Madhya Pradesh: ఇక ఎంత తాగినా బెంగ లేదు
వైన్ షాపుల ముందు ఎప్పుడూ మందుబాబుల హడావిడి ఉంటుంది. ఆ పక్కనే వేడివేడిగా చీకులు, స్టఫింగ్ షాపులతో రద్దీగా ఉంటుంది. కానీ అదే వైన్ షాప్ ముందు ఇప్పుడు విడ్డూరంగా డాక్టర్లు...వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఏకంగా టెంట్లే వేసేస్తున్నారు. ఎందుకిలా?

మందు కంటే ముందు హెల్త్ చెకప్
సాధారణంగా వైన్ షాపుల ముందు మందు బాబులే ఉంటారు. దాని పక్కన వేడివేడిగా స్టఫింగ్ కూడా అమ్ముతుంటారు. ఓ పక్క ఆల్కహాల్ సేవిస్తూ...మరో పక్క స్టఫింగ్ తింటూ చిల్ అవుతుంటారు. ఒంట్లో ఎన్నో జబ్బులున్నా టైంకి మందులు వేసుకోగారు గానీ...టైంకి వైన్స్ దగ్గర మాత్రం వాలిపోతారు. అందుకే వాళ్ల ఆరోగ్యం కోసం అధికారులు తీసుకున్న నిర్ణయం తెలిస్తే...మీకూ మతి పోవాల్సిందే.
వినూత్న కార్యక్రమానికి శ్రీకారం
మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని బీనా సహా పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాల సమీపంలో ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. సాధారణంగా మద్యం కొనడానికి వచ్చే వ్యక్తులు ఈసారి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే దీని వెనుక అధికారుల ఉద్దేశం మద్యం అమ్మకాలను అడ్డుకోవడం కాదు. తరచూ మద్యం సేవించడం వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స అందించడమే.
ముఖ్యంగా ప్రతిరోజూ మద్యం తాగే అలవాటు ఉన్నవారిపై అధికారులు దృష్టి పెట్టారు. ఇందుకోసం స్థానిక మద్యం దుకాణాల నిర్వాహకుల సహకారం తీసుకున్నారు. తరచూ వైన్స్‌కు వచ్చేవారు, ఉదయం దుకాణాలు తెరవకముందే అక్కడికి చేరుకునేవారిని గుర్తించి వారి వివరాలను సేకరించారు. ఈ జాబితా ఆధారంగా వైద్య బృందాలు వారిని పరీక్షిస్తున్నాయి.
లివర్, కిడ్నీ పనితీరుపై ప్రత్యేక దృష్టి
ఈ వైద్య శిబిరాల్లో కేవలం సాధారణ పరీక్షలే కాకుండా మద్యం సేవించేవారికి ఎక్కువగా సమస్యలు వచ్చే అవయవాల ఆరోగ్యంపైనా ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. మొదట బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత లివర్, కిడ్నీల కోసం బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నారు. పరీక్షల్లో ఏవైనా సమస్యలు గుర్తిస్తే వైద్యులు తగిన సలహాలు ఇస్తున్నారు. అవసరమైన మందులను కూడా ఉచితంగా అందిస్తున్నారు. దీర్ఘకాలంగా మద్యం సేవించడం వల్ల పోషకాహార లోపాలు తలెత్తే అవకాశం ఉండటంతో విటమిన్ బి1, మల్టీవిటమిన్ సప్లిమెంట్లను సైతం అందిస్తున్నారు. మద్యం అలవాటు కారణంగా ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో వివరిస్తూ జాగ్రత్తలు చెబుతున్నారు.
రెండు రోజుల్లోనే 147 మందికి పరీక్షలు
ఈ కార్యక్రమం ప్రారంభించిన కొద్ది రోజులకే మంచి స్పందన కనిపించింది. మొదటి రెండు రోజుల్లో మొత్తం 147 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో 144 మంది నుంచి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపించారు. తరచూ మద్యం తాగేవారిలో లివర్ దెబ్బతిన్నట్లు గుర్తించారు.
కల్తీ మద్యం ఘటన తర్వాత ప్రత్యేక చర్యలు
ఇటీవల కల్తీ మద్యం ఘటనలో ప్రాణనష్టం సంభవించడంతో మద్యం వినియోగం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని జిల్లా యంత్రాంగం భావించింది. ఈ నేపథ్యంలోనే మద్యం దుకాణాల వద్ద వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమం కేవలం పట్టణాలు, వైన్స్ దుకాణాలకే పరిమితం కావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆరోగ్య కేంద్రాల సహకారంతో క్రమం తప్పకుండా మద్యం సేవించే వారిని గుర్తించి వైద్య సహాయం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు.
సాధారణంగా అనారోగ్యం వచ్చినప్పుడు ఆసుపత్రులకు వెళ్లే చాలామంది.. మద్యం అలవాటు వల్ల తమ శరీరంలో జరుగుతున్న మార్పులను మాత్రం పట్టించుకోరు. అలాంటి వారిని నేరుగా గుర్తించి వైద్య పరీక్షలు చేయించడం ద్వారా సమస్య తీవ్రం కాకముందే చికిత్స అందించాలన్నది అధికారుల ఆలోచన. మద్యం అలవాటును వెంటనే మాన్పించడం సాధ్యం కాకపోయినా.. కనీసం ఆరోగ్యంపై అవగాహన కల్పించి ప్రాణాపాయ సమస్యలను ముందుగానే గుర్తించాలన్న ఈ ప్రయత్నం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.















