NEET PG - Supreme court: నీట్ పీజీ పరీక్షలో పారదర్శకత కోసం సుప్రీంకోర్టు రా-స్కోర్లు, ఆన్సర్ కీలు, నార్మలైజేషన్ ఫార్ములా విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
NEET PG: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్-పీజీ) పరీక్షలలో పారదర్శకతను మెరుగుపర్చడం కోసం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ జేఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం, నీట్ పీజీ పరీక్షల అసలు మార్కులు (raw scores), ప్రశ్నల జవాబు కీలు, నార్మలైజేషన్ ఫార్ములాలను వెల్లడించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఈ ఆదేశాలు, సీటు బ్లాకింగ్ వంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడం, కౌన్సెలింగ్ ప్రక్రియలో పారదర్శకతను తీసుకురావడమే లక్ష్యంగా జారీ అయ్యాయి. “పలు షిఫ్ట్‌లలో జరిగే నీట్ పీజీ పరీక్షలలో పారదర్శకత కోసం అసలైన మార్కులు, ఆన్సర్ కీలు, నార్మలైజేషన్ ఫార్ములా ప్రకటించాలి” అని కోర్టు పేర్కొంది.
నార్మలైజేషన్ విధానం ప్రకారం, ఒక్కో షిఫ్ట్‌కు వేర్వేరు ప్రశ్నపత్రాలు ఉండటంతో, వాటి కఠినత స్థాయిలో తేడా వస్తుంది. ఈ తేడాను సమానంగా చేయడం కోసం స్కోరు లెక్కించడంలో నార్మలైజేషన్ ఫార్ములాను వర్తింపజేస్తారు. దీన్నిబట్టి మెరిట్ జాబితా సిద్ధం చేస్తారు. ఈ ఆదేశాలు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వేసిన అప్పీల్‌ను విచారిస్తున్న సమయంలో న్యాయస్థానం ఇచ్చింది. ఇది 2018లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన కేసు (State of UP vs Miss Bhavna Tiwari and others)లో భాగంగా ఉంది.
ఇది కేవలం ఒక కేసు మాత్రమే కాదు.. నీట్ పీజీ అభ్యర్థులు దాఖలు చేసిన పలు రిట్ పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పిటిషన్లలో నీట్ పీజీ 2024 పరీక్షలో పారదర్శకత కోసం ఆన్సర్ కీలు, వ్యక్తిగత స్కోర్ కార్డులు విడుదల చేయాలని కోరారు. అలాగే, అభ్యంతరాల పరిష్కార వ్యవస్థ ఏర్పాటును డిమాండ్ చేశారు.
మరో పిటిషన్‌ను యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ (UDF) వేసింది. ఇది నీట్ పీజీ 2025 పరీక్షను రెండు షిఫ్ట్‌లలో నిర్వహించడాన్ని, అలాగే నార్మలైజేషన్ ఫార్ములా వర్తింపజేయడాన్ని వ్యతిరేకించింది. ఈ కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి, జస్టిస్ ఏజీ మసీహ్ విచారించనున్నారు. ముందు వాదనలు వింటున్న సమయంలో, సుప్రీంకోర్టు 2024 నీట్ పీజీతో సంబంధిత అంశాలు ఇప్పుడు వృధాగా మారినట్టు వ్యాఖ్యానించింది. అయితే, దరఖాస్తుదారుల న్యాయవాది దీన్ని పెద్ద సమస్యగా పేర్కొంటూ మార్కుల గందరగోళం, జవాబు కీలు సరిదిద్దడం వంటి అంశాలను ప్రస్తావించారు.
2025 జూన్ 15న జరగనున్న నీట్ పీజీ పరీక్షను రెండు షిఫ్ట్‌లలో నిర్వహించేందుకు ఎన్బీఈఎంఎస్ (NBEMS) నిర్ణయం తీసుకుంది. ఉదయం 9:00 నుండి 12:30 వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 3:30 నుండి 7:00 వరకు రెండవ షిఫ్ట్ జరగనుంది. ఇది పరీక్షా సమానత్వాన్ని హరించడంతోపాటు అభ్యర్థుల న్యాయహక్కుల ఉల్లంఘనగా యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ పేర్కొంది. పబ్లిక్ సర్వేలో 96 శాతం మంది అభ్యర్థులు పరీక్షను ఒక్క షిఫ్ట్‌లో నిర్వహించాలని కోరిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో పరీక్షా పారదర్శకత, సమానత్వంపై అభ్యర్థుల ఆందోళనలు కొనసాగాయి.