దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 300 మార్క్‌ను దాటేశాయి. కేరళ, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కొత్త వెలుగులోకి వచ్చాయి. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కరోనాపై పోరు ఇంకా ముగిసిపోలేదని, ముందు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని ఆయన సూచనలు చేశారు. జాగరూకత, ముందు జాగ్రత్తలు చాలా అవసరమని పేర్కొన్నారు. 

న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్(Omicron Variant) కేసులు పెరుగుతున్నాయి. తాజాగా, తమిళనాడు ఒక్కసారిగా 33 మందిలో ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్టు తేలింది. తెలంగాణలోనూ కొత్తగా 14 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. కేరళ, కర్ణాటకల్లోనూ కొత్త ఒమిక్రాన్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 300 మార్క్‌ను దాటేశాయి. కరోనా కేసులు భారీగా రిపోర్ట్ అవుతున్నాయి. కేవలం ముంబయి మహానగరంలోనే సింగిల్ డేలో 602 కొత్త కేసులు నమోదయ్యాయి. అక్టోబర్ 6వ తేదీ తర్వాత మళ్లీ ఈ స్థాయిలో కొత్త కేసులు రిపోర్ట్ కావడం ఇదే తొలిసారి. ఇలాంటి వార్తలు దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళనలను రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Modi) నేడు సాయంత్రం ఉన్నత అధికారులతో సమావేశం(Review Meeting) అయ్యారు.

ఉన్నత అధికారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అదే అలర్ట్‌నెస్ అమలు చేయాలని ప్రధాని మోడీ సూచించారు. కరోనా కట్టడికి ప్రయత్నిస్తున్న రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో మెదులు కోవాలని సూచనలు చేశారు. ముందు జాగ్రత్తగా, కేంద్రీకృతంగా, సహకారపూర్వక కేంద్ర ప్రభుత్వ వ్యూహమేఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రజలందరికీ ఉపకరిస్తుందని తెలిపారు. కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ జాగరూకతగా, ముందు జాగ్రత్తలతో ఉండాలని చెప్పారు. కరోనా మహమ్మారిపై పోరాటం ఇంకా ముగిసి పోలేదని అన్నారు. ప్రజలు తప్పకుండా కొవిడ్ నిబంధనలు పాటించాలని వివరించారు.

Also Read: పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. పండుగల సెలబ్రేషన్స్‌పై ఆంక్షలు పెట్టండి: రాష్ట్రాలకు కేంద్రం సూచనలు

ప్రతి రాష్ట్రంలో ఎలాంటి ఆరోగ్య సంక్షోభ పరిస్థితులనైనా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉంచాలని ప్రధాని మోడీ ఈ సమావేశానికి హాజరైన ఉన్నత అధికారులకు ఆదేశించారు. ఒమిక్రాన్ వేరియంట్ సృష్టించే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి జిల్లా స్థాయి నుంచే అన్నింటిని సంసిద్ధం చేశామని వివరించారు. పేషెంట్లకు ఆక్సిజన్ వసతులు కల్పించాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయంలో కొనసాగాలని, వైద్య సిబ్బంది, అంబులెన్స్‌లు, క్వారంటైన్, ఐసొలేషన్‌ కోసం గదుల ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీ ఈ రివ్యూలో సూచించారు. టెలీ మెడిసిన్, టెలీ కన్సల్టేషన్ వంటి విధానాలపై దృష్టి సారించాలని చెప్పినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉండగా, దేశంలో కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది తొలినాళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు చేసింది. టీకా పంపిణీని వేగవంతం చేయాలని, ముఖ్యంగా కరోనా తాకిడి తక్కువగా ఉన్న ప్రాంతాలపై ఫోకస్ పెట్టాలని తెలిపింది.

Also Read: తెలంగాణ: కొత్తగా 177 మందికి కరోనా.. హైదరాబాద్‌లో అత్యధికం, రాష్ట్రంలో పెరుగుతోన్న యాక్టీవ్ కేసులు

కోవిడ్ కట్టడికి రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. కోవిడ్ కేసుల పెరుగుదలపై రాష్ట్రాలు అప్రమత్తంగా వుండాలని సూచించింది. కోవిడ్, ఒమిక్రాన్ పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ఎక్కువ కేసులున్న కోవిడ్ క్లస్టర్లను పర్యవేక్షించాలని సూచించింది. కోవిడ్ క్లస్టర్లలో కంటైన్‌మెంట్, బఫర్ జోన్లను ఏర్పాటు చేయాలని కోరింది. కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ విధించాలని సూచించింది. పండుగల సీజన్‌లో ఆంక్షలు, పరిమితులను విధించాలని కోరింది. ప్రజలు గూమిగూడే ప్రాంతాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పింది. అర్హులైన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని.. వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని కేంద్రం సూచించింది.