కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకొచ్చే భారత్ రిపాట్రియేషన్ మిషన్ "వందే భారత్" రెండవ రోజున గల్ఫ్ దేశాల నుంచి 335 మందిని వెనక్కి తీసుకొచ్చారు. ప్రయాణికులతో కూడిన రెండు విమానాలు నిన్న రాత్రి కేరళలో ల్యాండ్ అయ్యాయి. 

మొదటి విమానం 84 మంది గర్భిణులు, 22 మంది చిన్నారులతో కలిపి మొత్తం 153 మందితో సౌదీ అరేబియా నుంచి కోజికోడ్ ఎయిర్ పోర్టులో శుక్రవారం రాత్రి 8.30 ప్రాంతంలో ల్యాండ్ అయింది. 

మరో విమానం బహ్రెయిన్ నుంచి 177 మంది ప్రయాణికులతో రాత్రి 11.30 ప్రాంతంలో కొచ్చిన్ ఎయిర్ పోర్టులో దిగింది. ఈ ప్రయాణికులందరిని వెనక్కి తీసుకొచ్చే ముందు ఆయా విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ నిర్వహించారు. 

ఇక్కడ ల్యాండ్ అయ్యాక కూడా థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ వచ్చిన ప్రయాణికుల్లో పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారని కేరళ ప్రభుత్వం తెలిపింది. 

ఏయే దేశాల నుంచి ఎంతమంది వచ్చారనే విషయాన్నీ పౌరవిమానయాన శాఖామంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. బహ్రెయిన్ నుంచి 182 మంది, సింగపూర్ నుంచి 234, ఢాకా నుండి 168 మంది, సౌదీ అరేబియా నుండి 158 మంది భారతదేశం చేరుకున్నట్టు ఆయన తెలిపారు.