ఇవేం ఎండలు బాబోయ్.! ఉక్కపోత తట్టుకోవడానికి డ్రైవర్ వినూత్న ఆలోచన !! వీడియో వైరల్
ఎండ వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఓ ట్రక్ డ్రైవర్ మాత్రం ఓ వింత పని చేశాడు. దానికి సంబంధించిన వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Viral Video: చూస్తూ చూస్తూనే మే నెలకు వచ్చేశాం. ఫిబ్రవరి చివరి వారం నుంచే ఎండలు తమ ప్రతాపాన్ని చూపించడం మొదలుపెట్టాయి. మార్చిలో ఓ మాదిరిగా ఉన్న ఎండలు ఏప్రిల్ లో దంచికొట్టాయి. ఇక ఇప్పుడైతే ఉదయం 8 గంటల నుంచే భానుడి భగభగలు మొదలవుతున్నాయి. సాయంత్రం 5 అయినా ఉక్కపోత తగ్గడం లేదు. దీని నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు కూలర్లు, ఏసీలు ఉపయోగిస్తున్నారు.
ఎండ వేడిమికి భయపడి అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ పగటి సమయంలో ఇళ్ల నుంచి బయటకు వెళ్లడం లేదు. ఉద్యోగస్తులు అయితే ఎండ ప్రారంభం కాకముందే ఆఫీసుకు బయలు దేరి.. కాస్త చల్లబడ్డాక ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్నారు. అయితే అందరి ఉద్యోగాలు ఒకేలా ఉండవు కదా. మధ్యాహ్నం సమయంలో ఉద్యోగాలకు బయలుదేరాల్సిన వారు ఏసీ కారుల్లోనో, బస్సుల్లోనో వెళ్లి వస్తున్నారు.
అయితే కొన్ని ఉద్యోగాలు మాత్రం ఎంత ఉక్కబోసినా, చమటలు కారినా తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అలాంటి కోవలోకే వస్తుంది ట్రక్ డ్రైవర్ల ఉద్యోగం. ఈ ట్రక్ డ్రైవర్లు నిత్యం పని చేస్తూనే ఉండాలి. ఫ్యాక్టరీలో తయారైన వస్తువులు, కూరగాయలు, ఇతర వస్తువులు నిత్యం ఒక చోటు నుంచి మరో చోటుకి ఈ ట్రక్ ల ద్వారానే తరలిస్తారు. లేకపోతే సాధారణ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కాబట్టి ట్రక్ డ్రైవర్లు నిత్యం తమ విధులకు హాజరవుతూనే ఉండాలి. ఎండ, వాన, చలి వంటివి లెక్కచేయకుండా తమ వృత్తి ధర్మాన్ని పాటిస్తుంటారు. ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నా.. ఇంజన్ నుంచి మరింత వేడి వచ్చి చెమటలు పడుతున్నా డ్రైవింగ్ చేస్తూనే ఉండాలి. దీంతో వారు తొందరగానే అలిసిపోతుంటారు. అయితే ఈ వేడి నుంచి ఉమశమనం పొందేందుకు ఓ ట్రక్ డ్రైవర్ వింత పని చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఓ ట్రక్ డ్రైవర్ ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు డ్రైవింగ్ చేస్తూనే స్నానం చేయడం మొదలుపెట్టాడు. ఓ బకెట్ లో చల్లని నీటిని తీసుకొని, డ్రైవింగ్ సీట్లో కూర్చొని తన శరీరంపై పోసుకోవడం ప్రారంభించాడు. ఓ చేత్తో డ్రైవింగ్ చేస్తూ.. మరో చేతితో స్నానం చేస్తున్నాడు. దీనిని అందులోనే ఉన్న మరో వ్యక్తి వీడియో తీశాడు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడది వైరల్ గా మారింది. ‘Few Seconds Later’ అనే ‘ఎక్స్’ హ్యాండిల్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 11 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీనికి నెటిజన్లు చాలా ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.