ఒమిక్రాన్ వేరియంట్ ఢిల్లీలో అత్యధికంగా నమోదు అవుతున్నాయి. తాజాగా, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ఒమిక్రాన్ వ్యాప్తిపై మాట్లాడారు. ఈ వేరియంట్ విదేశీయుల్లోనే కాదు.. ఇక్కడ స్థానికంగా కూడా రిపోర్ట్ అవుతున్నాయని వివరించారు. ఈ వేరియంట్ లోకల్‌గా రిపోర్ట్ అవుతున్నాయని పేర్కొన్నారు. కమ్యూనిటీ లెవల్‌లో కేసులు రిపోర్ట్ అవుతున్నాయని తెలిపారు.
న్యూఢిల్లీ: కరోనా వైరస్(Coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron Variant) తొలిసారి దక్షిణాఫ్రికాలో వెలుగు చూసింది. ఆ తర్వాత వేగంగా దేశాలు దాటి వ్యాపించింది. స్వల్పకాలంలోనే వందకుపైగా దేశాల్లో ఈ వేరియంట్ విస్తరించింది. మన దేశంలో ఈ వేరియంట్ కేసులు తొలిసారిగా కర్ణాటకలోని బెంగళూరులో రిపోర్ట్ అయ్యాయి. ఇందులో ఒకరు విదేశీయుడు, మరొకరు ఓ వైద్యుడు. ఇతర దేశాలు తిరిగి వచ్చిన ఆ విదేశీయుడికి ఒమిక్రాన్ పాజిటివ్ తేలింది. ఆ తర్వాత రెండో కేసు బెంగళూరు వైద్యుడు. కానీ, బెంగళూరు వైద్యుడికి ఇతర దేశాలు తిరిగిన చరిత్ర లేదు. దీంతో ఈ వేరియంట్ స్థానికంగా వ్యాపిస్తున్నదా? అనే అనుమానాలు వచ్చాయి. ఇంకా అధికారిక లెక్కలకు అందని ఒమిక్రాన్ కేసులు సొసైటీలో ఉన్నాయేమోననే భయాలు వచ్చాయి. తాజాగా, ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్(Satyender Jain) ఇదే విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీ(Delhi)లో విదేశాలు తిరిగిన చరిత్ర లేనివారూ ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడ్డ కేసులు ఉన్నాయని వివరించారు. అంటే, ఈ వేరియంట్ స్థానికంగానూ వ్యాపిస్తున్నదని గురువారం పేర్కొన్నారు.
ఢిల్లీలో ఒక్క రోజులోనే ఒమిక్రాన్ కేసులు 23 శాతం పెరిగాయి. ఒక్క రోజే 115 శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా, అందులో 46 కేసులు ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఢిల్లీలో హాస్పిటళ్లలో 200 కొవిడ్ పేషెంట్లు చికిత్స తీసుకుంటున్నారని హెల్త్ మినిస్టర్ సత్యేందర్ జైన్ తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారు సహా 115 మంది పాజిటివ్ పేషెంట్లకు కరోనా లక్షణాలు లేవు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా వారిని హాస్పిటల్స్‌లోనే ఉంచినట్టు వివరించారు. ఢిల్లీలో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మార్చి ఏప్రిల్‌లో వచ్చిన సెకండ్ వేవ్ కంటే కూడా అత్యధిక కేసులు ఢిల్లీలో నమోదవుతున్నాయి. అప్పటి కంటే 21 శాతం వేగంగా కేసులు నమోదు అవుతున్నట్టు డేటా వెల్లడిస్తున్నది. ఢిల్లీలో బుధవారం ఒక్క రోజే 923 కరోనా కేసులు నమోదయ్యాయి.
Also Read: Omicron: ఏడాది కింద చూసిన డిసీజ్ కాదు.. ఇది.. : ఆక్స్‌ఫర్డ్ సైంటిస్ట్
కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం పలు ఆంక్షలను విధించింది. ప్రస్తుతం ఢిల్లీలో ఎల్లో అలర్ట్ ఉన్నది. అంటే.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు అవుతున్నది. విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు, జిమ్‌లు పూర్తిగా మూసేశారు. మెట్రో ట్రైన్స్, ప్రజా రవాణ బస్సుల్లో 50 శాతం మందికే అనుమతి ఉన్నది. రెస్టారెంట్లు, బార్లు రాత్రి 10 గంటలకే క్లోజ్ చేస్తున్నారు. అవి కూడా సగం సామర్థ్యంతో సేవలు అందిస్తున్నాయి.
దేశంలో కరోనా కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. నిన్నటితో పోలిస్తే తాజా కేసుల సంఖ్య 43 శాతం పెరిగింది. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. దేశంలో 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించగా.. ఇప్పటివరకు 961 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం బులిటెన్ విడుదల చేసింది. ఒమిక్రాన్ బారిన పడ్డ వారిలో 320 మంది కోలుకున్నారని వెల్లడించింది. ఒమిక్రాన్ కేసుల విషయానికి వస్తే.. ఢిల్లీలో అత్యధికంగా 263 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 257, గుజరాత్‌లో 97, రాజస్తాన్‌లో 69, కేరళలో 65 కేసులు నమోదయ్యాయి.
