తనకు ఇప్పుడే సీఎం అవ్వాలని లేదని, ఆ విషయంలో తాను తొందరపడటం లేదని బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ అధినాయకుడు తేజస్వీ యాదవ్ అన్నారు. ప్రస్తుతానికైతే తాము బీజేపీని గద్దె దించడమే లక్షంగా పని చేస్తున్నామని అన్నారు.
కొంత కాలంగా ఆర్జేడీ నాయకుడు, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ బీహార్ సీఎం అవుతారని వస్తున్న ఊహాగానాలకు ఆయన తాజాగా తెరదించారు. తనకు సీఎం అవ్వాలని తొందరేమీ లేదని స్పష్టం చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని అధికారం నుంచి గద్దె దించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. సీఎం పదవిని దక్కించుకోవడానికి తాను తొందరపడటం లేదని ఆయన జెహనాబాద్లో మీడియా ప్రతినిధులతో తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం: అరవింద్ కేజ్రీవాల్ పీఏకు ఈడీ నోటీసులు
‘‘సీఎం పీఠం సమస్యపై మీడియాలో వచ్చిన కథనాలు సరైనవి కావు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో మా ప్రభుత్వం నడుస్తోంది. కాబట్టి సీఎం పదవి కోసం నేనేమీ తొందరపడడం లేదు’’ అని తేజస్వీ యాదవ్ అన్నారు. 2023లోనే రాష్ట్రానికి తేజస్వీ సీఎం అవుతారని ఇటీవల ఇద్దరు ఆర్జేడీ ఎమ్మెల్యేలు పేర్కొన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
గత సోమవారం మీడియా అడిగిన ఓ ప్రశ్నకు జేడీ (యూ) జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అకా లలన్ సింగ్ సమాధానిమిస్తూ.. 2025లో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం ముఖాన్ని నిర్ణయిస్తామని చెప్పడంతో తేజస్వి సీఎం కావడంపై వివాదం చెలరేగింది. తేజస్వి నేతృత్వంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పోటీ చేస్తుందని గతంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది.
తేజస్వి 2023లోనే బీహార్ ముఖ్యమంత్రి అవుతారని ఆర్జేడీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ మండల్ కొంత కాలం కిందట జోస్యం చెప్పారు. హోలీ పండుగ తర్వాత వచ్చే నెలలోనే రాష్ట్రంలో ఈ మార్పు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత మరో ఆర్జేడీ ఎమ్మెల్యే భాయ్ బీరేంద్ర మాట్లాడుతూ.. తేజస్వీ సీఎం కావడం ఖాయమని, నితీష్ స్వయంగా తేజస్వీకి పగ్గాలు అప్పగిస్తారని అన్నారు. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత అన్ని విషయాలపై స్పష్టత వస్తుందన్నారు.
అయితే ఆర్జేడీ నేతల ప్రకటన తేజస్వికి సీఎం పదవి అప్పగించే విధంగా నితీష్ పై ఒత్తిడి తెచ్చే ఎత్తుగడగా, తమ పార్టీ ఇక వేచి చూసే స్థితిలో లేదని జేడీయూ అధినేతకు పరోక్ష సందేశం ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా.. 2023లోనే తేజస్వీ ముఖ్యమంత్రి అవుతారని రాష్ట్ర ఆర్జేడీ అధ్యక్షుడు జగదానంద్ సింగ్ చెప్పినప్పుడు తనకు తొందరపాటు లేదని, ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదని గతంలో కూడా తేజస్వి స్పష్టం చేశారు.
ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. కర్ణాటకలో ఘటన..
ఇదిలా ఉండగా.. జేడీ(యూ) పార్లమెంటరీ బోర్డు మాజీ చైర్మన్ ఉపేంద్ర కుష్వాహా గత సోమవారం పార్టీకి రాజీనామా చేశారు. ఫిబ్రవరి 28 నుంచి 'విరాసత్ బచావో నమన్ యాత్ర' పేరిట రాష్ట్రంలో యాత్రను ప్రారంభించనున్నారు. మహాత్మాగాంధీ సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించిన పశ్చిమ చంపారన్ జిల్లాలోని భితర్వా గాంధీ ఆశ్రమం నుంచి ఆయన యాత్ర ప్రారంభమవుతుంది. ఇది మార్చి 20న ముగియనుంది. కర్పూరి ఠాకూర్, రామ్ మనోహర్ లోహియా వంటి సోషలిస్టు నాయకులు మిగిల్చిన వారసత్వం ఇప్పుడు ప్రమాదంలో ఉందని, అందువల్ల తన యాత్రలో ప్రజలను కలుస్తానని, దానిపై వారితో అభిప్రాయాలను పంచుకుంటానని కుష్వాహా చెప్పారు.
