భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు ఎదురుపడి నవ్వుతూ ఒకరినొకరు పలుకరించుకున్నారు. కరచాలనం చేశారు. ఇందుకు సంబంధించిన షార్ట్ వీడియో ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఇద్దరూ ఎదురుపడ్డారు. ఒకరినొకరు చూసుకుని నవ్వుతూ పలకరించుకున్నారు. చేతులు కలుపుకున్నారు. ఇండోనేషియాలో బాలీ వేదికగా జీ 20 శిఖరాగ్ర సదస్సు జరుగుతున్నది. ఈ సదస్సుకు హాజరైన ఈ నేతలు ఇద్దరూ కలుసుకున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నిర్వహించిన డిన్నర్ పార్టీలో వీరిద్దరూ ఎదురుపడ్డారు. వీరిద్దరూ కరచాలనం చేసుకుని మాట్లాడుతున్న షార్ట్ వీడియో ఒకటి చాలా మందిని ఆకర్షించింది.

గత రెండేళ్లుగా ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు దిగజారాయి. సరిహద్దులో చైనా కవ్వింపు చర్యలతో మోడీ, జిన్‌పింగ్‌ల మధ్య కూడా పలకరింపులు, కరచలనాలు లేకుండా పోయాయి. ఇదే ఏడాది సెప్టెంబర్ 15, 16 తేదీల్లో ఉజ్బెకిస్తాన్ సమర్‌ఖండ్‌లో నిర్వహించి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులోనూ వీరిద్దరూ వేదిక పంచుకున్నప్పటికీ పలుకరించుకోలేదు. ఇద్దరూ డిస్టెన్స్ మెయింటెన్ చేశారు.

Also Read: అగ్గితో చెలగాటమాడితే.. మాడిపోతారు: తైవాన్ అంశంపై బైడెన్‌కు జిన్‌పింగ్ ఘాటు వార్నింగ్

లడాక్‌లో 2020 జూన్‌లో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనా వైపు 40 మంది జవాన్లు గాయపడ్డారు లేదా మరణించారు. ఆ ఘటన జరిగినప్పటి ఉభయ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ద్వైపాక్షిక సమావేశాలూ నిలిచిపోయాయి. మళ్లీ తొలిసారిగా వీరిద్దరూ కరచాలనం చేసుకున్నారు. పలకరించుకుని మాట్లాడారు.

ఈ రోజు జీ20 నేతలతో ప్రధాని మోడీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. కానీ, ఈ నేతల జాబితాలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ లేకపోవడం గమనార్హం.