AI Talent India: ఏఐ మార్కెట్లో ఎన్విడియా, ఆంత్రోపిక్ పరిణామాలు టాలెంట్ విలువను చాటిచెప్పాయి. భారత్ తన మేథస్సును కాపాడుకోవాలని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సూచించారు.
రచయిత : కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
AI Talent India: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ఇప్పుడు అసలైన యుద్ధం నడుస్తోంది. ఇక్కడ పెట్టుబడులు ఎప్పుడూ టాలెంట్ వెంటే వెళ్తాయి. ఆ టాలెంట్ ఎప్పుడూ మంచి అవకాశాలు ఉన్నచోటికే వెళ్తుంది. నా కెరీర్‌లోని ప్రతి దశలోనూ నేను ఈ తీరును చూస్తూనే ఉన్నాను. పెట్టుబడి ముందుగానే వస్తుంది, అవసరానికి మించి నిర్మాణాలు చేపడుతుంది, ఆపై భయపడుతుంది, విలువలను తిరిగి లెక్కించుకుని మళ్లీ నిర్మించుకుంటుంది. కానీ, ఈ క్రమంలో అంతర్లీనంగా ఆ టెక్నాలజీ వినియోగం మాత్రం నిరంతరం పెరుగుతూనే ఉంటుంది.
మార్కెట్లు కేవలం కంపెనీల విలువను సూచించే కొలమానాలు మాత్రమే తప్ప, టెక్నాలజీ భవిష్యత్తును అంచనా వేసేవి కావు అని ఇటీవలే నేను ఈ కాలమ్‌లో వాదించాను. ఆ తర్వాత గడిచిన కొద్ది వారాల పరిణామాలు ఈ విషయాన్ని నిజమని నిరూపించాయి.
నవంబర్ 5 నుంచి టెక్ ప్రపంచంలో నాలుగు ప్రధాన మార్పులు జరిగాయి..
1. నాస్డాక్ 5.5 శాతం పడిపోయింది, 2.5 నుండి 3 ట్రిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది, నిక్కీ, కోస్పి సూచీలు దాదాపు 6 శాతం క్షీణించాయి.
2. జెన్సెన్ హువాంగ్ రాజీనామా చేయడంతో, ఎన్విడియా వరుసగా ఏడో వారమూ నష్టాలను చవిచూసి, తన అక్టోబర్ గరిష్ఠ స్థాయి కంటే దాదాపు 1.6–1.7 ట్రిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది.
3. ఆంత్రోపిక్ సంస్థ 'ANT' పేరుతో ఒక్కో షేరు 83 డాలర్ల చొప్పున, దాదాపు 1.5 ట్రిలియన్ డాలర్ల విలువతో మార్కెట్లో లిస్ట్ అయింది.
4. హువాంగ్ను తిరిగి నియమించడంతో ఎన్విడియా దాదాపు 30 శాతం, నాస్డాక్ సుమారు 7 శాతం పెరిగాయి.
ఈ నాలుగు సందర్భాల్లో మూడింటిలో అసలు టెక్నాలజీలో ఎలాంటి మార్పు జరగలేదు, అయినా ధరలు ట్రిలియన్ల డాలర్ల మేర కదిలాయి. నాలుగోదైన ఆంత్రోపిక్ లిస్టింగ్‌లో మాత్రం వాస్తవంగానే పెద్ద మార్పు జరిగింది, అది వేగంగా పైకి ఎగబాకింది. ఈ అన్నింటికీ ఉమ్మడి సూత్రం టాలెంట్, బిల్డర్స్. మార్కెట్లు వీరి విలువను అటు ఇటు రెండు వైపులా సరిగ్గా అంచనా వేయలేకపోతున్నాయి.
నవంబర్‌లో టెక్ మార్కెట్ కుదుపులు.. ఎన్విడియా రికవరీ
నవంబర్ 23న, హువాంగ్ రాజీనామా చేసిన 11 రోజుల తర్వాత, ఎన్విడియా బోర్డు ఆయనను ఏకగ్రీవంగా ప్రెసిడెంట్, సీఈఓ, డైరెక్టర్‌గా తిరిగి నియమించింది. విదేశీ నిఘా ఆపరేషన్‌పై విచారణ ఇంకా కొనసాగుతోంది. మన కాలంలో ఏఐ అత్యంత వ్యూహాత్మకమైన పరిశ్రమ. ఎన్విడియా దానికి కేంద్రబిందువు. హువాంగ్ ఆ సంస్థలోని అత్యంత విలువైన ప్రతిభావంతుల్లో ఒకరు. ఈ పరిశ్రమలోని అత్యంత విలువైన వ్యక్తులే లక్ష్యంగా మారుతున్నారు. కంపెనీల బోర్డులు తమ వ్యాపార వ్యూహాలకు ఇచ్చినంత ప్రాధాన్యంను వారి భద్రతకు, వారిని సంస్థలోనే నిలుపుకోవడానికి కూడా ఇవ్వాలి.
ఇప్పుడు మార్కెట్ ఏం చేసిందో చూడండి. అక్టోబర్ 6 నాటి రికార్డు స్థాయి నుంచి ఎన్విడియా ఏడు వారాల పాటు పడిపోయి దాదాపు సగం విలువను కోల్పోయింది. ఆ తర్వాత ఒక్క సెషన్లోనే దాదాపు 30 శాతం పెరిగింది. దానితో పాటు నాస్డాక్ కూడా సుమారు 7 శాతం ఎగబాకింది. శుక్రవారం నుంచి సోమవారం మధ్య ఒక్క ట్రాన్సిస్టర్ కూడా మారలేదు. మారిందల్లా వాటిని తయారు చేసే వ్యక్తులు సంస్థలోనే ఉంటారనే నమ్మకం మాత్రమే.
హువాంగ్ లేని సమయంలో, " ఎన్విడియాలోని భర్తీ చేయలేని ప్రతిభావంతులు ఇప్పుడు సంస్థను వీడాలని ఆలోచిస్తున్నారు" అని సంస్థ డెవలపర్ టెక్నాలజీ డైరెక్టర్ హెచ్చరించారు. వేతన సమీక్షలను ముందుకు జరిపారు, ఇతర సంస్థల రిక్రూటర్లు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. మార్కెట్ కేవలం టాలెంట్ రిస్క్‌ను మాత్రమే లెక్కగట్టింది.. ఈ పరిశ్రమలో సిలికాన్ ఎంత అరుదైనదో, టాలెంట్ కూడా అంతే అరుదైనది.
ట్రిలియన్ డాలర్ల క్లబ్లో ఆంత్రోపిక్ సంచలనం
నవంబర్ 19న ఆంత్రోపిక్ సంస్థ 'ANT' అనే పేరుతో నాస్డాక్లో లిస్ట్ అయింది. కానీ దానిలో చీమంత చిన్నది ఏమీ లేదు. ప్రారంభంలో అంచనా వేసిన 70 నుండి 78 డాలర్ల శ్రేణిని దాటి, ఒక్కో షేరు 83 డాలర్ల వద్ద ధర నిర్ణయించారు. దీనితో దాని మార్కెట్ విలువ దాదాపు 1.5 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇది 111.50 డాలర్ల వద్ద ప్రారంభమై, తర్వాత కొంత స్థిరపడింది.
ఐదేళ్ల క్రితం అసలు ఉనికిలోనే లేని ఆంత్రోపిక్, నేడు భారతదేశంలోని టాప్ 10 కంపెనీల మొత్తం విలువ కంటే పెద్దదిగా ఎదిగిందని ఉదయ్ కోటక్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆయన వేసిన ప్రశ్నలకు గంభీరమైన సమాధానాలు అవసరం.. "మన విలువ తక్కువగా అంచనా వేయబడిందా, లేక కొత్త ప్రపంచాన్ని మనం అందుకోవాల్సి ఉందా? లేదా ఈ రెండూనా?" నా సమాధానం అయితే ఈ రెండూ. 2025 మొత్తం ఏడాదిలో 4.6 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిన ఆంత్రోపిక్, 2026 ప్రథమార్థంలోనే 16.3 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నివేదించింది. ఇది అత్యంత వేగవంతమైన వినియోగ వృద్ధి, ఈ వినియోగం ఎప్పుడూ ఒకే దిశలో సాగుతుంది.
2024 చివరి నాటికి 940 మంది ఉద్యోగులు ఉన్న ఆంత్రోపిక్, ఇప్పుడు సుమారు 5,300 మందితో నిర్మితమైంది. నా లెక్క ప్రకారం, ఒక్కో ఉద్యోగికి దాదాపు 280 మిలియన్ డాలర్ల లిస్టెడ్ విలువ అన్నమాట. అయితే ఇది ఎంత సున్నితమైన విషయమో ఆ సంస్థ తన ఫైలింగ్‌లో నిజాయితీగా వెల్లడించింది. ప్రత్యర్థి సంస్థలు తమ ఉద్యోగులను "నేరుగా ఆకర్షించడం కొనసాగిస్తున్నాయని", తమ ఈక్విటీ అవార్డులు గతంలో ఉన్నంత ప్రభావవంతంగా ఉండకపోవచ్చని అది పేర్కొంది.
నా కెరీర్‌లోని ప్రతి దశలోనూ నేను ఈ తీరును చూస్తూనే ఉన్నాను. పెట్టుబడి ముందుగానే వస్తుంది, అవసరానికి మించి నిర్మాణాలు చేపడుతుంది, ఆపై భయపడుతుంది, విలువలను తిరిగి లెక్కించుకుని మళ్లీ నిర్మించుకుంటుంది. కానీ, ఈ క్రమంలో అంతర్లీనంగా ఆ టెక్నాలజీ వినియోగం మాత్రం నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. 2000 సంవత్సరంలో ఇంటర్నెట్ బబుల్ పేలినప్పుడు నాస్డాక్ 78 శాతం నష్టపోయింది,
కానీ నేడు మన చుట్టూ ఉన్న ప్రతిదానికీ ఇంటర్నెట్ పునాదిగా మారింది. నవంబర్ పతనం, ఎన్విడియా కుదుపు, సోమవారం నాటి పుంజుకోవడం అన్నీ వేగంగా నడుస్తున్న ఒకే సినిమా లాంటివి. ఏఐ తన ఒడిదుడుకులను తట్టుకుని నిలబడుతుంది. కానీ, అది పూర్తిస్థాయిలో విస్తరించినప్పుడు దానిపై ఆధిపత్యం ఎవరికి ఉంటుందన్నదే అసలు ప్రశ్న. మార్కెట్ కరెక్షన్ సమయంలో టాలెంట్, సామర్థ్యం, ఆస్తులు తక్కువ ధరకే లభిస్తాయి.
మూడు వారాల క్రితం, ఒక ఆన్లైన్ బ్రోకరేజ్ సంస్థ సీఈఓ మాట్లాడుతూ, నష్టపోవడానికి భారతదేశంలో ఏఐ కంపెనీలేవీ లేకపోవడం ఊరటనిచ్చే విషయమని అన్నారు. సొంత టెక్నాలజీ లేని దేశం మార్కెట్ పతనాల నుంచి తప్పించుకోవచ్చు. కానీ, అది ఆ రంగంలో వచ్చే పెట్టుబడులు, ఉద్యోగాలు, సంస్థలు, ఆర్థిక వ్యవస్థల్లో కలిగే అపూర్వమైన స్థూల విలువ జోడింపు (GVA) ప్రయోజనాలను కూడా కోల్పోతుంది. అంతేకాకుండా, తన దేశీయ వ్యాపారాలు, వినియోగదారులు, విద్యార్థులు ఆ టెక్నాలజీ చుట్టూ అవకాశాలను నిర్మించుకునే నిబంధనలను కూడా అది నిర్ణయించలేదు.
ఏఐ అనేది ఒక యుద్ధభూమి. ఇక్కడ టాలెంట్ మునుపెన్నడూ లేనంత ముఖ్యమైనది. టాలెంట్ ఎక్కడ ఉంటే పెట్టుబడులు అక్కడికే ప్రవహిస్తాయి. అవకాశాలు ఎక్కడ ఉంటే టాలెంట్ అక్కడికే వెళ్తుంది. భారతదేశంలో టాలెంట్‌కు కొరత లేదు. ప్రపంచంలోని చిప్ డిజైనర్లలో ఎక్కువ మంది ఇక్కడే ఉన్నారు, వారు రూపొందించిన సిలికాన్ మేథో సంపత్తి ఇతర దేశాల బ్యాలెన్స్ షీట్లలో చేరుతోంది.
స్టాన్ఫోర్డ్ 2026 ఏఐ ఇండెక్స్ ప్రకారం, ఏఐ రచయితలు, ఆవిష్కర్తల విషయంలో అమెరికా (2,20,000) తర్వాత భారతదేశం సుమారు 50,000 మందితో ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది, ఏఐ నైపుణ్య వ్యాప్తిలో మొదటి స్థానంలో ఉంది. కానీ, ఏఐ టాలెంట్ విదేశాలకు తరలిపోవడంలోనూ మన దేశమే మొదటి స్థానంలో ఉన్నట్లు అది నమోదు చేసింది. మనం ఇంజనీర్లను తయారు చేస్తున్నాం, వారు నిర్మించిన వాటిని ఇతరులు సొంతం చేసుకుంటున్నారు.
వాషింగ్టన్ తలుపులు కూడా అస్థిరంగానే ఉన్నాయి.. దాని 1,00,000 డాలర్ల హెచ్-1బీ వీసా ఫీజు జూన్‌లో కొట్టివేశారు.. ప్రస్తుతం అప్పీల్లో ఉంది. అవకాశాలు, క్లిష్టమైన సమస్యలు, కంప్యూట్ సామర్థ్యం, యాజమాన్యం ఎక్కడ ఉంటే టాలెంట్ అక్కడికే కదులుతుంది. అందుకే మన పెట్టుబడులు చిప్ డిజైన్‌కు నిధులు సమకూర్చాలి, మనకు సొంత ఇన్ఫరెన్స్ చిప్స్, దేశీయ కొనుగోళ్లు అవసరం, మన స్వంత భాషలలో కంప్యూట్, మోడల్స్ అవసరం.
ఐదేళ్ల కంపెనీ భారతదేశంలోని 10 అతిపెద్ద కంపెనీల కంటే ఎక్కువ విలువ కలిగి ఉండటం మనల్ని భయపెట్టకూడదు. అది మనకు పాఠం నేర్పాలి. వ్యవస్థాపకులు వెళ్తారు, మళ్లీ తిరిగి వస్తారు. బోర్డులు విచారణలు జరుపుతాయి. ఇవేవీ అంతర్లీనంగా ఉన్న వాస్తవాన్ని మార్చలేవు.. కంప్యూట్ చౌకగా మారుతుంది, మోడల్స్ మరింత మెరుగవుతాయి, వినియోగం ఒకే దిశలో ముందుకు సాగుతుంది, తమ టాలెంట్‌ను కాపాడుకున్న దేశాలు, సంస్థలు తమ ఆధిక్యాన్ని మరింత పెంచుకుంటాయి. ధరలు అనేవి ఈరోజు ఒక వస్తువు విలువ ఎంత అని అడుగుతాయి... కానీ భవిష్యత్ ప్రగతి రేఖ రేపు ఏం సాధ్యమవుతుందని అడుగుతుంది. గత 50 ఏళ్లుగా ఈ రెండింటిలో ఒకే ప్రశ్నకు స్థిరమైన సమాధానం ఉంది. ఈ ప్రగతి ఎడతెగనిది. దానిని ఎవరు సొంతం చేసుకుంటారో టాలెంట్ నిర్ణయిస్తుంది. మిగతాదంతా కేవలం సౌండ్ మాత్రమే.
- కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్
(రచయిత భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ మాజీ సహాయ మంత్రి, మాజీ ఎంపీ. ప్రస్తుతం బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడిగా, నేమోమ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తన కెరీర్‌ను చిప్ డిజైనర్‌గా ప్రారంభించారు. ఇవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు)














