PM Modi: బ్యాలెట్ పేపర్లతో నిర్వహించిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి విజయం ద‌క్క‌లేద‌ని మోదీ అన్నారు. నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్‌ను ప్రశ్నించిన ప్రధాని మోదీ

ఈవీఎమ్ మిషిన్ల వినియోగం మీద ప్ర‌తిప‌క్ష పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న సమయంలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యంగా స్పందించారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 28 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయాన్ని తన పోస్టులో ప్రస్తావించారు. ఈ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లను ఉపయోగించారని గుర్తుచేస్తూ, కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో గెలిచిందో అంచనా వేయాలంటూ ప్రశ్నించారు. తన వ్యాఖ్యలకు ఆలోచనలో ఉన్నట్లుగా కనిపించే ఎమోజీని కూడా జత చేశారు. దీంతో ఆయన పోస్టు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

కర్ణాటకలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో జరిగిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ స్థానాల్లో బీజేపీ–జేడీ(ఎస్) కూటమి విజయం సాధించగా, కాంగ్రెస్‌కు ఒక్క స్థానం కూడా దక్కలేదు. అధికారంలో ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవకపోవడాన్ని బీజేపీ నేతలు విమర్శలకు అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. ఈ ఫలితాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఎన్నికలపై చేస్తున్న ఆరోపణలను అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

మిగతా రాష్ట్రాల్లోనూ భిన్నమైన ఫలితాలు

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలు పలు స్థానాలను దక్కించుకున్నాయి. బీహార్‌లో ఆర్జేడీ, బీజేపీ, జన సూరాజ్ పార్టీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించారు. ముఖ్యంగా దర్భంగా టీచర్స్ నియోజకవర్గంలో జన సూరాజ్ పార్టీ గెలుపొందడం ఆ పార్టీకి కీలక పరిణామంగా నిలిచింది. మరోవైపు, మహారాష్ట్రలోని కొన్ని స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ నాలుగు రాష్ట్రాల ఫలితాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ సాధించిన విజయాలపై మోదీ ప్రశ్నలు సంధించారు.

Scroll to load tweet…

మళ్లీ వేడెక్కిన బ్యాలెట్ పేపర్–ఈవీఎం వివాదం

ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కాంగ్రెస్‌తో పాటు పలు ప్రతిపక్ష పార్టీలు గత కొంతకాలంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలు లేవనెత్తడంతో పాటు ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే బీజేపీ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాకపోవడాన్ని ప్రస్తావిస్తూ మోదీ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఈ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. ఎన్నికల ఫలితాలను ఇరు పక్షాలు తమ వాదనలకు అనుగుణంగా ప్రస్తావిస్తుండటంతో రాజకీయ చర్చ మరింత ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్ ర్యాలీకి ముందు మోదీ వ్యాఖ్యలతో రాజకీయ వేడి

నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ‘ఓటును కాపాడండి–దేశాన్ని కాపాడండి’ నినాదంతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు కాంగ్రెస్, ఇండియా కూటమి సిద్ధమవుతున్నాయి. ఎన్నికల ప్రక్రియపై తమ అభ్యంతరాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సమయంలోనే మోదీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు ఎన్నికల పారదర్శకతపై ప్రతిపక్షాల ప్రశ్నలు, మరోవైపు వాటికి బీజేపీ ఇస్తున్న సమాధానాలతో రానున్న రోజుల్లో ఈ అంశంపై రాజకీయ వాదోపవాదాలు మరింత పెరిగే అవకాశం ఉంది.