పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే లంచం కేసులో అరెస్టు అయ్యారు. రూ.25 లక్షల గ్రాంట్ ను విడుదల చేసేందుకు ఎమ్మెల్యే పీఏ లంచం డిమాండ్ చేశారని ఓ సర్పంచ్ ఫిర్యాదు చేశాడు. దీంతో అతడిని ఈ నెల 16వ తేదీన విజిలెన్స్ అధికారులు అరెస్టు చేయగా.. బుధవారం సాయంత్రం ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు.
భగవంత్ మాన్ ప్రభుత్వానికి మరో మచ్చ పడింది. పంజాబ్‌లోని భటిండా రూరల్ స్థానానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమిత్ రతన్ కోట్‌ఫట్టా ను లంచం కేసులో విజిలెన్స్ బ్యూరో అరెస్టు చేసింది. అంతకు ముందు ఫిబ్రవరి 16న అతని పీఏను అరెస్టు చేశారు. పీఏ రేషమ్ గార్గ్ రూ. 4 లక్షలు లంచం తీసుకుంటుండగా విజిలెన్స్ బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ కేసులో తాజాగా ఎమ్మెల్యేను కూడా రాజ్‌పురాలో బుధవారం సాయత్రం అరెస్టు చేసినట్టు విజిలెన్స్ బ్యూరో అధికారి ఒకరు తెలిపారని ‘ఎన్డీటీవీ’ నివేదించింది.
అరెస్టు అయిన ఎమ్మెల్యేను రిమాండ్ కు తరలించేందుకు గురువారం కోర్టులో హాజరుపరచనున్నారు. భటిండాలోని ఘుడా గ్రామ సర్పంచ్ తన గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన రూ.25 లక్షల ప్రభుత్వ గ్రాంట్ ను విడుదల చేసేందుకు ఎమ్మెల్యే ఏపీ రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేస్తున్నాడని ఫిర్యాదు చేశాడు. విజిలెన్స్ అధికారుల పథకంలో భాగంగా సర్పంచ్ ఎమ్మెల్యే పీఏకు రూ.4 లక్షలు ఇస్తానని అంగీకరించాడు. దీంతో ఫిబ్రవరి 16వ తేదీన సర్పంచ్ పీఏ రషీమ్ గార్గ్‌తో మాట్లాడుతూ రూ.4 లక్షలు ఇస్తుండగా డీఎస్పీ సందీప్ సింగ్ నేతృత్వంలో విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.
ఖలిస్తాన్ ఉగ్రవాద-గ్యాంగ్ స్టర్ నెట్ వర్క్ పై ఎన్ఐఏ దాడులు.. ఆరుగురి అరెస్టు
అయితే ఈ సమయంలో పీఏ పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ చివరికి అధికారులకు చిక్కడంతో అరెస్టు చేశారు. కాగా.. రేషమ్ గార్గ్ తనకు ఎలాంటి సంబంధమూ లేదని కోట్‌ఫట్టా గతంలోనే ఖండించారు. నిందితుడు తన పీఏ కాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పరువు తీసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అయితే అప్పటి నుంచి ఆయనను అరెస్ట్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ విషయంలో రాష్ట్రంలో బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారుల మధ్య చర్చ జరిగింది.
కాగా.. ఈ కేసులో నిందితులపై విజిలెన్స్ బ్యూరో బటిండా పోలీస్ స్టేషన్‌లో అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా తదుపరి చర్యలు చేపడుతోంది. ఇదిలా ఉండగా.. గత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ టిక్కెట్‌పై అమిత్ రతన్ కోట్‌ఫట్టా ఎమ్మెల్యే గెలుపొందారు.
