Asianet News TeluguAsianet News Telugu

RBI: ఆర్‌బీఐ గవర్నర్‌గా మళ్లీ శక్తికాంత దాసే.. పదవీ కాలం మరో మూడేళ్లు పొడిగింపు

భారతీయ రిజర్వు బ్యాంక్ (reserve bank of india) గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ (Shaktikanta Das ) పునర్నియమితులయ్యారు. ఆయనను ఈ పదవికి రీ అపాయింట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఆర్‌బీఐ గవర్నర్ పదవిలో శక్తికాంత దాస్ మూడేళ్ల పాటు కొనసాగుతారు. లేదా.. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ అదే పదవిలో ఉంటారు.

Shaktikanta Das reappointed as RBI Governor for three more years
Author
New Delhi, First Published Oct 29, 2021, 9:31 AM IST

భారతీయ రిజర్వు బ్యాంక్ (reserve bank of india) గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ (Shaktikanta Das ) పునర్నియమితులయ్యారు. ఆయనను ఈ పదవికి రీ అపాయింట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు చేసిన అపాయింట్‌మెంట్స్ కమిటీ ఈ మేరకు ఆయన నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేసింది. ఆర్‌బీఐ గవర్నర్ పదవిలో శక్తికాంత దాస్ మూడేళ్ల పాటు కొనసాగుతారు. లేదా.. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకూ అదే పదవిలో ఉంటారు. 2021 డిసెంబర్ 10వ తేదీ నుంచి ఆయన పునర్నియామకం అమల్లోకి వస్తుందని ప్రకటించింది కేంద్రం. 

శక్తికాంత దాస్.. గతంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ (ministry of finance) ఆధీనంలోని రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా పని చేశారు. రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా ఆయన 2018 డిసెంబర్ 12వ తేదీన బాధ్యతలను స్వీకరించారు. ఆర్‌బీఐకి ఆయన 25వ గవర్నర్. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఆయన పదవీ కాలం ముగియనుంది. అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో గవర్నర్‌గా ఆయననే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి అవసరమైన ప్రతిపాదనలను తక్షణం ఆమోదించింది. శక్తికాంత దాస్ పదవీకాలం ముగియడానికి దాదాపుగా నెలన్నర రోజుల ముందే- కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Also read:ఆర్‌బీఐ నిబంధనల్లో మార్పులు.. గడువు తీరినా డిపాజిట్‌ తీసుకోకపోతే తక్కువ రేటు..

రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా బాధ్యతలను స్వీకరించడానికి ముందు ఆయన 15వ ఆర్థిక సంఘం తాత్కాలిక సభ్యుడిగా పని చేశారు. 38 సంవత్సరాల పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో శక్తికాంత దాస్ వివిధ హోదాల్లో పనిచేశారు. ముఖ్యంగా ఆర్థిక శాఖపై ఆయనకు గట్టిపట్టు ఉంది. ఆర్థికం, పన్నుల విధానం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగం.. ఇలా అన్నింట్లోనూ ఆయన సుదీర్ఘ కాలం పనిచేసిన అనుభవం వుంది. దీంతో ఆయననే మళ్లీ రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఎనిమిది బడ్జెట్‌లకు సంబంధించిన ప్రతిపాదనలు ఆయన పర్యవేక్షణలోనే రూపుదిద్దుకున్నాయి. ప్రపంచబ్యాంక్ (world bank) , ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (asian development bank), న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (new development bank), ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెన్టిమెంట్ బ్యాంక్‌లకు ఆయన ఆల్టర్నేటివ్ గవర్నర్‌గా సేవలను అందించారు. ఇంటర్నేషనల్ మనీ ఫండ్ (international monetary fund) , జీ20 (g20) , బ్రిక్స్ (brics), సార్క్ (saarc ) వంటి అత్యున్నత వేదికలకు భారత్ తరఫున ప్రాతినిథ్యాన్ని వహించారు శక్తికాంత దాస్.

Follow Us:
Download App:
  • android
  • ios