కరోనా కేసులు పెరిగినా.. దానిని ఎదుర్కొవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అన్నారు. ఒమిక్రాన్ పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. కరోనా జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని సూచించారు.
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్‌తో పాటు కోవిడ్ -19 డెల్టా కేసులూ ఎక్కువగానే నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. కరోనాను కంట్రోల్ చేసేందుకు అసవరమైన చర్యలు తీసుకుంటున్నాయి. అయినా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రెండు వేవ్‌లు దేశాన్ని ఇబ్బంది పెట్టాయి. దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీశాయి. నిరుద్యోగం పెరిగింది. ఉద్యోగులు రోడ్డున పడ్డారు. అలాగే ఎన్నో కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోయాయి. అలాంటి పరిస్థితులు రాకూడదని అన్నిరాష్ట్రాలు కఠిన ఆంక్షలు విధించడం మొదలుపెట్టాయి.
ఒమిక్రాన్ వేరియంట్ లోకల్‌గా వ్యాపిస్తున్నది: ఢిల్లీ మంత్రి
ఈ సారి అలా చేయొద్దు...
కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో థర్డ్ వేవ్ భయం మొదలైంది. దీంతో ప్రజల్లో మరింత ఆందోళన ఎక్కువవుతోంది. అయితే గతంలో రెండో వేవ్ వచ్చినప్పుడు చాలా మంది ముందస్తుగా ఆక్సిజన్ సిలిండర్లు, మందులు నిల్వ చేసుకున్నారు. అలాగే బెడ్స్ కూడా బుకింగ్ చేసుకున్నారు. ఈ సారి అలాంటివి చేయవద్దని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా సూచించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. దేశంలో కరోనా కేసులు పెరిగినా దానిని ఎదుర్కొవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అయితే ఇప్పుడు సోకుతున్న ఒమిక్రాన్ వేరియంట్ స్వల్ప లక్షణాలే ఉంటాయని తెలిపారు. అందువల్ల ఆక్సిజన్ అవసర సపోర్ట్ అవసరం ఉండకపోవచ్చని అన్నారు. కాబట్టి ఎవరూ ఆక్సిజన్ సిలిండర్లు, మందులను నిల్వ చేసుకోకూడదని సూచించారు. ‘మహమ్మారి ఇంకా పూర్తిగా తొలగిపోలేదని ప్రజలు అర్థం చేసుకోవాలి. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కాకపోతే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాబోయే 2022 ప్రతీ ఒక్కరికి సంతోషంగా, ఆరోగ్యంగా, సంపన్నంగా ఉండాలని ఆంకాంక్షించారు. భారతదేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్ వేసుకున్నారని తెలిపారు. అయితే దేశంలో కేసులు పెరుగుతున్నాయని అన్నారు. కరోనా వ్యాప్తిని నివారించడానికి మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటిస్తూ, కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
నాలుగు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్న మహిళకు కరోనా పాజిటివ్.. ఫ్లైట్ ఎక్కకుండా అడ్డుకున్న అధికారులు
దేశంలో పెరిగిన కరోనా కేసులు..
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలో కరోనా కేసులు పెరిగాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇండియాలో ఇప్పటి వరకు 781 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి, ఢిల్లీలో అత్యధికంగా (283) కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత మహారాష్ట్ర (167), గుజరాత్ (73), కేరళ (65), తెలంగాణ (62), రాజస్థాన్ (46), కర్ణాటక (34), తమిళనాడు (34), హర్యానా (12), పశ్చిమ బెంగాల్ (11), మధ్యప్రదేశ్ (9), ఒడిశా (8), ఆంధ్రప్రదేశ్ (6), ఉత్తరాఖండ్ (4), చండీగఢ్ (3), జమ్మూ కాశ్మీర్ (3), ఉత్తరప్రదేశ్ (2), గోవా (1), హిమాచల్ ప్రదేశ్ (1), లడఖ్ (1) మణిపూర్ (1) కేసులు నమోదయ్యాయి.
ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో 923 COVID-19 కేసులు నమోదయ్యాయి, మే 30 తరువాత ఢిల్లీలో ఇన్ని కేసులు నమోదవయడం ఇదే మొదటిసారి. అయితే కరోనా వల్ల ఒక్కరు కూడా మృతి చెందలేదు. కోవిడ్ -19 వల్ల 200 మంది హాస్పిటల్‌లో చేరారు. ఇందులో 145 మంది రోగులకు స్వల్ప లక్షణాలు ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన రెండో వేవ్ వల్ల ప్రజలు ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌లు, రెమ్‌డెసివిర్ వంటి ఇంజెక్షన్‌లను నిల్వ చేసుకున్నారు. దీని వల్ల మార్కెట్ లో వాటి కొరత ఏర్పడింది.
