- Home
- Technology
- Gadgets
- Vivo X500 Series: ఐఫోన్, శాంసంగ్‌కు చెమటలు పట్టించేలా వివో X500 సిరీస్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
Vivo X500 Series: ఐఫోన్, శాంసంగ్‌కు చెమటలు పట్టించేలా వివో X500 సిరీస్.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
Vivo X500 Series: వివో తన పవర్ఫుల్ వివో ఎక్స్500 సిరీస్ ఫోన్లను ఇండియాలో లాంచ్ చేసింది. 200MP జైస్ కెమెరా, 2nm ప్రాసెసర్, 7,800mAh బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ల ధర, ఇతర ఫీచర్ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

కెమెరా కాదు ఇది రాకెట్ లాంచర్.. 400mm జూమ్‌తో వివో కొత్త ఫోన్లు
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో, భారత మార్కెట్లో తన అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ సిరీస్ వివో ఎక్స్500 ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా కంపెనీ మొత్తం మూడు మోడళ్లను తీసుకొచ్చింది. అవి వివో ఎక్స్500, వివో ఎక్స్500 ప్రో, వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్.
ఈసారి వివో కంపెనీ ప్రధానంగా కెమెరాపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా టాప్ మోడల్ అయిన వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్ లో 200 మెగాపిక్సెల్ జైస్ టెలిఫోటో కెమెరాను ఇచ్చారు. అంతేకాకుండా, ఫోన్ జూమ్ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడానికి కంపెనీ విడిగా టెలిఫోటో ఎక్స్టెండర్ కిట్లను కూడా విక్రయిస్తోంది. ఈ సిరీస్‌లో 2nm ప్రాసెసర్, 144Hz డిస్ప్లే, భారీ బ్యాటరీ వంటి అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి.
వివో ఎక్స్500 సిరీస్ ధర, సేల్ వివరాలు ఇవే
భారత మార్కెట్లో విడుదలైన ఈ మూడు ఫోన్లలో బేస్ మోడల్ వివో ఎక్స్500 (12GB RAM + 256GB స్టోరేజ్) ధర రూ. 1,19,999 గా ఉంది. దీని తర్వాత వివో ఎక్స్500 ప్రో (12GB RAM + 256GB స్టోరేజ్) ధర రూ. 1,49,999 గా నిర్ణయించారు.
ఇక అత్యంత ఖరీదైన టాప్ మోడల్ వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్ (12GB RAM + 256GB స్టోరేజ్) ప్రారంభ ధర రూ. 1,64,999 కాగా, దీని 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,79,999 గా ఉంది. డిసెంబర్ 3 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వివో అధికారిక వెబ్సైట్ ద్వారా వీటి సేల్స్ ప్రారంభమవుతాయి.
200MP కెమెరా, 400mm జూమ్.. ఫోన్‌ను కెమెరాలా మార్చేయొచ్చు
వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్ లోని 200MP టెలిఫోటో కెమెరానే ఈ సిరీస్‌కు మెయిన్ హైలైట్. జైస్ భాగస్వామ్యంతో రూపొందించిన ఈ కెమెరా సిస్టమ్ చాలా దూరంలో ఉన్న వస్తువులను కూడా క్లియర్‌గా ఫోటో తీస్తుంది. ఇందులో 3.5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ ఉంది. సాధారణ ఫోన్లలో జూమ్ చేస్తే ఫోటో క్వాలిటీ తగ్గుతుంది, కానీ ఈ టెలిఫోటో కెమెరాతో ఆ సమస్య ఉండదు.
వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ, స్పోర్ట్స్ లేదా స్టేజ్ షోలను దూరం నుంచి షూట్ చేసేవారి కోసం కంపెనీ విడిగా 200mm (ధర రూ. 15,999), 400mm (ధర రూ. 27,999) జైస్ టెలిఫోటో ఎక్స్టెండర్ కిట్లను అమ్ముతోంది. అంటే 400mm లెన్స్ కావాలంటే ఫోన్ ధరతో పాటు అదనంగా మరో రూ. 28 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
మూడు ఫోన్లలో వేర్వేరు కెమెరా సెటప్
ఈ సిరీస్‌లోని మూడు ఫోన్లలోనూ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు, కానీ వాటి సామర్థ్యాలు వేర్వేరుగా ఉన్నాయి. వివో ఎక్స్500, వివో ఎక్స్500 ప్రో మోడళ్లలో 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 64MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ప్రో మోడల్లో జైస్ కెమెరా టెక్నాలజీని కూడా వాడారు.
ఇక వివో ఎక్స్500 ప్రో మ్యాక్స్ విషయానికి వస్తే.. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరాతో పాటు శక్తివంతమైన 200MP టెలిఫోటో కెమెరా ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం మూడు ఫోన్లలోనూ 50MP ఫ్రంట్ కెమెరా అందించారు.
2nm ప్రాసెసర్‌తో సూపర్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్
ఈ కొత్త సిరీస్‌లో మీడియాటెక్ కంపెనీకి చెందిన లేటెస్ట్ డైమెన్సిటీ 9600 సిరీస్ ప్రాసెసర్లను వాడారు. వివో ఎక్స్500 లో డైమెన్సిటీ 9600M చిప్సెట్ ఉండగా, ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లలో 2nm టెక్నాలజీతో తయారైన డైమెన్సిటీ 9600 ప్రో ప్రాసెసర్ ఇచ్చారు.
2nm చిప్సెట్ వల్ల ఫోన్ వేగం పెరగడమే కాకుండా బ్యాటరీ కూడా ఆదా అవుతుంది. హెవీ గేమింగ్, వీడియో ఎడిటింగ్, ఏఐ ఫీచర్లను స్మూత్‌గా రన్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ మూడు ఫోన్లు 12GB RAM, UFS 4.1 స్టోరేజ్, ఆండ్రాయిల్ 17 ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 7 తో పనిచేస్తాయి.
భారీ బ్యాటరీ, డిస్ప్లే, కెమెరా యాక్సెసరీస్ వివరాలు ఇవే
బ్యాటరీ విషయంలో వివో ఈసారి గట్టిగానే ప్లాన్ చేసింది. వివో ఎక్స్500లో 7,500mAh బ్యాటరీ, ఎక్స్500 ప్రోలో 6,510mAh బ్యాటరీ, ప్రో మ్యాక్స్ లో ఏకంగా 7,800mAh భారీ బ్యాటరీని ఇచ్చారు. అన్ని మోడళ్లలో 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. డిస్ప్లే పరంగా X500 లో 6.59 అంగుళాల అమోలెడ్ (144Hz) స్క్రీన్, ఎక్స్500 ప్రో లో కాంపాక్ట్‌గా ఉండే 6.36 అంగుళాల అమోలెడ్ స్క్రీన్ ఇచ్చారు.
ప్రో మ్యాక్స్ లో మాత్రం 6.85 అంగుళాల 2K అమోలెడ్ 144Hz, డాల్బీ విజన్ సపోర్ట్ పెద్ద స్క్రీన్ ఉంది. మూడు ఫోన్లకు డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68, ఐపీ69 రేటింగ్స్ ఉన్నాయి. వీటితో పాటు ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ కోసం రూ. 11,999 విలువైన ఇమేజింగ్ కిట్, అలాగే రూ. 2,29,999 ధరతో ప్రో మ్యాక్స్ ఫోటోగ్రఫీ కిట్ వేరియంట్‌ను కూడా వివో అందుబాటులోకి తెచ్చింది.















