Success Story : మారుమూల పల్లెటూరుకు చెందిన ఓ మహిళా గ్రూప్ యోగి సర్కార్ సహకారంతో అద్భుతాలు చేస్తోంది. సాధారణ మహిళలు ఇప్పుడు పారిశ్రామికవేత్తలుగా మారారు.
Success Story : ఉత్తర ప్రదేశ్ లోని షాజహాన్‌పూర్ జిల్లా జింద్‌పురా గ్రామానికి చెందిన నేహా కశ్యప్ మహిళా శక్తిని చాటిచెప్పారు. మిషన్ శక్తి పథకం ద్వారా ఆమె కొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఏక్తా స్వయం సహాయక బృందానికి నాయకత్వం వహిస్తూ నేహా పుట్టగొడుగుల పెంపకంలో విజయం సాధించింది. ఇది ఆమె జీవితాన్నే కాకుండా గ్రూపులోని పది మంది మహిళల జీవితాలను కూడా మార్చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహిళా సాధికారత పథకం వీరికి ఆర్థిక స్వాతంత్య్రంతో పాటు సామాజిక గౌరవాన్ని కూడా ఇచ్చింది.
నేహా సక్సెస్ స్టోరీ
నేహా కశ్యప్ తన కష్టం, సంకల్పంతో పరిమిత వనరులను సద్వినియోగం చేసుకుని జింద్‌పురా గ్రామంలో 42x36 అడుగులలో పుట్టగొడుగుల ఫామ్‌ను ఏర్పాటు చేసింది. కుటుంబ సహకారంతో బటన్, ఆయిస్టర్ రకాల పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా నెలకు ₹40,000 నుండి ₹50,000 వరకు ఆదాయం వస్తోంది. స్టార్టప్ ఫండ్, మిషన్ శక్తి కింద అందిన సహాయం ఆమె ఈ స్థాయికి చేరడానికి సాయపడ్డాయి.
నేహా నాయకత్వంలో ఏక్తా గ్రూపులోని పది మంది సభ్యులు మేకల పెంపకం, కుట్టుపని, జరీ ఎంబ్రాయిడరీ వంటి పనులతో విజయవంతంగా ఉపాధి పొందుతున్నారు. మిషన్ శక్తి సిబ్బంది సహాయంతో మహిళలు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నారు. ఇప్పుడు నేహా లక్ష్యం తన పుట్టగొడుగుల ఉత్పత్తిని పెద్ద మార్కెట్లకు చేర్చడం, వీలైనంత ఎక్కువ మంది మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం. జింద్‌పురా మహిళలు జిల్లాకు, రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆమె కోరుకుంటోంది.
మహిళా సాధికారతకు నిదర్శనం నేహా కశ్యప్
తన సక్సెస్ గురించి నేహా మాట్లాడుతూ… “మిషన్ శక్తి మాకు ఆర్థికబలాన్నే కాదు ఆత్మవిశ్వాసాన్ని, భద్రతను కూడా ఇచ్చింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేపట్టిన ఈ కార్యక్రమం మాకు గర్వకారణం. మహిళలు సంఘటితంగా ఉంటే, ఏ లక్ష్యమైనా దూరం కాదు” అని నేహా కశ్యప్ చెబుతున్నారు.
