పహల్గాం దాడి తర్వాత మోదీ మధుబనిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ మోదీ ఏమన్నారంటే..
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత ప్రధాని మోదీ మధుబనిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బీహార్‌లోని మధుబని జిల్లాలో పంచాయతీ రాజ్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మధుబని పర్యటన
మధుబనిలో రూ.3,500 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయాల్సి ఉండగా, పహల్గాం దాడి నేపథ్యంలో ఉత్సవ కార్యక్రమాలన్నీ రద్దు చేశారు. మోదీ ప్రసంగంలో పహల్గాం ఘటనపై దృష్టి సారించారు.
ప్రజలకు విజ్ఞప్తి
మోదీ ప్రసంగం ప్రారంభించకముందు, మృతులకు రెండు నిమిషాలు మౌనం పాటించాలని ప్రజలను కోరారు.
గ్రామాలు బలంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందనే గాంధీజీ ఆలోచనతో పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేశామని, గత పదేళ్లలో పంచాయతీలను బలోపేతం చేసేందుకు అనేక చర్యలు తీసుకున్నామని మోదీ అన్నారు. భూమి వివాదాలను త్వరగా పరిష్కరించేందుకు భూమి పత్రాలను డిజిటలైజ్ చేశామని, దేశానికి కొత్త పార్లమెంటు వచ్చినట్లే 30 వేలకు పైగా పంచాయతీ భవనాలు నిర్మించామని తెలిపారు.
పహల్గాం దాడిపై మోదీ వ్యాఖ్యలు
పహల్గాం దాడిలో మృతి చెందినవారి కుటుంబాలకు మోదీ సానుభూతి తెలిపారు. ఉగ్రవాదులకు ఊహించని శిక్ష పడుతుందని, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
