వలస కార్మికుల కోసం.. శ్రామిక్ రైళ్లకు అనుమతివ్వండి: రాష్ట్రాలకు రైల్వే మంత్రి వినతి
కరోనా కారణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు శ్రామిక్ రైళ్లకు అనుమతి ఇవ్వడం లేదు. దీంతో దీనిపై స్పందించిన కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్ విషయాన్ని రాష్ట్రాల దృష్టికి తీసుకెళ్లారు
లాక్‌డౌన్ కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు ఉపాధి కోసం సొంతూళ్లను, అయినవాళ్లను వదలిపెట్టి వచ్చిన వలసకూలీలు ఉపాధి లేక తిరిగి స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. కాలినడకన, సైకిల్, బైక్ ఇలా ఏది కుదిరితే దానిపై ప్రయాణం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో వలస కూలీల ఇబ్బందులను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసింది. అయితే కరోనా కారణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు శ్రామిక్ రైళ్లకు అనుమతి ఇవ్వడం లేదు.
Also Read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: భుజాలపై కూతురితో 900 కి.మీ నడిచిన తల్లి
దీంతో దీనిపై స్పందించిన కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్ విషయాన్ని రాష్ట్రాల దృష్టికి తీసుకెళ్లారు. రాబోయే మూడు నాలుగు రోజుల్లో వలస కూలీలను తరలించేందుకు అవసరమయ్యే రైళ్లను రైల్వేశాఖ నడుపుతుందని.. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతివ్వాలని కోరారు.
ప్రధాని ఆదేశాల మేరకు రైల్వేశాఖ రోజుకు 300 శ్రామిక్ రైళ్లను నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని గోయల్ చెప్పారు. దాదాపు 20 లక్షల మంది వలస కూలీలను ఐదు రోజుల్లో వారి స్వస్థలాలకు చేర్చేందుకు 300 రైళ్లు నడిపే సామర్ధ్యం రైల్వేశాఖకు ఉందని సీనియర్ ఉద్యోగి ఒకరు స్పష్టం చేశారు.
Also Read:వందే భారత్: 335 మంది భారతీయులతో గల్ఫ్ నుంచి కేరళ చేరుకున్న రెండు విమానాలు
అయితే పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు తక్కువ స్థాయిలో రైళ్లకు అనుమతిస్తున్నాయని చెప్పారు. కాగా ప్రత్యేక రైళ్లు నడిపేందుకు అనుమతివ్వాలంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరిన నేపథ్యంలో ఆ వెంటనే పీయూష్ గోయెల్ అన్ని రాష్ట్రాలకు ఈ విషయంపై విజ్ఞప్తి చేయడం గమనార్హం.