2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ ను తీర్చిదిద్దేందుకు రోడ్ మ్యాప్ అవసరం: కేంద్ర న్యాయశాఖ మంత్రి
New Delhi: సుప్రీంకోర్టు ఆవరణలో 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ.. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు రోడ్ మ్యాప్ అవసరమని నొక్కి చెప్పారు.
Union Law Minister Arjun Ram Meghwal: 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు రోడ్ మ్యాప్ అవసరమని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. సుప్రీంకోర్టు ఆవరణలో 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో న్యాయశాఖ మంత్రి ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'గా జరుపుకుంటున్నామనీ, దేశ ప్రయాణాన్ని విశ్లేషించడానికి, భారతదేశం గమ్యాన్ని చేరుకుందో లేదో తెలుసుకోవడానికి కూడా ఇది అవకాశం కల్పించిందని మేఘ్వాల్ హిందీలో చేసిన సంక్షిప్త ప్రసంగంలో పేర్కొన్నారు.
గత 75 ఏళ్లుగా ఎలా ఉంది.. ఎక్కడికి చేరుకున్నాం, గమ్యాన్ని చేరుకున్నామా లేదా... వాటన్నింటినీ విశ్లేషించుకునే అవకాశం ఉందనీ, 2047 నాటికి మన గమ్యస్థానం గురించి ప్రధాని ఎర్రకోటపై నుంచి ప్రకటించారని తెలిపారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే రోడ్ మ్యాప్ అవసరమని మేఘ్వాల్ అన్నారు. "మనం ఒక రోడ్ మ్యాప్ తయారు చేయాలి.. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రక్రియలో అందరూ కలిసి ముందుకు సాగాలి' అని న్యాయ మంత్రి అన్నారు. ప్రత్యేక భౌగోళిక ప్రాంతం, సార్వభౌమాధికారం, జెండా, కరెన్సీ, భాష అనే ఐదు ఆవశ్యకతలు లేకుండా ఒక దేశం మనుగడ సాగించదని చెప్పారు. పాశ్చాత్య తత్వవేత్తల అభిప్రాయం ప్రకారం, మాగ్నా కార్టాకు ముందు, "చట్ట పాలన-మానవ పాలన మధ్య సంఘర్షణ" ఉందని ఆయన అన్నారు.
భవిష్యత్తులో ప్రజాస్వామ్యానికి పునాది అయిన చట్టబద్ధమైన పాలన ఉంటుందని మాగ్నాకార్టాలోని సెక్షన్ 35 చెబుతోందని మేఘ్వాల్ అన్నారు. అయితే గౌతమ బుద్ధుని కాలంలో జరిగిన సభల్లో, సంత్ రవిదాస్ తదితరుల హయాంలో జరిగిన సభల్లో కనిపించిన ప్రజాస్వామ్య సంప్రదాయాల చరిత్ర భారతదేశానికి ఉందన్నారు. అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్, లాయర్స్ ఛాంబర్లకు సంబంధించిన అంశాలతో సహా వారి సమస్యలను మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని ఆయన న్యాయవాదులకు హామీ ఇచ్చారు. ఈ-కోర్టులు, కృత్రిమ మేధస్సు వినియోగం, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాన్ని బలోపేతం చేయడం సహా పలు మార్పులను అమలు చేసే పనిలో సీజేఐ ఉన్నారని తెలిపారు.
సుప్రీంకోర్టు ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. భారత న్యాయవ్యవస్థ ముందున్న అతిపెద్ద సవాలు న్యాయాన్ని పొందడానికి అడ్డంకులను తొలగించడమేననీ, న్యాయస్థానాలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రాధాన్యతా ప్రాతిపదికన మౌలిక సదుపాయాలను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీబీఏ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది ఆదిష్ సి అగర్వాల్, ఎస్సీబీఏ కార్యదర్శి రోహిత్ పాండే తదితరులు పాల్గొన్నారు.