Air India crash: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద స్థలంలో రెండో బ్లాక్ బాక్స్‌ (కాక్‌పిట్ వాయిస్ రికార్డర్) గుర్తించారు.

Air India crash : అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ప్రమాద స్థలంలో రెండో బ్లాక్ బాక్స్‌ను గుర్తించినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR) అని గుర్తించారు.

రెండవ బ్లాక్ బాక్స్ సేకరణను అధికారికంగా ప్రకటించిన కేంద్రం

ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సీనియర్ సహాయకుడైన పీ.కె. మిశ్రా జూన్ 15న ఒక ప్రకటనలో వెల్లడించారు. ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR)ను ప్రమాదం జరిగిన మరుసటి రోజు అంటే జూన్ 13ననే గుర్తించినట్లు పేర్కొన్నారు.

ఎయిరిండియా ప్రమాదంలో విమానంలోని 242 మందిలో ఒక్కరే బతికారు

లండన్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం అహ్మదాబాద్ నగరంలోని నివాస ప్రాంతంలో కుప్పకూలింది. విమానంలో ప్రయాణిస్తున్న 242 మంది ప్రయాణికులు, సిబ్బందిలో కేవలం ఒకరు మాత్రమే బతికారు. నివాస భవనంపై కూలడంతో ఈ ప్రమాదంలో మరో 38 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 279 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు.

భారత, అమెరికా సంస్థల సంయుక్త దర్యాప్తు

ఈ ఘటనపై ఎయిర్ క్రాష్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించింది. ఈ విమానం అమెరికాలో తయారైనది కావడంతో, అమెరికా జాతీయ రవాణా భద్రతా మండలి (NTSB) అంతర్జాతీయ నిబంధనల ప్రకారం సమాంతర దర్యాప్తు చేపట్టింది. మిశ్రా ప్రకటన ప్రకారం, "FDR, CVR రెండూ గుర్తించారు, వాటిని భద్రంగా భద్రపరిచారు" అని స్పష్టంగా చెప్పారు.

ఎయిరిండియా ప్రమాదానికి కారణం ఏమిటి?

విమాన టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఈ ప్రమాదం జరగడంతో, దానికి గల ఖచ్చితమైన కారణం ఇప్పటికీ తెలియలేదు. విమాన నిపుణులు దీనిపై తక్కువ సమయంలో ఊహించలేమని అభిప్రాయపడ్డారు. అందువల్ల, బ్లాక్ బాక్స్‌ల విశ్లేషణ తర్వాతే నిజమైన కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.