ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏకు ఈడీ అధికారులు నోటీసులిచ్చారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ కు గురువారం నాడు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు రావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును చార్ఝీషీట్ లో పేర్కొన్న కొన్ని రోజుల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ చార్జీషీట్లను తప్పుల తడకగా ఆయన కొట్టిపారేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పాత్రధారులతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ కు సంబంధాలున్నాయని ఈడీ అనుమానిస్తుంది.ఈ విషయమై ఢిల్లీ సీఎం పీఏను రేపు ఈడీ అధికారులు విచారించనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో రెండు చార్జీషీట్లను దర్యాప్తు అధికారులు దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అందిన ముడుపులను గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఖర్చు చేసిందని ఈడీ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఆరోపణలు రావడంతో గత ఏడాది ఈ పాలసీని ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై సీబీఐ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించిన విషయం తెలిసిందే.
also read:ఢిల్లీ లిక్కర్ స్కాం : మాగుంట రాఘవరెడ్డిని ప్రశ్నించిన ఈడీ అధికారులు.. రామచంద్రపిళ్లైతో కలిపి విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ లాబీ కీలకంగా వ్యవహరించిందని ఈడీ ఆరోపిస్తుంది.ఈ విషయమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దర్యాప్తు సంస్థలు పలు దఫాలు సోదాలు నిర్వహించాయి. ఇటీవలనే ఏపీ రాష్ట్రానికి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవరెడ్డి అరెస్టైన విషయం తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితులకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ మేరకు ఈ నెల 16 కోర్టు తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితులు బెయిల్ కోసం ధరఖాస్తు చేసుకున్నారు.ఈ పిటిషన్లపై విచారించిన కోర్టు నిందితులకు బెయిల్ నిరాకరించింది.
