తమిళనాడులో కొనసాగుతున్న భారీ వర్షాలు.. చెన్నైలోని విద్యా సంస్థలకు నేడు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
తమిళనాడును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ వానల వల్ల రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చెన్నైలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నేడు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో చెన్నైలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
తమిళనాడులో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో అక్టోబరు 29న ప్రారంభమైన ఈ వానలు ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో అనేక జిల్లాలో రెండు రోజులగా పలు పాఠశాలలను మూసివేశారు. గురువారం సాయంత్రం ఏకదాటిగా కురిసిన భారీ వర్షానికి చెన్నై నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి.
సాయంత్రం ఆపకుండా కురిసిన వల్ల ఆఫీసుల నుంచి పనులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న ప్రజలు రోడ్లపైనే తడిసి ముద్దయ్యారు. ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. అంబత్తూరుతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు నీళ్లల్లోనే పరుగులు తీశారు. పాడైన రోడ్లు, నీటి అడుగున గుంతలు పొంచి ఉండడంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
మోర్బీ కేబుల్ బ్రిడ్జి విషాదం.. మచ్చు నదిలో ముగిసిన సెర్చ్, రెస్య్యూ ఆపరేషన్..
కాగా.. ఈ భారీ వర్షాల నేపథ్యంలో నవంబర్ 4న చెన్నైలోని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అలాగే కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో నవంబర్ 4-5 తేదీల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ‘‘ అక్టోబరు 29 రుతుపవనాల ప్రారంభమైన తరువాత తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ పరిసర ప్రాంతాలలో వానలు కురిశాయి. అక్టోబర్ 30న కేరళ, మాహే, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లోని మిగిలిన ప్రాంతాల్లో వర్షం కొనసాగింది ’’అని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఒక ప్రకటనలో తెలిపింది.
కాగా. ప్రస్తుతం వరకు ఉన్న వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఈ వారంతం వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, కేరళ మాహేలలో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోందని వాతవరణ శాఖ తెలిపింది. నేడు (శుక్రవారం) దక్షిణ తమిళనాడు, దక్షిణ కేరళలో కూడా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.
ఇదిలావుండగా.. ఈ వర్షాల వల్ల గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలోని 278 ప్రాంతాల నీరు నిలిచిపోయింది. వీటిని పంపింగ్ చేయడానికి 340 మోటార్ పంపులు ఉపయోగస్తున్నట్టు రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ మంత్రి కెకెఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్ తెలిపారు. చెన్నైలో వరదల నుంచి ప్రజలను రక్షించేందుకు 191 రిలీఫ్ క్యాంపులు సిద్ధంగా ఉంచామని అన్నారు. ఇప్పటి వరకు 283 మందిని ఆరు రిలీఫ్ క్యాంపులకు తరలించామని చెప్పారు. సహాయక శిబిరాల్లో ఉన్న ప్రజలకు అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.
టెక్ దిగ్గజం విప్రో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా అమిత్ చౌదరి నియామకం.
కాగా.. 15 ప్రాంతాల్లో వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు 55 వేల ఆహార ప్యాకెట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. చెన్నైలో వర్షాలు, వరదల పరిస్థితిని పర్యవేక్షించడానికి 17 మంది, రాష్ట్రవ్యాప్తంగా 37 మంది అధికారులను ప్రభుత్వం నియమించింది. అయితే వానల వల్ల సంభవించిన ప్రమాదాల్లో ఓ మహిళ మృతి చెందారు. 16 పశువులు మృత్యువాత పడ్డాయి. 52 గుడిసెలు, ఇళ్లు దెబ్బతిన్నాయి.