కర్ణాటకలోని బెంగళూరులో ఓ ప్రైవేట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. అయితే ఈ సమయంలో రన్ వేపే నీరు నిలిచి ఉండటం వల్ల అది ముందుకు పడి అలాగే వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఎయిర్ పోర్టులో ఓ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఆ ఎయిర్ పోర్టు నుంచి అంతకు కొద్ది నిమిషాల ముందే ఆ విమానం టేకాఫ్ అయ్యింది. అయితే సాకేంతిక సమస్య తలెత్తడంతో అది వెనక్కి వచ్చింది. కాగా.. ల్యాండింగ్ సమయంలో ఆ విమానానికి పెద్ద ప్రమాదమే తప్పింది.
విమానం తిరిగి వచ్చి ల్యాండింగ్ అవుతున్న సమయంలో రన్ వేపై కొంత మేర నీరు నిలిచి ఉంది. దీంతో ఆ నీటిపై నుంచి విమానం వెళ్తున్న సమయంలో ఒక్క సారిగా అది ముందుకు వంగిపోయింది. కొంత దూరం అలాగే ప్రయాణించి ఆగిపోయింది. విమానంలో ప్రయాణికులెవరూ లేరని, ఇద్దరు పైలట్లు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
నోస్ ల్యాండింగ్ గేర్ పూర్తిగా కిందకు దిగకపోవడంతో విమానం ల్యాండ్ అయిందని హెచ్ఏఎల్ వర్గాలు తెలిపాయి. ఫ్లై-బై-వైర్ ప్రీమియర్ ఐఏ అనే ప్రైవేట్ విమానం మంగళవారం ఉదయం కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిందని అధికారులు చెప్పారు. అయితే అందులో సాంకేతిక లోపాన్ని పైలట్ లు గుర్తించిన తరువాత అత్యవసర ల్యాండింగ్ కోసం అనుమతి కోరారని చెప్పారు. అనుమతి లభించిన తరువాత హెచ్ఏఎల్ విమానాశ్రయానికి తిరిగి వచ్చిందని తెలిపారు.
టేకాఫ్ తర్వాత నోస్ ల్యాండింగ్ గేర్ ను పైలట్ లు వెనక్కి తీసుకోలేకపోయారని సమాచారం. అయితే ఒక వేళ ల్యాండింగ్ సమయంలో మంటల చెలరేగితే, దానిని ఆర్పేందుకు ఫైర్ ఇంజన్లతో సహా ఇతర భద్రతా పరికరాలను, సిబ్బందిని అధికారులు సిద్ధంగా ఉంచారు. కాగా.. ఆ విమానం సురక్షితంగా ల్యాండింగ్ అయ్యిందని, ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని హెచ్ ఏఎల్ అధికార ప్రతినిధి గోపాల్ సుతార్ తెలిపారు.
