PM Modi addresses Ghana’s Parliament: ప్రధాని మోడీ ఘనా పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ గ్లోబల్ సౌత్‌కు స్వరం ఇవ్వకుండా ప్రపంచ అభివృద్ధి సాధ్యం కాదన్నారు. అభివృద్ధి అందరికీ కావాలి.. ఒక్కరికి మాత్రమే కాదని ప్రపంచానికి పిలుపునిచ్చారు.
PM Modi addresses Ghana’s Parliament: గురువారం భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఘనాలోని క్వామే ఎన్‌క్రుమా మెమోరియల్ పార్క్ వద్ద ఘనా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ ఎన్‌క్రుమాకు నివాళి అర్పించారు. ఇది భారత ప్రభుత్వం ఘనా చరిత్రకు చూపించిన గౌరవం, రెండు దేశాల మైత్రిని మరింత బలపరిచిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆ తర్వాత ఘనా పార్లమెంట్ లో ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఘనా పార్లమెంట్ లో ప్రధానమంత్రి మోడీ ప్రసంగం
ప్రధాని నరేంద్ర మోడీ ఘనా పార్లమెంట్‌లో మాట్లాడుతూ, ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ వ్యవస్థ వేగంగా మారుతుందని, టెక్నాలజీ విప్లవం, గ్లోబల్ సౌత్ ఎదుగుదల, జనాభా మార్పులు ఈ మార్పును వేగవంతం చేస్తున్నాయని తెలిపారు.
“గత శతాబ్దంలో ఏర్పడిన సంస్థలు నేటి సవాళ్లకు తగిన విధంగా స్పందించలేకపోతున్నాయి. గ్లోబల్ గవర్నెన్స్‌లో సమర్థవంతమైన సంస్కరణలు అవసరం. అభివృద్ధి సాధించాలంటే గ్లోబల్ సౌత్‌కు స్వరం ఇవ్వాల్సిందే. నినాదాలు కాకుండా చర్యలే అవసరం” అని మోడీ స్పష్టం చేశారు.
కొత్త దశలోకి భారత-ఘనా సంబంధాలు
ఘనా అధ్యక్షుడు జాన్ డ్రామనీ మహామాతో కలసి రెండు దేశాల వాణిజ్యాన్ని వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని నిర్ణయించినట్టు మోడీ చెప్పారు. “ఘానా అభివృద్ధి ప్రయాణంలో భారత్ భాగస్వామి మాత్రమే కాకుండా తోడుగా వచ్చే ప్రయాణికుడు” అని ఆయన అన్నారు.
“మా అభిప్రాయం సాఫ్ట్ పవర్ కంటే ఎక్కువ. మేము స్థానిక సామర్థ్యాలను నిర్మించడానికి, స్థానిక అవకాశాలను సృష్టించడానికి పనిచేస్తున్నాం. మా లక్ష్యం కేవలం పెట్టుబడులు పెట్టడం కాదు.. శక్తినివ్వడం” అని మోడీ తెలిపారు. ఆఫ్రికా కోసం ‘ఆఫ్రికా అజెండా 2063’ లక్ష్యాలను భారత్ పూర్తి మద్దతుతో అమలు చేస్తోందని ప్రధాని వివరించారు.
“భారత్‌లో మూడవసారి ఒకే ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. ఇది గడచిన 60 ఏళ్లలోనే తొలిసారి జరిగింది. మా దేశం త్వరలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. ఇప్పటికే ప్రపంచ అభివృద్ధికి 16% వరకు భారత్ సాకారం అందిస్తోంది” అని మోడీ పేర్కొన్నారు.
చంద్రయాన్, భారత అంతరిక్షం రంగాన్ని ప్రస్తావించిన ప్రధాని మోడీ
భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ ఆర్థిక వ్యవస్థగా ఉంది. “చంద్రయాన్ చంద్రుడి దక్షిణ ధృవంపై దిగినప్పుడు నేను ఆఫ్రికాలో ఉన్నాను. ఈ రోజు, భారతీయ ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలో ప్రయోగాలు నిర్వహిస్తుండగా, మళ్లీ నేను ఆఫ్రికాలోనే ఉన్నాను. ఇది యాదృచ్ఛికం కాదు.. ఇది మా బంధాన్ని ప్రతిబింబిస్తుంది” అని మోడీ అన్నారు.
ప్రపంచం ఒక కుటుంబం అనే భారత తత్వాన్ని ప్రధాని మోడీ మరోసారి స్పష్టం చేశారు. “మేము ‘వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్’ అనే దృష్టితో జీ20లో పనిచేశాం. ఆఫ్రికన్ యూనియన్‌ను శాశ్వత సభ్యుడిగా చేర్చినందుకు గర్విస్తున్నాం. కోవిడ్ సమయంలో 150 కంటే ఎక్కువ దేశాలకు వాక్సిన్లు, ఔషధాలు పంపాం” అని మోడీ చెప్పారు.
భారత ప్రజాస్వామ్యం పై ప్రధాని మోడీ
“భారతదేశం ప్రజాస్వామ్యపు తల్లి. దేశంలో 2,500 కంటే ఎక్కువ రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇది భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. ఘనాలో భారతీయులు టీలో చక్కెరలా కలిసిపోయారు” అంటూ మోడీ చిరునవ్వుతో వ్యాఖ్యానించారు.
ఘనాలో లభించిన గౌరవం, ఆ దేశ పురస్కారాన్ని ప్రధాని మోడీ ప్రస్తావిస్తూ.. “నిన్న రాత్రి మీరు ఇచ్చిన గౌరవం నాకు మర్చిపోలేనిది. ఈ పురస్కారాన్ని నేను 1.4 బిలియన్ భారతీయుల తరఫున అంకితంగా స్వీకరిస్తున్నాను. ఇది భారత్-ఘనా మైత్రికి ప్రతీక” అని మోడీ అన్నారు.
“ఘానా మాత్రమే కాదు, ఆఫ్రికా ఖండమంతా ప్రజాస్వామ్యం, నైతిక విలువల మద్దతుదారుగా ఎదుగుతోంది. భారత్ ఈ ప్రయాణంలో శ్రద్ధగా తోడుగా నిలుస్తుంది” అంటూ మోడీ తన ప్రసంగాన్ని ముగించారు.
