మణిపూర్ లో శాంతి భద్రతలను కాపాడటానికి వచ్చిన భద్రతా బలగాలకే ఆ రాష్ట్ర ప్రజలు ఎదురు నిలిచారు. మిలిటెంట్లను అదుపులోకి తీసుకోకుండా నియంత్రించారు. చివరికి వారిని విడిచిపెట్టేంత వరకు భద్రతా బలగాలను చుట్టుముట్టారు.
మణిపూర్ లోని ఇంఫాల్ ఈస్ట్ లో ఆర్మీపై స్థానికులు తిరగబడ్డారు. ఎలాంటి ఘర్షణలకు పాల్పడనప్పటికీ దాదాపు 1200 మందికిపైగా గుంపు భద్రతా బలాగాలను చుట్టుముట్టింది. దీంతో ఆర్మీ పరిణితితో ఆలోచించి వెనక్కి తగ్గింది. వారి డిమాండ్ మేరకు 12 మంది మిలిటెంట్లను విడుదల చేసింది. అలాగే వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా వారు తీసుకెళ్లేందుకు అనుమతిని ఇచ్చింది.
మళ్లీ రైలు ప్రమాదం.. రెండు గూడ్స్ రైళ్లు ఢీ.. పట్టాలు తప్పిన 12 కోచ్ లు.. పశ్చిమ బెంగాల్ లో ఘటన
ఇంఫాల్ ఈస్ట్ లోని ఇథమ్ గ్రామాన్ని మహిళల నేతృత్వంలో దాదాపు 1200 మంది గుంపు చుట్టుముట్టడంతో మిలిటెంట్ గ్రూప్ కేవైకేఎల్ కు చెందిన 12 మంది సభ్యులను సైన్యం విడుదల చేసింది. పౌరుల ప్రాణాలను పణంగా పెట్టరాదని సైన్యం పరిణతి చెందిన నిర్ణయం తీసుకుందని, స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రితో వెళ్లిపోయిందని అధికారులు ఆదివారం తెలిపారు.
మిలిటెంట్లు ఉన్నారనే పక్కా సమాచారం రావడంతో భద్రతా దళాలు జూన్ 24వ తేదీన (శనివారం) ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని గ్రామంలో ఆపరేషన్ ప్రారంభించాయని ‘టైమ్స్ నౌ’ కథనం పేర్కొంది. ఈ సందర్భంగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి, యుద్ధ సామాగ్రితో పాటు 12 మంది మెయిటీ మిలిటెంట్ గ్రూప్ కాంగ్లీ యావోల్ కన్నా లూప్ (కేవైకేఎల్) కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నాయి. ఈ మిలిటెంట్లు 2015లో 6 డోగ్రా యూనిట్ పై జరిగిన దాడి సహా పలు దాడుల్లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు.
‘‘ఆ మిలిటెంట్లకు మద్దతుగా, వారిని విడిపించడానికి, మహిళలు, స్థానిక నాయకుడి నేతృత్వంలో సుమారు 1200-1500 మందితో కూడిన గుంపు వెంటనే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. దీంతో దూకుడుగా ఉన్న ఈ గుంపునకు వెనక్కి తగ్గాలని చట్టప్రకారం భద్రతా దళాలు విజ్ఞప్తి చేశాయి. కానీ వారు భద్రతా దళాలను ఆపరేషన్ కొనసాగించకుండా నిరోధించారు. భద్రతా దళాల విజ్ఞప్తి ఎలాంటి సానుకూల ఫలితాన్ని ఇవ్వలేదు’’ అని కోహిమా, ఇంఫాల్ పీఆర్వో (డిఫెన్స్) తెలిపారు.
ఈ అల్లరి మూకలపై పెద్ద ఎత్తున కైనెటిక్ ఫోర్స్ ప్రయోగించడం వల్ల శాంతి భద్రతలు దెబ్బతినే అవకాశం ఉండటం, ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంటుందని భావించిన ఆర్మీ మొత్తం 12 మంది మిలిటెంట్లను స్థానిక నాయకులకు అప్పగించాలని నిర్ణయం తీసుకుందని పీఆర్వో తెలిపారు.
తరువాత వారి నుంచి భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో భద్రతా దళాలు ఆ ప్రాంతం నుంచి మిలిటెంట్లు వెళ్లిపోయారు. శాంతి, సుస్థిరతలను నెలకొల్పేందుకు శాంతిభద్రతల పరిరక్షణలో భద్రతా దళాలకు సహకరించాలని మణిపూర్ ప్రజలకు సైన్యం విజ్ఞప్తి చేసింది.
బీహార్ లో భారీ పేలుడు.. 17 ఏళ్ల బాలుడు మృతి, ముగ్గురికి గాయాలు
షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మెయిటీ కమ్యూనిటీ డిమాండ్ కు నిరసనగా నిర్వహించిన 'ట్రైబల్ సాలిడారిటీ మార్చ్'లో హింస చెలరేగడంతో మణిపూర్లో మే 3 నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈశాన్య రాష్ట్రంలో మెయిటీ, కుకి వర్గాల మధ్య జరిగిన జాతి హింసలో ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
