Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని మోడీ, బీజేపీ కోసం సాక్షి మాలిక్ ఒలింపిక్ పతకం గెలువలేదు.. దేశం కోసం సాధించింది - కీర్తి ఆజాద్

తాము ఇందిరా గాంధీ కోసం వరల్డ్ కప్ గెలువలేదని, అలాగే సాక్షి మాలిక్ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కోసం, బీజేపీ కోసం రియో ఒలింపిక్స్ లో పతకం సాధించలేదని మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ అన్నారు. తాము ఏం సాధించినా అది దేశం కోసమే అని స్పష్టం చేశారు. 

Sakshi Malik didn't win an Olympic medal for PM Modi, BJP.. She did it for the country - Keerthy Azad..ISR
Author
First Published Jun 3, 2023, 12:47 PM IST

భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని భారత మాజీ ఆల్ రౌండర్, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు కీర్తి ఆజాద్ తప్పుబట్టారు. ‘‘నేను మొదటి రోజు నుంచే గళం విప్పుతున్నాను. మే 28న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రెజ్లర్లను నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకెళ్లారు. దీనిని చూసిన తరువాత 1983 ప్రపంచ కప్ విజేత జట్టు వారికి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది’’ అని ఆయన ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’తో తెలిపారు.

ఎంపీగా కాదు.. మహిళగా చెబుతున్నా.. రెజ్లర్లకు న్యాయం చేయండి - బీజేపీ నేత ప్రీతమ్ ముండే

‘‘రెజ్లర్లు నిరాశకు గురయ్యారు. తమ పతకాలను గంగానదిలో పడేయాలని భావించారు. ఎందుకంటే ఆ పతకాలు వారివి మాత్రమే కాదు. దేశానికి గర్వకారణమైన ఈ రెజ్లర్ల మాదిరిగానే మనకు గర్వకారణం’’ అని అన్నారు. న్యాయం ఆలస్యమైనందున వెంటనే ప్రివిలేజ్ జస్టిస్ ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆరు నెలలు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

రియో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన తర్వాత సాక్షి మాలిక్ తో సెల్ఫీలు దిగేందుకు వెనుకాడని ప్రధాని మోడీ, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. ‘‘1983లో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ కోసం మేం ప్రపంచకప్ గెలవలేదు. ఇది (నిరసన) రాజకీయమని కొందరు చెప్పినప్పుడు నాకు చాలా వింతగా అనిపించింది. ప్రధాని నరేంద్ర మోడీ కోసం, బీజేపీ కోసం 2016 రియోలో సాక్షి మాలిక్  కాంస్య పతకం సాధించలేదు. ఆమె దేశం కోసం దానిని సాధించింది.’’ అని టీమిండియా మాజీ ఆల్ రౌండర్ పేర్కొన్నాడు.

అమిత్ షా విజ్ఞప్తికి భారీ స్పందన.. మణిపూర్ లో 140కి పైగా ఆయుధాలు సరెండర్..

‘‘పతకం సాధించిన సాక్షి మాలిక్ తో సెల్ఫీలు దిగేందుకు మోడీ వెనకాడలేదు. హర్యానాలోని బేటీ బచావో, బేటీ పడావోలకు సాక్షిని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంపై ఒక్క ట్వీట్ కూడా చేయకుండా సైలెంట్ అయిపోయారు. అప్పుడు వారు సంతోషంగా ఫొటోలు తీసుకున్నారు. కానీ ఈరోజు వారు తమను తాము రక్షించుకోవడానికి నిశ్శబ్దంగా ఉన్నారు.’’ అని తెలిపారు. 

15 లైంగిక వేధింపుల కేసులు నమోదైన బ్రిజ్ భూషణ్ సింగ్ ను ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదని కీర్తి ఆజాద్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘‘రెజ్లర్లు చట్టాన్ని పాటించారు. వారు జనవరిలో ప్రభుత్వం దగ్గరికి వచ్చారు. మేరీకోమ్ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ 30 రోజుల సమయం తీసుకున్నా.. ఏమీ బయటకు రాలేదు. దీంతో వారు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసుల వద్దకు వెళ్లారు. అయినా అటు నుంచి స్పందన రాలేదు. తరువాత సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఆ తరువాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు’’ అని ఆయన అన్నారు. 

గోల్డెన్ టెంపుల్ వద్ద భద్రత కట్టుదిట్టం.. ఎందుకంటే ?

ఇదిలా ఉండగా.. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న భారత అగ్రశ్రేణి రెజ్లర్లకు భారత క్రికెట్ దిగ్గజాలు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, రోజర్ బిన్నీ మినహా 1983 ప్రపంచ కప్ విజేత జట్టు శుక్రవారం మద్దతు తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios