ అయితే.. హోం ఐసొలేషన్‌కు పంపాలని సూచించారు. హోం ఐసొలేషన్ అమలు చేస్తే.. ఆ కేసులను ప్రత్యేకంగా పర్యవేక్షించడానికి బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, సందేహాల నివృత్తి కోసం కాల్ సెంటర్ల ఏర్పాటు, ఒక వేళ హోం ఐసొలేషన్‌లో ఉన్న పేషెంట్ ఆరోగ్యం క్షీణిస్తే.. వారిని సమీపంలోని హాస్పిటల్‌కు చేర్చడానికి అంబులెన్స్‌ల వసతి కూడా ఏర్పాటు చేయాలని తెలిపారు.

Also Read: 10 మంది మంత్రులు, 20 మందికి పైగా ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్.. మహారాష్ట్రలో కరోనా కలకలం..

జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, స్పష్టమైన మెకానిజంతో టెస్టింగ్, అంబులెన్స్, హాస్పిటల్ పడకల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పౌరులు కాల్ చేసి అంబులెన్స్‌, పడకలను పొందేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. అంతేకాదు, ఇది వరకే ఏర్పాటు చేసిన కొవిడ్ డెడికేటెడ్ హాస్పిటళ్లను మరోసారి పరిశీలించాలని, అవసరాలకు తగినట్టుగా మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాలు, పిల్లల్లో కరోనా కేసుల విషయంపై స్పష్టమైన ఫోకస్ పెట్టాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఆక్సిజన్, లాజిస్టిక్స్, ఔషధాల లభ్యతను సమీక్షించుకోవాలని, ఆరోగ్య సదుపాయాల సంసిద్ధతనూ పరిశీలించాలని పేర్కొన్నారు. సరిపడా క్వారంటైన్ ఏర్పాట్లనూ అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios