Asianet News TeluguAsianet News Telugu

జన్ ధన్ యోజన నుంచి ఆయుష్మాన్ భారత్ వరకు.. సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా మోదీ పథకాలు..

గుజరాత్‌లోని ఓ సాధారణ కుటుంబానికి చెందిన నరేంద్ర మోదీ.. అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 8 ఏళ్ల పాలనలో ఎన్నో విప్లవత్మాక సంస్కరణలు చేపట్టారు. ఓవైపు సంక్షేమ ఫలాలు అందిస్తూనే.. మరోవైపు దేశాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్నారు. 

these are the great schemes launched under pm narendra modi leadership
Author
First Published Sep 16, 2022, 8:09 AM IST

గుజరాత్‌లోని ఓ సాధారణ కుటుంబానికి చెందిన నరేంద్ర మోదీ.. అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా వరుసగా మూడు సార్లు పనిచేసిన మోదీ.. తన పాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. గుజరాత్ అభివృద్దిలో తనదైన ముద్ర వేశారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో ప్రవేశించిన మోదీ.. వరుసగా రెండుసార్లు ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. 2014 మే 26న దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని మోదీ.. ఈ నెల 8 ఏళ్ల పాలనలో ఎన్నో విప్లవత్మాక సంస్కరణలు చేపట్టారు. ఓవైపు సంక్షేమ ఫలాలు అందిస్తూనే.. మరోవైపు దేశాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్నారు. 

మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాజిక-ఆర్థిక వెనుకబడిన వర్గాలకు.. ఆర్థిక, ఆరోగ్య భద్రత పరంగా ప్రయోజనాలను అందించే లక్ష్యంతో అనేక పథకాలను ప్రారంభించింది.  ఇక, ఈ సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ 72వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా మోదీ హయాంలో ప్రారంభించిన కొన్ని పథకాల గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం.. 

ఆయుష్మాన్ భారత్.. 
2018 సెప్టెంబరులో ప్రధాని మోదీ. ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన-ఆయుష్మాన్ భారత్‌ను ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ-ప్రాయోజిత ఆరోగ్య సంరక్షణ పథకంగా పేర్కొనబడింది. ఈ ఆరోగ్య బీమా పథకాన్ని దేశంలోని 50 కోట్ల మంది (జనాభాలో దాదాపు 40 శాతం) లబ్దిదారులను ఉద్దేశించి ప్రారంభించారు. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా అందించడం ద్వారా ఉచిత ప్రాథమిక, మాధ్యమిక, తృతీయ స్థాయి వైద్య సంరక్షణ పొందవచ్చు. ఈ ఏడాది ఆగస్టు మొదటి వారం వరకు 18.50 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డులు జారీచేయబడ్డాయి. 

పీఎం ఉజ్వల యోజన
కాలుష్యం కలిగించే వంట ఇంధనాలు, పద్ధతుల నుంచి ప్రజలను వంట గ్యాస్ వైపు మళ్లించేందుకు ఈ పథకాన్ని 2016 మే లో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభ సమయంలో.. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన 5 కోట్ల మంది మహిళలకు ఎల్‌పీజీ కనెక్షన్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే పెరుగుతున్న ప్రాధాన్యత, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని SC, ST వర్గాల వంటి మరో ఏడు కేటగిరీలకు చెందిన మహిళా లబ్ధిదారులను చేర్చడానికి 2018 ఏప్రిల్ ఈ పథకం లక్ష్యాన్ని 8 కోట్లకు సవరించారు. 

జన్ ధన్ యోజన
ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన (పీఎంజేడీవై) - నేషనల్ మిషన్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్.. ఈ ఏడాది ఆగస్టులో ఏడేళ్ల అమలును పూర్తి చేసుకుంది. ప్రధాని హోదాలో మోదీ తన మొదటి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో (అంటే 2014 ఆగస్టు 15న) ఈ పథకాన్ని ప్రకటించారు.  అదే ఏడాది ఆగస్టు 28న ఈ పథకాన్ని ప్రారంభించారు. అణగారిన వర్గాలకు బ్యాంకింగ్ సౌకర్యం కల్పించాలనే ఆశయంతో ఈ పథకం మొదలైంది.

స్కాలర్‌షిప్‌లు, సబ్సిడీలు, పెన్షన్‌లు, కోవిడ్ రిలీఫ్ ఫండ్‌లు వంటి ప్రయోజనాలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా జన్ ధన్ ఖాతాలతో సహా బ్యాంక్ ఖాతాలకు జమ చేయబడతాయి.2021 డిసెంబర్ చివరి నాటికి 44.23 కోట్ల ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాల్లో మొత్తం బ్యాలెన్స్ రూ. 1,50,939.36 కోట్లుగా ఉంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. మొత్తం 44.23 కోట్ల ఖాతాల్లో 34.9 కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్నాయి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 8.05 కోట్లు, మిగిలినవి 1.28 కోట్లు ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఉన్నాయి.

స్వచ్ఛ భారత్ అభియాన్..
దేశవ్యాప్తంగా సార్వత్రిక పారిశుద్ధ్యాన్ని సాధించే ప్రయత్నాలను వేగవంతం చేసేందుకు 2014 అక్టోబర్ 2న మహాత్మా గాంధీ 145వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్‌ను ప్రారంభించారు. ఈ ప్రచారం ప్రారంభించిన ఐదు సంవత్సరాల తర్వాత, గ్రామీణ భారతదేశంలో 100 మిలియన్లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం ద్వారా  గ్రామాలు, గ్రామ పంచాయతీలు, జిల్లాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తమను తాము ఓడీఎఫ్‌గా ప్రకటించుకున్నాయి.

ఈ మిషన్ కింద 11.5 కోట్ల ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 2022-23 బడ్జెట్‌లో కేంద్రం స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) కోసం రూ. 7,192 కోట్లు కేటాయించింది. అన్ని నగరాలను చెత్త రహితంగా మార్చాలని గత ఏడాది అక్టోబర్‌లో స్వచ్ఛ్ భారత్ మిషన్ రెండోవ దశను ప్రధాని మోదీ ప్రారంభించారు. అన్ని పట్టణ, స్థానిక సంస్థలను బహిరంగ మల విసర్జన రహితంగా (ఓడీఎఫ్‌ ప్లస్‌) మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లక్ష లోపు జనాభా ఉండే పట్టణాలను ఓడీఎఫ్‌ ప్లస్‌ప్లస్‌గా తీర్చిదిద్దనున్నారు. 

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద.. అర్హులైన రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక ప్రయోజనం అందించబడుతుంది. రూ. 2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో ఈ మొత్తం  చెల్లించబడుతుంది. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నిధులు బదిలీ చేయబడతాయి. ఈ ఏడాది మే 31 ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకం కింద 11వ విడత ఆర్థిక సాయం విడుదల చేశారు. 

ముద్రా యోజన
ముద్రా యోజన అనేది కార్పొరేట్, వ్యవసాయేతర చిన్న/సూక్ష్మ పరిశ్రమలకు రూ. 10 లక్షల వరకు రుణాలు అందించడం కోసం 2015 ఏప్రిల్ 8న ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ రుణాలు పీఎంఎంవై కింద ముద్ర రుణాలుగా వర్గీకరించబడ్డాయి. ఈ రుణాలను వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు ఇస్తాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ 34.42 కోట్ల మంది లబ్ధిదారులు ఈ పథకం కింద రూ. 18.60 లక్షల కోట్ల రుణాన్ని పొందారని చెప్పారు.


ప్రధాన మంత్రి ఆవాస్ యోజన..
2022 నాటికి అందరికీ ఇళ్లు అందించాలనే లక్ష్యంతో 2015 జూన్‌లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) ప్రారంభించారు. ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగంలో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పీఎంఏవై కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో కలిపి 80 లక్షల ఇళ్లను పూర్తి చేయడానికి 48,000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవై..
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై) పథకాలను ప్రధాని మోదీ 2015లో ప్రారంభించారు. దేశంలో బీమా వ్యాప్తి స్థాయిని పెంపొందించడానికి, సామాన్య ప్రజలకు, ముఖ్యంగా పేదలకు, అణగారిన వారికి బీమా రక్షణను అందించడానికి ఇవి ఉద్దేశించబడ్డాయి.పీఎంజేజేబీవై రూ. 2 లక్షల జీవిత బీమా కవరేజీని అందిస్తోంది.  అయితే పీఎంఎస్‌బీవై ప్రమాదవశాత్తు మరణం లేదా శాశ్వత వైకల్యానికి రూ. 2 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ. 1 లక్ష కవరజిని అందజేస్తుంది. 

మేక్ ఇన్ ఇండియా
మేక్ ఇన్ ఇండియా పథకాన్ని భారత్ లో తయారీ రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రారంభించారు. భారతదేశంలో తయారైన ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి, తయారు చేయడానికి.. అలాగే తయారీకి అంకితమైన పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఈ పథకం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవ ఉద్యోగ కల్పన, నైపుణ్యం పెంపుదల కోసం 25 ఆర్థిక రంగాలను లక్ష్యంగా చేసుకుంది. భారతదేశాన్ని ప్రపంచ రూపకల్పన- తయారీ ఎగుమతి కేంద్రంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios