ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీకి సంబంధించి ఆరుగురు సభ్యుల ఎన్నికల సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది. స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ప్రక్రియ వేళ ఆప్, బీజేపీ కౌన్సిలర్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీకి సంబంధించి ఆరుగురు సభ్యుల ఎన్నికల సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ప్రక్రియ బుధవారం ఉదయం ప్రారంభమైంది. మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను ఆప్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. ఆ తర్వాత స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. అయితే గత రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు సభలో గందగోళ దృశ్యాలు దర్శమిచ్చారు. ఆప్, బీజేపీ కౌన్సిలర్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పలువురు మహిళ సభ్యులు ఒకరినొకరు తోసుకున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. బీజేపీ కౌన్సిలర్లు గాల్లోకి వస్తువులను విసిరేసి తమ సభ్యులపై దాడి చేశారని ఆప్ ఆరోపిస్తుంది.
అదే సమయంలో ఇరు పార్టీలకు చెందిన కౌన్సిలర్లు.. పోటాపోటీగా నినాదాలు చేయడంతో అర్దరాత్రి వేళ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు కౌన్సిలర్లు బ్యాలెట్ బాక్సులను వెల్‌లోకి విసిరేశారు. ఒకరిపై ఒకరు వాటర్ బాటిళ్లు కూడా విసుకున్నారు. బీజేపీ మహిళా కౌన్సిలర్లు ఓటింగ్‌ను అడ్డుకున్నారని ఆప్ ఆరోపించన నేపథ్యంలో ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్‌ను వారిని బయటకు పంపించాల్సి వచ్చింది. గత రాత్రి నుంచి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పలు మార్లు వాయిదా పడింది.
సీక్రెట్ ఓటింగ్ సందర్భంగా కౌన్సిలర్లు తమ మొబైల్ ద్వారా బ్యాలెట్ ఫొటోలు తీస్తున్నారని.. ఇది రహస్య బ్యాలెట్ ఉల్లంఘనేనని బీజేపీ ఆరోపించడంతో స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక సందర్భంగా గందరగోళం నెలకొంది. ఇప్పటివరకు పోలైన ఓట్లను తిరస్కరించి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేసింది.
అయితే ఇందుకు మేయర్ షెల్లీ ఒబెరాయ్ అంగీకరించలేదు. ఈ క్రమంలోనే బీజేపీ కౌన్సిలర్లు సభలో వెల్ వద్దకు చేరుకుని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇక, షెల్లీ ఒబెరాయ్ మాట్లాడుతూ.. స్టాండింగ్ కమిటీలోని ఆరుగురు సభ్యులను ఎంపిక చేయడానికి ఎన్నికలను నిర్వహించే ప్రక్రియలో కొంతమంది బీజేపీ కౌన్సిలర్లు తనపై దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని.. మేయర్ సభను వాయిదా వేసిన సమయంలో ఇది జరిగిందని ఆప్ వర్గాలు చెబుతున్నాయి.
ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ సభ ఈరోజు తెల్లవారుజామున తిరిగి ప్రారంభమైన తర్వాత అనేకసార్లు వాయిదా పడింది. ఆప్, బీజేపీ సభ్యులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో వాగ్వాదం కొనసాగింది. దీంతో సభలో పదే పదే అంతరాయాలు చోటుచేసుకున్నాయి. బీజేపీ సభ్యులు ‘రఘుపతి రాఘవ రాజారాం’, ‘హనుమాన్ చాలీసా’ అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలియజేశారు.
ఎవరి వాదన వారిదే..
అయితే స్టాండింగ్ కమిటీ ఎన్నికను ఆపేందుకు బీజేపీ బ్యాలెట్ బాక్సులను దొంగిలించిందని ఆప్ ఆరోపించింది. ‘‘బీజేపీ మేయర్ అభ్యర్థి రేఖా గుప్తా తన ఓటమికి ఎంత ఆవేశపడ్డారో చూడండి. సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ రాత్రంతా సభలో గందరగోళం నెలకొంది. బీజేపీ కౌన్సిలర్లు గూండాయిజం, విధ్వంసానికి పాల్పడ్డారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికను అనుమతించలేదు’’ అని ఆప్ ట్వీట్టర్‌లో పేర్కొంది.
మరోవైపు ఆప్‌పై బీజేపీ విమర్శలు గుప్పించింది. ‘‘ఫ్రాడ్ ఆద్మీ పార్టీ అరాచకవాదం. గూండాగిరితో ఎంసీడీ ఎన్నికలకు అంతరాయం కలిగించింది. ఆపై బీజేపీని నిందించింది. మేయర్ ఎన్నిక వారి వైపు నుంచి పారిపోయినప్పుడు, వారు గూండాగిరికి దిగారు. స్టాండింగ్ కమిటీకి ఎన్నికలను నిరోధించడానికి అంతరాయం కలిగించారు’’ అని బీజేపీ నేత బైజయంత్ జే పాండా ట్వీట్ చేశారు.
ఇక, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ప్రక్రియపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నిక ప్రక్రియ మూడు సార్లు వాయిదా పడింది. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో.. లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా అనుమతి మేరకు మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ప్రక్రియ బుధవారం ఉదయం ప్రారంభమైంది. తొలుత మేయర్ ఎన్నిక జరగగా.. బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల తేడాతో ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ విజయం సాధించారు. ఆ తర్వాత సభ కొద్దిసేపు వాయిదా పడింది. ఆ తర్వాత సభ ప్రారంభం కాగా.. డిప్యూటీ మేయర్ స్థానాన్ని కూడా ఆప్ కైవసం చేసుకుంది. ఆప్‌కి చెందిన ఆలే మొహమ్మద్ ఇక్బాల్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నూతన డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు.
