కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. కరోనా సమయంలో భారత ప్రభుత్వం చేపట్టిన 'వాక్సిన్ మైత్రి' కార్యక్రమాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమం వల్ల భారత్ గ్లోబల్ లెవెల్‌లో తన స్థాయిని పెంచుకుంది, బాధ్యతగల ప్రపంచ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుందన్నారు..
అనేక దేశాలకు కోవిడ్-19 వ్యాక్సిన్ల పంపిణీని సులభతరం చేసిన నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రశంసించారు. ది వీక్ కోసం రాసిన ఒక వ్యాసంలో.. ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా భారతదేశం తన హోదాను ఎలా ఉపయోగించుకుందో, ప్రపంచ వేదికపై భారత్ తన శక్తిని ఎలా పెంచుకుందో థరూర్ ప్రస్తావించారు. కోవిడ్-19 మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు జనవరి 2021లో ప్రారంభించిన వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం ద్వారా, అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యాక్సిన్‌లను భారతదేశం సరఫరా చేసింది.
కోవిడి మహమ్మారి విజృంభించిన చీకటి రోజుల్లో భారతదేశ టీకా దౌత్యం ఒక వెలుగులా ఉపయోగపడిందని, ప్రపంచ ఆరోగ్య దౌత్యంలో దేశం పాత్రను, ప్రపంచ సవాళ్లను పరిష్కరించే సామర్థ్యాన్ని బలోపేతం చేసిందని ఆయన రాసుకొచ్చారు. కీలక సమయాల్లో దేశాలకు సహాయం చేయగల భారతదేశ సామర్థ్యాన్ని వ్యాక్సిన్ మైత్రి రుజువు చేసిందని అభిప్రాయపడ్డారు.
వ్యాక్సిన్ మైత్రి ద్వారా భారతదేశం ప్రపంచ నాయకుడిగా తన స్థానాన్ని స్థిరం చేసుకుందని అన్నారు. ధనిక దేశాలు తమ సొంత పౌరుల కోసం భారీ మొత్తంలో వ్యాక్సిన్లను నిల్వ చేసుకోవడానికి తమ వనరులను ఖర్చు చేశాయి. అయితే పేద దేశాలకు వాటిని అందిస్తే ప్రజల ప్రాణాలు నిలిచేవి, కానీ కొన్ని దేశాలు తయారు చేసిన వ్యాక్సిన్ నిరుపయోగంగా మారాయని కాంగ్రెస్ ఎంపీ తన వ్యాసంలో రాసుకొచ్చారు.
కోవిడ్-19 రెండవ దశ వ్యాక్సిన్ ఎగుమతులకు తాత్కాలికంగా అంతరాయం కలిగించినప్పటికీ, మనదేశ వ్యాక్సిన్ దౌత్యం భారతదేశ పవర్ ఇమేజ్‌ను గణనీయంగా పెంచిందని శశి థరూర్ అన్నారు. భారతదేశ వ్యాక్సిన్ దౌత్యం విదేశాంగ విధానంలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా మిగిలిపోయింది, ఇది మానవతావాదాన్ని వ్యూహాత్మక ప్రయోజనాలతో మిళితం చేసే దాని సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుంది" అని ఆయన అన్నారు.
ఈ చర్య ద్వారా భారతదేశం మానవతా సహాయానికి ప్రాధాన్యత ఇవ్వగలదని అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి తెలియజేసింది. ప్రపంచ వేదికపై నమ్మకమైన భాగస్వామిగా దేశ ఇమేజ్‌ను బలోపేతం చేసిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంతో భారత్ బాధ్యతగల గ్లోబల్ లీడర్‌గా నిరూపించుకుంది అని శశి థరూర్ అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి:ఇది కదా కూల్ న్యూస్ అంటే.. వచ్చే మూడు రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలు
