ప్రధాని నరేంద్ర మోదీ మారిషస్ పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా వెళ్లనున్న మోదీ పలు కీల ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. మోదీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
PM Modi Mauritius Visit: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా మారిషస్ వెళ్లనున్నారు. మంగళవారం నుంచి రెండు రోజులు పాటు ఈ పర్యటన ఉంటుంది. మార్చి 12న జరిగే ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రధాని రెండు రోజుల టూర్ లో మారిషస్ తో చాలా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోనున్నారు. ఈ ఒప్పందాల్లో వ్యాపారం, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు పలు సహకారం ఒప్పందాలు ఉండనున్నాయి. అలాగే భారతదేశ సహకారంతో మారిషస్ లో నిర్మించిన సివిల్ సర్వీస్ కాలేజీ, ఏరియా హెల్త్ సెంటర్ ను కూడా మోదీ ప్రారంభించనున్నారు.
మారిషిస్ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా:
ప్రధాని మోదీ మార్చి 12న మారిషస్ నేషనల్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ ప్రోగ్రామ్ లో ఇండియన్ ఆర్మీ కూడా పాల్గొంటుంది. దీంతో పాటు ఇండియన్ నేవీ షిప్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానుందని అధికారులు తెలిపారు.
భారత్-మారిషస్ సంబంధాలు, విజన్ సాగర్
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి ఈ పర్యటన గురించి మాట్లాడుతూ.. మారిషస్ హిందూ మహాసముద్రంలో ఇండియాకు ముఖ్యమైన భాగస్వామి అని తెలిపారు. రెండు దేశాల సంబంధాలు చరిత్ర, సంస్కృతి, ప్రజల అనుబంధంపై ఆధారపడి ఉన్నాయి. గత 10 ఏళ్లలో భారత్-మారిషస్ సంబంధాలు బాగా పెరిగాయని మిశ్రి చెప్పారు. ఇండియా మారిషస్ కు నమ్మకమైన అభివృద్ధి సహాయకుడిగా ఉంది. ఆర్థికాభివృద్ధి, సామర్థ్యం పెంపుదల నుంచి రక్షణ, సముద్ర సామర్థ్యాల వరకు చాలా సహాయం చేసింది.
పీఎం మోదీ, పీఎం నవీన్ చంద్ర రామ్ గులాంల మధ్య ముఖ్యమైన సమావేశాలు.
మారిషస్ లో నవంబర్ 2024లో జరిగిన ఎన్నికల తర్వాత నవీన్ చంద్ర రామ్ గులాం ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుత ప్రధాని మోదీ పర్యటన ఇద్దరు నాయకుల మధ్య సంబంధాలను సమీక్షించడానికి, భవిష్యత్తు గురించి ప్లాన్ చేయడానికి అవకాశం ఇస్తుందని మిశ్రి చెప్పారు. ఈ సమయంలో ప్రధాని మోదీ మారిషస్ కొత్త ప్రెసిడెంట్ ధరంబీర్ గోకుల్ ను కూడా కలుస్తారు.
భారత సహాయంతో అభివృద్ధి చేసిన ప్రాజెక్టుల ప్రారంభం
ఈ టూర్ లో పీఎం మోదీ, ప్రధాని రామ్ గులాం కలిసి ఇండియా సహాయంతో అభివృద్ధి చేసిన కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అలాగే, సామర్థ్యం పెంపుదల, వ్యాపారం, ఆర్థిక నేరాలు, చిన్న పరిశ్రమలను పెంచడానికి సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. దీంతో పాటు పీఎం మోదీ మారిషస్ లోని భారతీయులు, ఇండియా స్నేహితులు, సాంస్కృతిక సంస్థలను కూడా కలుస్తారు.
