శరద్ పవార్ రాజీనామాను ఎన్సీపీ కోర్ కమిటీ తిరస్కరించింది. మళ్లీ ఆయన పార్టీ చీఫ్ గా కొనసాగాలని ప్రతిపాదించింది. అవసరమైతే తాము పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తామని పేర్కొంది. ఇప్పుడు దేశానికి, పార్టీకి, రాష్ట్రానికి మీ అవసరం ఉందని తెలిపింది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత, మహారాష్ట్ర సీనియర్ నేత శరద్ పవార్ రాజీనామాను 18 మంది సభ్యుల కమిటీ శుక్రవారం తిరస్కరించింది. ఆయనే మళ్లీ ఎన్సీపీ చీఫ్ గా కొనసాగాలని ప్రతిపాదించింది. పార్టీ అధ్యక్షుడి పదవి నుంచి వైదొలగాలని ఆయన నిర్ణయించుకున్న తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు శరద్ పవార్ 18 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సుప్రియా సూలే, అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, జయంత్ పాటిల్, ఛగన్ భుజ్బల్, దిలీప్ వాల్సే పాటిల్, అనిల్ దేశ్ముఖ్, రాజేష్ తోపే తదితరులు ఉన్నారు. ఇందులో ఉన్న సభ్యులంతా శరద్ పవార్ అధ్యక్షుడిగా కొనసాగాలని పార్టీ నేత ప్రఫుల్ పటేల్ కు తీర్మానాన్ని సమర్పించారు. తాము వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తామని, కానీ శరద్ పవార్ అధ్యక్షుడిగానే కొనసాగాలని ప్రతిపాదించారు.
‘‘రాష్ట్రానికి, పార్టీకి, దేశానికి ఇప్పుడు మీ అవసరం ఉంది. ఈ పార్టీకి పునాది మీరే. మీరు దేశంలో గౌరవనీయమైన నాయకుడు. మీ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తుంది’’ అని కోర్ కమిటీ నిర్ణయించిందని ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ అన్నారు. ఆయన రాజీనామాను ఏకగ్రీవంగా తిరస్కరించారని, ఆయనే జాతీయ అధ్యక్షుడిగా కొనసాగాలని పార్టీ కోరుకుంటోందన్నారు.
పాక్‌కు రహస్య సమాచారం అందించిన డీఆర్‌డీవో శాస్త్రవేత్త.. అరెస్టు చేసిన మహారాష్ట్ర ఏటీఎస్
తనతో పాటు పలువురు నేతలు పవార్ సాహెబ్ ను కలిశారని, ఈ సమయంలో దేశానికి, పార్టీకి ఆయన అవసరం ఉన్నందున ఆయన నిర్ణయంపై పునరాలోచించాలని కోరామని చెప్పారు. ఎన్సీపీ నేతలే కాకుండా ఇతర పార్టీ నేతలు, ప్రముఖులు కూడా శరద్ పవార్ చీఫ్ గా కొనసాగాలని కోరారని ప్రఫుల్ పటేల్ చెప్పారు.
అయితే పార్టీ సమావేశానికి ముందు ఎన్సీపీ కార్యకర్తలు ముంబైలోని పార్టీ కార్యాలయం వెలుపల శరద్ పవార్ కు మద్దతుగా నినాదాలు చేశారు. సీనియర్ నేత తన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజీనామాను వెనక్కి తీసుకోకపోతే రేపటి నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని తెలిపారు. శరద్ పవార్ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. అనంతరం రాజీనామాను తిరస్కరించాలని కోరుతూ ఎన్సీపీ ప్రతినిధులు ప్రఫుల్ పటేల్ కు లేఖ రాశారు.
కాగా.. మే 2వ తేదీన తన ఆత్మకథ ఆవిష్కరణ సందర్భంగా శరద్ పవార్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలను దిగ్భ్రాంతికి గురిచేసింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించగా, ఎన్సీపీ అధినేతగా శరద్ పవార్ కొనసాగాలని కొందరు డిమాండ్ చేశారు. భావోద్వేగానికి గురైన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి శరద్ పవార్ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు తోటి కార్యకర్తలతో చర్చించి ఉండాల్సింది. కానీ మీరు ఎప్పటికీ అంగీకరించరని నాకు తెలుసు. కాబట్టి నేను ప్రత్యక్ష నిర్ణయం తీసుకున్నాను’’ అని ఆ సమయంలో పవార్ వెల్లడించారు.
